ఆంధ్ర ఖాతాలో మరో ‘డ్రా’

Ranji trophy : another draw to andhra team - Sakshi

మెరిసిన ప్రశాంత్‌ కుమార్‌

సాక్షి, విశాఖపట్నం: ఓపెనర్‌ ప్రశాంత్‌ కుమార్‌ (81 బంతుల్లో 90; 10 ఫోర్లు, 3 సిక్స్‌లు) దూకుడుగా ఆడినా... మిగతా బ్యాట్స్‌మెన్‌ సహకారం అందించకపోవడంతో బెంగాల్‌తో జరిగిన రంజీ ట్రోఫీ గ్రూప్‌ ‘బి’ లీగ్‌ మ్యాచ్‌ను ఆంధ్ర జట్టు ‘డ్రా’గా ముగించింది. తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం సంపాదించినందుకు ఆంధ్రకు మూడు పాయింట్లు లభించగా... బెంగాల్‌ ఖాతాలో ఒక పాయింట్‌ చేరింది. ఓవర్‌నైట్‌ స్కోరు 321/9తో మ్యాచ్‌ చివరి రోజు తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఆంధ్ర జట్టు మరో మూడు బంతులు ఆడి అదే స్కోరు వద్ద ఆలౌటైంది. 21 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన బెంగాల్‌ జట్టు 40.3 ఓవర్లలో ఏడు వికెట్లకు 223 పరుగులు చేసి డిక్లేర్‌ చేసింది. 203 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆంధ్ర జట్టు ధాటిగా ఆడినా... ఆట ముగిసే సమయానికి 28 ఓవర్లలో ఏడు వికెట్లకు 170 పరుగులు మాత్రమే చేయగలిగింది. ప్రశాంత్, జ్యోతి సాయికృష్ణ (45; 5 ఫోర్లు, సిక్స్‌) రెండో వికెట్‌కు 84 పరుగులు జోడించడంతో ఒకదశలో ఆంధ్ర జట్టుకు విజయంపై ఆశలు చిగురించాయి. అయితే సాయికృష్ణ ఔటయ్యాక రికీ భుయ్‌ (16; 3 ఫోర్లు), భరత్‌ (0), గిరినాథ్‌ రెడ్డి (9), శశికాంత్‌ (7) తక్కువ స్కోర్లకే వెనుదిరిగారు. సెంచరీ దిశగా సాగిన ప్రశాంత్‌ కీలకదశలో నిష్క్రమించడంతో చివరకు ఆంధ్ర మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకుంది. 9 జట్లున్న గ్రూప్‌ ‘బి’లో ఆరు మ్యాచ్‌లు ఆడిన ఆంధ్ర రెండింటిలో ఓడి, నాలుగింటిని ‘డ్రా’ చేసుకుంది. ప్రస్తుతం 8 పాయిం ట్లతో గ్రూప్‌లో చివరి స్థానంలో ఉంది. ఈనెల 30 నుంచి విజయనగరంలో జరిగే తదుపరి మ్యాచ్‌లో హైదరాబాద్‌తో ఆంధ్ర తలపడుతుంది.

శుబ్‌మన్‌ మెరుపు సెంచరీ
సాక్షి, హైదరాబాద్‌: చివరి ఓవర్‌ వరకు ఉత్కంఠగా జరిగిన హైదరాబాద్, పంజాబ్‌ జట్ల మధ్య రంజీ ట్రోఫీ గ్రూప్‌ ‘బి’ లీగ్‌ మ్యాచ్‌ ‘డ్రా’గా ముగిసింది. తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం పొందిన హైదరాబాద్‌కు మూడు పాయింట్లు లభించగా... పంజాబ్‌కు ఒక పాయింట్‌ దక్కింది. నిర్ణీత 57 ఓవర్లలో 338 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్‌ 8 వికెట్లకు 324 పరుగులు చేయడంతో మ్యాచ్‌ ‘డ్రా’ అయింది.  ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌ (154 బంతుల్లో 148; 16 ఫోర్లు, 2 సిక్స్‌లు) హడలెత్తించాడు. అయితే 50వ ఓవర్లో జట్టు స్కోరు 290 వద్ద జోరుమీదున్న శుబ్‌మన్‌ ఐదో వికెట్‌ రూపంలో వెనుదిరగడం పంజాబ్‌ విజయావకాశాలపై ప్రభావం చూపింది.  అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 155/2తో రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన హైదరాబాద్‌ 3 వికెట్లకు 323 పరుగులు చేసి డిక్లేర్‌ చేసింది. కెప్టెన్‌ అక్షత్‌ రెడ్డి (161 నాటౌట్‌; 14 ఫోర్లు, 4 సిక్స్‌లు) అజేయ సెంచరీ చేశాడు.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top