చాంప్స్‌ సైనా, ప్రణయ్‌ | Saina Nehwal Trumps PV Sindhu to Win Nationals Title | Sakshi
Sakshi News home page

చాంప్స్‌ సైనా, ప్రణయ్‌

Nov 9 2017 12:52 AM | Updated on Nov 9 2017 5:35 AM

Saina Nehwal Trumps PV Sindhu to Win Nationals Title - Sakshi

నాగ్‌పూర్‌: పదేళ్ల తర్వాత జాతీయ సీనియర్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో బరిలోకి దిగిన స్టార్‌ ప్లేయర్‌ సైనా నెహ్వాల్‌ ముచ్చటగా మూడోసారి విజేతగా నిలిచింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్‌ ఫైనల్లో రెండో సీడ్‌ సైనా 21–17, 27–25తో టాప్‌ సీడ్, ప్రపంచ రెండో ర్యాంకర్‌ పీవీ సింధు (ఆంధ్రప్రదేశ్‌)పై విజయం సాధించింది. తన శిక్షణ కేంద్రాన్ని మూడు నెలల క్రితం బెంగళూరు నుంచి హైదరాబాద్‌లోని పుల్లెల గోపీచంద్‌ అకాడమీకి మళ్లీ మార్చిన సైనా 2006, 2007లలో కూడా జాతీయ టైటిల్స్‌ను గెల్చుకుంది. పెట్రోలియం స్పోర్ట్స్‌ ప్రమోషన్‌ బోర్డు (పీఎస్‌పీబీ) తరఫున బరిలోకి దిగిన సైనా విజేత హోదాలో రూ. రెండు లక్షల ప్రైజ్‌మనీని అందుకుంది. జాతీయ సీనియర్‌ చాంపియన్‌షిప్‌లో తొలిసారి ముఖాముఖిగా తలపడిన సింధు, సైనా ప్రతీ పాయింట్‌ కోసం నువ్వా నేనా అన్నట్లు పోరాడారు. అయితే సింధు కీలక సమయంలో అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకుంది. ఇటీవలే డిప్యూటీ కలెక్టర్‌గా నియమితురాలైన సింధు ఈ టోర్నీలో ఏపీ తరఫున ఆడింది. మరోవైపు అత్యద్భుత ఫామ్‌లో ఉన్న కిడాంబి శ్రీకాంత్‌ జోరుకు కళ్లెం వేసి పీఎస్‌పీబీకి ప్రాతినిధ్యం వహించిన కేరళ ప్లేయర్‌ హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ తొలిసారి జాతీయ పురుషుల సింగిల్స్‌ చాంపియన్‌గా అవతరించాడు. ఫైనల్లో ప్రణయ్‌ 21–15, 16–21, 21–7తో ప్రపంచ రెండో ర్యాంకర్‌ శ్రీకాంత్‌ను ఓడించాడు.

సిక్కి ఐదోసారి...
పీఎస్‌పీబీకి ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ ప్లేయర్‌ సిక్కి రెడ్డి ఐదోసారి మహిళల డబుల్స్‌ టైటిల్‌ను సాధించింది. ఫైనల్లో సిక్కి–అశ్విని ద్వయం 21–14, 21–14తో సంయోగిత–ప్రాజక్తా జంటపై గెలిచింది. 2012లో అపర్ణా బాలన్‌తో, 2014, 2015, 2016లలో ప్రద్న్యా గాద్రెతో కలిసి సిక్కి జాతీయ టైటిల్స్‌ను సొంతం చేసుకుంది. పురుషుల డబుల్స్‌ ఫైనల్లో సుమీత్‌ రెడ్డి (తెలంగాణ)–మనూ అత్రి (పీఎస్‌పీబీ) జంట 15–21, 22–20, 25–23తో సాత్విక్‌ సాయిరాజ్‌ (ఆంధ్రప్రదేశ్‌)–చిరాగ్‌ శెట్టి జోడీని ఓడించింది. మిక్స్‌డ్‌ డబుల్స్‌ ఫైనల్లో సాత్విక్‌ సాయిరాజ్‌–అశ్విని పొన్నప్ప (పీఎస్‌పీబీ) జంట 21–9, 20–22, 21–17తో సిక్కి రెడ్డి–ప్రణవ్‌ చోప్రా జోడీపై నెగ్గింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement