breaking news
Family Circle Cup Tournament
-
‘వన్’డర్ సానియా...
-
‘వన్’డర్ సానియా...
డబుల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్‌గా భారత స్టార్ హింగిస్‌తో కలిసి ఫ్యామిలీ సర్కిల్ కప్ సొంతం ఈ సీజన్లో వరుసగా మూడో టైటిల్ రూ. 24 లక్షల 28 వేల ప్రైజ్‌మనీ సొంతం చార్ల్స్టన్ (అమెరికా): కల నిజమైంది. భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా అద్భుతం చేసింది. ప్రపంచ మహిళల డబుల్స్ విభాగంలో నంబర్‌వన్ ర్యాంక్‌ను సొంతం చేసుకొని కొత్త చరిత్ర సృష్టించింది. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది. ఆదివారం ముగిసిన ఫ్యామిలీ సర్కిల్ కప్ టోర్నమెంట్లో స్విట్జర్లాండ్ స్టార్ మార్టినా హింగిస్‌తో కలిసి సానియా విజేతగా నిలిచింది. 58 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో టాప్ సీడ్ సానియా-హింగిస్ ద్వయం 6-0, 6-4తో కేసీ డెలాక్వా (ఆస్ట్రేలియా)-దరిజా జురాక్ (క్రొయషియా) జంటపై గెలిచింది. సానియా జంటకు 39 వేల డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 24 లక్షల 28 వేలు)తోపాటు 470 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఈ టైటిల్‌తో సోమవారం విడుదల చేసే మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) డబుల్స్ ర్యాంకింగ్స్‌లో సానియా అధికారికంగా నంబర్‌వన్ ర్యాంక్‌ను హస్తగతం చేసుకుంటుంది. హింగిస్‌తో కలిసి సానియాకిది వరుసగా మూడో టైటిల్ కావడం విశేషం. ఇటీవలే ఈ ఇద్దరూ కలిసి ఇండియన్ వెల్స్ ఓపెన్, మియామి ఓపెన్లలో విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. లియాండర్ పేస్, మహేశ్ భూపతి తర్వాత భారత్ తరఫున డబుల్స్‌లో నంబర్‌వన్‌గా నిలిచిన భారత ప్లేయర్‌గా సానియా నిలిచింది. అంతేకాకుండా అయ్ సుగియామ (జపాన్), షుయె పెంగ్ (చైనా), సెయి సు వీ (చైనీస్ తైపీ) తర్వాత మహిళల డబుల్స్‌లో ఆసియా నుంచి ఈ ఘనత సాధించిన నాలుగో క్రీడాకారిణిగా సానియా గుర్తింపు పొందింది. ‘‘ఏదో ఒక రోజున ప్రపంచ నంబర్‌వన్‌గా నిలవాలని ప్రతీ క్రీడాకారుడు కలలు కంటాడు. హింగిస్లాంటి క్రీడాకారిణితో కలిసి ఈ ఘనత సాధించినందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ టోర్నీలో ఆడేందుకు వచ్చిన సమయంలో మా మదిలో ఒకటే లక్ష్యం ఉంది. అదే నంబర్‌వన్ కావడం. ఈ ఏడాది మరిన్ని టోర్నీల్లో గెలుస్తామని భావిస్తున్నాను.’’ -సానియా -
సానియా జంట శుభారంభం
ఫ్యామిలీ సర్కిల్ కప్ చార్ల్స్టన్ (అమెరికా) : వరుసగా రెండు టైటిల్స్‌తో జోరు మీదున్న భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జంట ఫ్యామిలీ సర్కిల్ కప్ టోర్నమెంట్లో శుభారంభం చేసింది. భారత కాలమానం ప్రకారం బుధవారం అర్ధరాత్రి దాటాక జరిగిన మహిళల డబుల్స్ తొలి రౌండ్లో సానియా-హింగిస్ ద్వయం 6-7 (7/9), 6-3, 10-5తో అనస్తాసియా-అరీనా రొడియోనోవా (ఆస్ట్రేలియా) జంటపై నెగ్గి క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. జోడీగా కలిసి ఆడుతున్న తర్వాత సానియా-హింగిస్ జంట తొలిసారి తమ ప్రత్యర్థి జోడీకి ఓ సెట్‌ను కోల్పోయింది. ఇండియన్ వెల్స్, మియామి ఓపెన్లలో ఒక్క సెట్ కూడా చేజార్చుకోకుండా టైటిల్స్ సొంతం చేసుకున్న వీరిద్దరికి ఈసారి గట్టిపోటీనే ఎదురైంది. తొలి సెట్‌ను టైబ్రేక్‌లో కోల్పోయిన ఈ ఇండో-స్విస్ ద్వయం రెండో సెట్లో తేరుకొని మ్యాచ్‌లో నిలిచింది. నిర్ణాయక సూపర్ టైబ్రేక్‌లో కీలకదశలో పాయింట్లు నెగ్గి వరుసగా 11వ విజయాన్ని ఖాయం చేసుకుంది. ఒకవేళ ఫ్యామిలీ సర్కిల్ కప్‌లోనూ విజేతగా నిలిస్తే సానియా మీర్జా డబుల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌ను సొంతం చేసుకుంటుంది. ‘ఈ టోర్నీలో మా పార్శ్వంలోని ‘డ్రా’ కఠినంగా ఉంది. ఇతరులతో పోలిస్తే మేము ఎలాంటి ప్రాక్టీస్ లేకుండానే క్లే కోర్టులపై జరుగుతున్న ఈ టోర్నీలో ఆడుతున్నాం. మా అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శించాం. తొలి సెట్‌ను నెగ్గాల్సింది. అయితేనేం తొలిసారి సూపర్ టైబ్రేక్‌లో విజయాన్ని దక్కించుకున్నాం’ అని మ్యాచ్ అనంతరం సానియా వ్యాఖ్యానించింది. శుక్రవారం జరిగే క్వార్టర్ ఫైనల్లో అనాబెల్ మెదీనా (స్పెయిన్)-ష్వెదోవా (కజకిస్థాన్) జంటతో సానియా జోడీ తలపడుతుంది.