థర్డ్‌ అంపైర్‌పై రోహిత్‌ తిట్ల దండకం

Rohit Loses Cool After Error On Giant Screen - Sakshi

రాజ్‌కోట్‌: టీమిండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మ తన ఆటలో మెరుపులే కాదు.. అప్పుడప్పుడు తన సహనాన్ని కూడా కోల్పోతూ ఉంటాడు. ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో పరుగు చేయడానికి చతేశ్వర పుజారా రాలేదని రోహిత్‌ తన నోటికి పని చెప్పిన సంగతి తెలిసిందే. అయితే బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టీ20లో కూడా రోహిత్‌ దూకుడుగా కనిపించాడు. ఒక ఔట్‌ విషయంలో థర్డ్‌ అంపైర్‌ నాటౌట్‌గా ప్రకటించిన వెంటనే తిట్ల దండకం అందుకున్నాడు.

వివరాల్లోకి వెళితే..  బంగ్లాదేశ్‌ ఇన్నింగ్స్‌ 13 ఓవర్‌లో భాగంగా యజ్వేంద్ర చహల్‌ వేసిన ఓ బంతికి సౌమ్య సర్కార్‌ను రిషభ్‌ పంత్‌ స్టంపౌట్‌ చేశాడు. దీనిపై ఫీల్డ్‌ అంపైర్‌ ఔట్‌గా భావించినప్పటికీ కాస్త అనుమానం ఉండటంతో దాన్ని థర్డ్‌ అంపైర్‌ను ఆశ్రయించాడు. ఆ సందర్భంలో అప్పటికే మైదానాన్ని విడిచి వెళ్లిన సౌమ్య సర్కార్‌ బౌండరీ లైన్‌ వద్ద నిరీక్షిస్తున్నాడు. అయితే ఇది క్లియర్‌గా ఔట్‌ అని తేలినా స్క్రీన్‌ మీద నాటౌట్‌ అంటూ డిస్‌ప్లే అయ్యింది. దాంతో రోహిత్‌ శర్మ ఆగ్రహం కట్టలు తెంచుకుంది. 

ఫీల్డ్‌ అంపైర్‌ పక్కన ఉండగానే థర్డ్‌ అంపైర్‌ నిర్ణయం అసహనం వ్యక్తం చేశాడు. అదే సమయంలో  ఇదేమి అంపైరింగ్‌ అనే అర్థం వచ్చేలా అసభ్య పదజాలంతో దూషించాడు. చివరకూ ఫోర్త్‌ అంపైర్‌ అది ఔటేనని సౌమ్య సర్కార్‌ను ఒప్పించడంతో అతను డ్రెస్సింగ్‌ రూమ్‌కు చేరుకున్నాడు. అంపైర్‌పై రోహిత్‌ ఆగ్రహం వ్యక్తం చేసిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. సౌమ్య సర్కార్‌ 20 బంతుల్లో 30 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో భారత్‌ ఘన విజయం సాధించడంతో సిరీస్‌ 1-1తో సమం అయ్యింది. ఆదివారం మూడో టీ20 నాగ్‌పూర్‌లో జరుగనుంది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top