సానియా జంట శుభారంభం | Sania Mirza and martina Hingis pair good starting | Sakshi
Sakshi News home page

సానియా జంట శుభారంభం

Apr 10 2015 1:13 AM | Updated on Sep 3 2017 12:05 AM

వరుసగా రెండు టైటిల్స్‌తో జోరు మీదున్న భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జంట ఫ్యామిలీ సర్కిల్ కప్ టోర్నమెంట్‌లో శుభారంభం చేసింది.

ఫ్యామిలీ సర్కిల్ కప్
 
చార్ల్స్‌టన్ (అమెరికా) : వరుసగా రెండు టైటిల్స్‌తో జోరు మీదున్న భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జంట ఫ్యామిలీ సర్కిల్ కప్ టోర్నమెంట్‌లో శుభారంభం చేసింది. భారత కాలమానం ప్రకారం బుధవారం అర్ధరాత్రి దాటాక జరిగిన మహిళల డబుల్స్ తొలి రౌండ్‌లో సానియా-హింగిస్ ద్వయం 6-7 (7/9), 6-3, 10-5తో అనస్తాసియా-అరీనా రొడియోనోవా (ఆస్ట్రేలియా) జంటపై నెగ్గి క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. జోడీగా కలిసి ఆడుతున్న తర్వాత సానియా-హింగిస్ జంట తొలిసారి తమ ప్రత్యర్థి జోడీకి ఓ సెట్‌ను కోల్పోయింది. ఇండియన్ వెల్స్, మియామి ఓపెన్‌లలో ఒక్క సెట్ కూడా చేజార్చుకోకుండా టైటిల్స్ సొంతం చేసుకున్న వీరిద్దరికి ఈసారి గట్టిపోటీనే ఎదురైంది.

తొలి సెట్‌ను టైబ్రేక్‌లో కోల్పోయిన ఈ ఇండో-స్విస్ ద్వయం రెండో సెట్‌లో తేరుకొని మ్యాచ్‌లో నిలిచింది. నిర్ణాయక సూపర్ టైబ్రేక్‌లో కీలకదశలో పాయింట్లు నెగ్గి వరుసగా 11వ విజయాన్ని ఖాయం చేసుకుంది. ఒకవేళ ఫ్యామిలీ సర్కిల్ కప్‌లోనూ విజేతగా నిలిస్తే సానియా మీర్జా డబుల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌ను సొంతం చేసుకుంటుంది. ‘ఈ టోర్నీలో మా పార్శ్వంలోని ‘డ్రా’ కఠినంగా ఉంది. ఇతరులతో పోలిస్తే మేము ఎలాంటి ప్రాక్టీస్ లేకుండానే క్లే కోర్టులపై జరుగుతున్న ఈ టోర్నీలో ఆడుతున్నాం.

మా అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శించాం. తొలి సెట్‌ను నెగ్గాల్సింది. అయితేనేం తొలిసారి సూపర్ టైబ్రేక్‌లో విజయాన్ని దక్కించుకున్నాం’ అని మ్యాచ్ అనంతరం సానియా వ్యాఖ్యానించింది. శుక్రవారం జరిగే క్వార్టర్ ఫైనల్లో అనాబెల్ మెదీనా (స్పెయిన్)-ష్వెదోవా (కజకిస్థాన్) జంటతో సానియా జోడీ తలపడుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement