
బెంగళూరు విజయం
ఉత్కంఠభరిత పోరులో సన్ రైజర్స్ హైదరాబాద్ పై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
హైదరాబాద్: ఉత్కంఠభరిత పోరులో సన్ రైజర్స్ హైదరాబాద్ పై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్ లో కోహ్లి సేన సర్వశక్తులు ఒడ్డి గెలుపు అందుకుంది. డక్ వర్త్ లూయిస్ ప్రకారం 6 ఓవర్లలో నిర్దేశించిన 81 పరుగుల లక్ష్యాన్ని ఒక బంతి మిగులుండగానే చేరుకుంది. 5.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 83 పరుగులు చేసింది. క్రిస్ గేల్, విరాట్ కోహ్లి మెరుపు ఇన్నింగ్స్ తో బెంగళూరు విజయాన్ని అందుకుంది. గేల్ 10 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 35 పరుగులు చేశాడు. కోహ్లి కెప్టెన్ ఇన్నింగ్స్ తో జట్టును విజయతీరాలకు చేర్చాడు. 19 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 44 పరుగులు బాదాడు.
ఒకే ఒక బంతి మ్యాచ్ ఫలితాన్ని మార్చేసింది. చివరి 2 బంతుల్లో 4 పరుగులు చేయాల్సిన దశలో కోహ్లి ఇచ్చిన క్యాచ్ ను బౌండరీ లైన్ దగ్గర ఒడిసిపట్టిన వార్నర్ వెనక్కి చూసుకోకుండా బౌండరీ లైన్ ను తాకాడు. తర్వాత చేతిలోని బంతిని మైదానంలోకి విసిరాడు. అయితే అప్పటికే అతడు బౌండరీ లైన్ ను తాకడంతో దాన్ని అంపైర్ సిక్స్ గా ప్రకటించాడు. దీంతో బెంగళూరు ఆటగాళ్లు ఆనందంతో గెంతులు వేశారు. హైదరాబాద్ ఆటగాళ్లు అవాక్కయ్యారు.
హెన్రీక్స్, వార్నర్ మెరుపు అర్ధశతకాలతో అదరగొట్టడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ భారీ స్కోరు చేసింది. 11 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 135 పరుగులు చేసింది. ధావన్(8) తొందరగానే అవుటైనా హెన్రీక్స్, వార్నర్ విజృంభణతో హైదరాబాద్ భారీ స్కోరు చేసింది. హెన్రీక్స్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. 22 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 57 పరుగులు బాదాడు. వార్నర్ 32 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్ తో 52 పరుగులు సాధించాడు. ఆట ఆరంభానికి ముందు వర్షం రావడంతో మ్యాచ్ ను 11 ఓవర్లకు కుదించారు.
బ్యాటింగ్ లో మెరిసిన వార్నర్ ఒకే ఒక క్యాచ్ తో మ్యాచ్ ను జారవిడిచాడు. కోహ్లి 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' దక్కించుకున్నాడు. ఈ విజయంతో 15 పాయింట్లతో బెంగళూరు పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది.సన్ రైజర్స్ నాలుగో స్థానానికి పడిపోయింది.