breaking news
WTA Tour finals tournament
-
ఎదురులేని జోడి
లక్ష్యం ఎంత గొప్పగా ఉంటే.. సంకల్పం అంత బలంగా ఉంటుంది. ప్రత్యర్థులు ఎంత పటిష్టంగా ఉంటే.. ఆట కూడా అంతగా మెరుగవుతుంది. ఏ క్షణాన హింగిస్‌తో జత కట్టిందోగానీ భారత స్టార్ సానియా... టెన్నిస్‌లో ఎదురేలేకుండా దూసుకు పోతోంది. టోర్నీ ఎలాంటిదైనా.. ప్రత్యర్థులు ఎవరైనా... వరుస విజయాలతో దుమ్మురేపుతోంది. ఆటలో తిరుగులేని జోడిగా చెలామణి అవుతూ ఈ ఏడాది మహిళల డబుల్స్‌లో పదోసారి ఫైనల్లోకి ప్రవేశించింది. డబ్ల్యూటీఏ టూర్ ఫైనల్స్ టోర్నీ తుదిపోరుకు సానియా-హింగిస్ * ఈ ఏడాది పదో ఫైనల్‌కు అర్హత సింగపూర్: అప్రతిహత జైత్రయాత్ర చేస్తున్న భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జోడి.. ఈ ఏడాది పదో టోర్నీ ఫైనల్లోకి ప్రవేశించింది. ఆదివారం జరిగే ఫైనల్లో టైటిల్ గెలిస్తే ఈ ఏడాది ఈ జోడీ ఖాతాలో తొమ్మిదో టైటిల్ చేరుతుంది. డబ్ల్యూటీఏ టూర్ ఫైనల్స్‌లో భాగంగా శనివారం జరిగిన మహిళల డబుల్స్ సెమీస్‌లో టాప్‌సీడ్ సానియా-హింగిస్ 6-4, 6-2తో మూడోసీడ్ హవో చింగ్ చాన్-యంగ్ జాన్ చిన్ (చైనీస్‌తైపీ)పై అలవోకగా నెగ్గి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. సిన్సినాటి మాస్టర్స్ సెమీస్‌లో ఇదే ప్రత్యర్థి చేతిలో సానియా జోడి అనూహ్యంగా ఓటమిపాలైంది. ఇక అప్పట్నించి తలపడిన మూడుసార్లు ఇండో-స్విస్ జోడి పైచేయి సాధించి ప్రతీకారం తీర్చుకుంది. సానియా జోడికి ఇది వరుసగా 21వ విజయం కావడం విశేషం. గంటా 23 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో తొలి సెట్ ఆరంభంలో తైపీ జంట 3-1 ఆధిక్యాన్ని సాధించింది. కానీ తర్వాతి 14 గేమ్‌ల్లో సానియా-హింగిస్ ఏకంగా 11 గేమ్‌లను గెలిచి ప్రత్యర్థులను కోలుకోలేని దెబ్బతీశారు. ఆద్యంతం మంచి సమన్వయంతో కదులుతూ అద్భుతమైన ఫోర్‌హ్యాండ్, బ్యాక్‌హ్యాండ్ షాట్లతో అదరగొట్టిన సానియా-హింగిస్ మ్యాచ్ మొత్తంలో మూడు ఏస్‌లను సంధించింది. కీలక సమయంలో ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేయడంతో పాటు తమ సర్వీస్‌ను చేజార్చుకోకుండా కాపాడుకుంది. తమ సర్వీస్‌లో ఐదింటిలో రెండు బ్రేక్ పాయింట్లను కాపాడుకున్న ఇండో-స్విస్ జంట... ప్రత్యర్థి సర్వీస్‌లో మరో ఆరు బ్రేక్ పాయింట్లను నెగ్గింది. చాన్ సిస్టర్స్‌పై తాము ప్రత్యేకమైన వ్యూహాన్ని అవలంభించామని మ్యాచ్ అనంతరం సానియా వ్యాఖ్యానించింది. ‘చాలా భిన్నమైన రీతిలో ఆడాం. ముఖ్యంగా మూలాలకు కట్టుబడి ఆడాం. మేం అనుకున్న ప్రణాళికను చక్కగా అమలు చేయగలిగాం. మా బలం, నైపుణ్యంతో పాటు పరస్పరం నమ్మకం ఉంది. ఇవే చాలాసార్లు మ్యాచ్‌లు గెలిపించాయి. 1-3తో వెనుకబడ్డప్పుడు పోరాడాలని నిశ్చయించుకున్నాం. కచ్చితంగా ఏదో సమయంలో బ్రేక్ చేస్తామని అనుకున్నాం. మ్యాచ్‌లో అదే జరిగింది’ అని సానియా పేర్కొంది. -
అజేయంగా సెమీస్‌కు...
* సానియా-హింగిస్ జంట ‘హ్యాట్రిక్’ విజయం * డబ్ల్యూటీఏ టూర్ ఫైనల్స్ టోర్నీ సింగపూర్: తమ విజయపరంపరను కొనసాగిస్తూ సానియా మీర్జా (భారత్)-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) ద్వయం.. మహిళల టెన్నిస్ సీజన్ ముగింపు టోర్నమెంట్ డబ్ల్యూటీఏ ఫైనల్స్‌లో సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన ‘రెడ్ గ్రూప్’ చివరి లీగ్ మ్యాచ్‌లో సానియా-హింగిస్ జంట 6-4, 7-5తో తిమియా బాబోస్ (హంగేరి)-క్రిస్టినా మ్లాడెనోవిచ్ (ఫ్రాన్స్) జోడీపై విజయం సాధించింది. ఈ గెలుపుతో ఈ ఏడాది ఇదే జంట చేతిలో రోమ్ ఓపెన్‌లో ఎదురైన ఓటమికి బదులు తీర్చుకుంది. గంటన్నరపాటు జరిగిన మ్యాచ్‌లో ఈ ఇండో-స్విస్ జంటకు తొలి సెట్లో స్కోరు 4-4 వద్ద ఉన్నపుడు... రెండో సెట్లో స్కోరు 5-5 వద్ద ఉన్నపుడు బ్రేక్ పాయింట్ అవకాశాలు లభించాయి. ఈ రెండింటిని వారు సద్వినియోగం చేసుకొని విజయాన్ని దక్కించుకున్నారు. సానియా-హింగిస్‌కు జంటగా వరుసగా ఇది 20వ విజయం కావడం విశేషం. శనివారం జరిగే సెమీఫైనల్లో హావో చింగ్ చాన్-యుంగ్ జాన్ చాన్ (చైనీస్ తైపీ) జంటతో సానియా-హింగిస్ ద్వయం తలపడుతుంది. ‘ఈ మ్యాచ్‌కు ముందు వారితో రెండుసార్లు తలపడ్డాం. గెలుపోటముల్లో 1-1తో సమఉజ్జీగా ఉన్నాం. దాంతో ఆద్యంతం జాగ్రత్తగా ఆడాలని నిర్ణయించుకున్నాం. ఎప్పటిలాగే మా అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయత్నించాం. అనుకున్న ఫలితాన్ని సాధించాం’ అని మ్యాచ్ అనంతరం సానియా మీర్జా వ్యాఖ్యానించింది. ఎనిమిది నెలల క్రితం మార్టినా హింగిస్‌తో జతకట్టిన సానియా అద్వితీయ ఫలితాలు సాధించింది. హింగిస్‌తో కలిసి ఈ ఏడాది ఏకంగా ఎనిమిది డబుల్స్ టైటిల్స్ సాధించింది. అందులో రెండు గ్రాండ్‌స్లామ్ (వింబుల్డన్, యూఎస్ ఓపెన్) టోర్నమెంట్లు కూడా ఉండటం విశేషం. మరో రెండు విజయాలు సాధిస్తే సానియా-హింగిస్ ఖాతాలో ప్రతిష్టాత్మక డబ్ల్యూటీఏ ఫైనల్స్ టైటిల్ కూడా చేరుతుంది.