సన్‌రైజర్స్‌ గెలిస్తేనే ముందుకు..!

RCB Won The Toss And Elected Field First Against SRH - Sakshi

బెంగళూరు: గత మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ చేతిలో  సూపర్‌ ఓవర్‌లో పరాజయం చవిచూసిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తిరిగి పుంజుకునేందుకు సమాయత్తమైంది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ప్లేఆఫ్‌ రేసులో నిలవాలంటే బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరుగనున్న తమ చివరి లీగ్‌ మ్యాచ్‌లో ఆతిథ్య రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్టుపై గెలవాల్సి ఉంది.  ప్రస్తుతం రన్‌రేట్‌ పరంగా హైదరాబాద్‌ మెరుగ్గా ఉండటంతో గెలిస్తే ప్లేఆఫ్‌ బెర్తును ఖాయం చేసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మరోవైపు ఇప్పటికే ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి వైదొలిగిన రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు చివరి మ్యాచ్‌లో గెలిచి పరువు నిలబెట్టుకోవాలని  భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఇరు జట్లు గెలుపే లక్ష్యంగా బరిలో దిగనున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఆర్సీబీ ముందుగా ఫీల్డింగ్‌ తీసుకుంది.

సన్‌రైజర్స్‌ బ్యాటింగ్‌ విభాగం ఇంకా కుదురుకున్నట్లుగా లేదు. వార్నర్‌ స్థానంలో బరిలో దిగిన గప్టిల్‌ ఆ లోటును పూరించలేకపోయాడు. వృద్ధిమాన్‌ సాహా, కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్, విజయ్‌ శంకర్‌ కీలక సమయాల్లో కూడా రాణించలేకపోతున్నారు. మనీశ్‌ పాండే ఫామ్‌ ఒక్కటే ప్రస్తుతం రైజర్స్‌ శిబిరంలో ఆశలు నింపుతోంది. పాండేకు తోడుగా నబీ, రషీద్‌ ఖాన్‌ బ్యాటింగ్‌లో అండగా నిలుస్తున్నారు. బౌలింగ్‌ విభాగం అంచనాలకు తగినట్లుగా రాణించినప్పటికీ బ్యాట్స్‌మెన్‌ పరుగులు చేయలేకపోవడంతో రైజర్స్‌ రేసులో వెనుకబడుతోంది. ఈ మ్యాచ్‌లోనూ పేసర్లు భువనేశ్వర్, సందీప్‌ శర్మ, ఖలీల్‌ అహ్మద్‌... స్పిన్నర్లు రషీద్‌ ఖాన్, నబీ ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే కట్టడి చేయాల్సిన అవసరం ఉంది.  

ఇప్పటివరకు 13 మ్యాచ్‌లాడిన రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు 8 మ్యాచ్‌ల్లో ఓడిపోయి 9 పాయింట్లతో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. రాజస్తాన్‌తో జరిగిన చివరి మ్యాచ్‌లో వర్షం కారణంగా మ్యాచ్‌ ఆగిపోవడంతో బెంగళూరు ప్లే ఆఫ్‌ అవకాశాలు సన్నగిల్లాయి. హైదరాబాద్‌తో నేడు జరిగే మ్యాచ్‌ బెంగళూరుకు చివరిది కావడంతో గెలుపుతో సీజన్‌ను ముగించాలని కోహ్లి సేన భావిస్తోంది. సొంత మైదానంలో ప్రేక్షకులకు గెలుపును బహుమతిగా ఇవ్వాలని కోహ్లి, డివిలియర్స్‌ పట్టుదలగా ఉన్నారు.

తుదిజట్లు: 
ఆర్సీబీ: విరాట్‌ కోహ్లి(కెప్టెన్‌), పార్థీవ్‌ పటేల్‌, ఏబీ డివిలియర్స్‌, హెట్‌మెయిర్‌, గురుకీరత్‌ సింగ్‌, గ్రాండ్‌ హోమ్‌, వాషింగ్టన్‌ సుందర్‌, ఉమేశ్‌ యాదవ్‌, నవదీప్‌ సైనీ, కుల్వంత్‌ ఖేజ్రోలియా, చహల్‌

సన్‌రైజర్స్‌: కేన్‌ విలియమ్సన్‌(కెప్టెన్‌), వృద్దిమాన్‌ సాహా, మార్టిన్‌ గప్టిల్‌, మనీశ్‌ పాండే, విజయ్‌ శంకర్‌, యుసుఫ్‌ పఠాన్‌, మహ్మద్‌ నబి, రషీద్‌ ఖాన్‌, భువనే​శ్వర్‌ కుమార్‌, ఖలీల్‌ అహ్మద్‌, బాసిల్‌ థంపి

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top