సింధు శుభారంభం | PV Sindhu wins against Yamaguchi | Sakshi
Sakshi News home page

సింధు శుభారంభం

Dec 13 2018 12:17 AM | Updated on Dec 13 2018 1:04 AM

 PV Sindhu wins against Yamaguchi - Sakshi

అగ్వాంగ్‌జౌ (చైనా): సీజన్‌ ముగింపు టోర్నమెంట్‌ వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌ టైటిల్‌ సాధించాలనే పట్టుదలతో బరిలోకి దిగిన భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ క్రీడాకారిణి పూసర్ల వెంకట (పీవీ) సింధు తొలి అడుగు విజయవంతంగా వేసింది. ప్రపంచ రెండో ర్యాంకర్‌ అకానె యామగుచితో జరిగిన గ్రూప్‌ ‘ఎ’ తొలి లీగ్‌ మ్యాచ్‌లో సింధు 24–22, 21–15తో విజయం సాధించి శుభారంభం చేసింది. ఓవరాల్‌గా యామగుచిపై సింధుకిది పదో విజయం కావడం విశేషం. 52 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సింధు కీలకదశలో పైచేయి సాధించి అనుకున్న ఫలితాన్ని సాధించింది.

27 నిమిషాలపాటు జరిగిన తొలి గేమ్‌లో ఒకదశలో సింధు 6–11తో వెనుకంజలో ఉంది. అయితే యామగుచి ఆటతీరుపై మంచి అవగాహన ఉన్న ఈ హైదరాబాద్‌ అమ్మాయి నెమ్మదిగా పుంజుకుంది. వరుసగా పాయింట్లు సాధిస్తూ కళ్లు చెదిరే స్మాష్‌ షాట్లతో స్కోరును 19–19తో సమం చేసింది. ఆ తర్వాత పలుమార్లు స్కోర్లు సమమయ్యాయి. 23–22 స్కోరు వద్ద యామగుచి కొట్టిన ఫోర్‌హ్యాండ్‌ రిటర్న్‌ నెట్‌కు తగలడంతో తొలి గేమ్‌ సింధు వశమైంది. రెండో గేమ్‌లో ఇద్దరూ ప్రతి పాయింట్‌ కోసం పోరాడారు. విరామానికి సింధు 11–10తో ఒక పాయింట్‌ ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత ఒక పాయింట్‌ కోల్పోయి... మూడు పాయింట్లు గెలిచిన ఆమె 14–11తో  ముందంజ వేసింది.

ఇదే జోరులో సింధు 20–15తో ఆధిక్యంలోకి వెళ్లింది. యామగుచి కొట్టిన మరో షాట్‌ నెట్‌కు తగలడంతో సింధు రెండో గేమ్‌తోపాటు మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. గురువారం జరిగే రెండో లీగ్‌ మ్యాచ్‌లో తై జు యింగ్‌తో సింధు ఆడుతుంది. పురుషుల సింగిల్స్‌ విభాగంలో భారత యువతార సమీర్‌ వర్మకు నిరాశ ఎదురైంది. ప్రపంచ చాంపియన్‌  కెంటో మొమోటా (జపాన్‌)తో జరిగిన గ్రూప్‌ ‘బి’ మ్యాచ్‌లో సమీర్‌ 18–21, 6–21తో ఓడిపోయాడు. గురువారం జరిగే మరో మ్యాచ్‌లో టామీ సుగియార్తో (ఇండోనేసియా)తో సమీర్‌ ఆడతాడు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement