సింధు సత్తాకు పరీక్ష | PV Sindhu Set To Defend Title In China | Sakshi
Sakshi News home page

సింధు సత్తాకు పరీక్ష

Dec 11 2019 1:46 AM | Updated on Dec 11 2019 1:46 AM

PV Sindhu Set To Defend Title In China - Sakshi

గ్వాంగ్‌జౌ (చైనా): గత ఆగస్టులో ప్రపంచ ఛాంపియన్ షిప్ టైటిల్‌ గెలిచాక... భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు ఆడిన ఆరు టోర్నీల్లో కనీసం క్వార్టర్‌ ఫైనల్‌ దశ దాటలేకపోయింది. ఈ నేపథ్యంలో బ్యాడ్మింటన్‌ సీజన్‌ ముగింపు టోర్నీ వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌లో టైటిల్‌ నిలబెట్టుకొని ఈ ఏడాదిని ఘనంగా ముగించాలనే లక్ష్యంతో సింధు ఉంది. వాస్తవానికి వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌ టోర్నీకి సూపర్‌ టోర్నీల ర్యాంకింగ్స్‌లో టాప్‌–8లో ఉన్నవారికి మాత్రమే అవకాశం లభిస్తుంది. టాప్‌–8లో సింధు లేకపోయినా ప్రపంచ చాంపియన్‌ హోదాలో ఆమెకు ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో ఆడేందుకు అవకాశమిచ్చారు. వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌ టోర్నీలో సింధుకు మెరుగైన రికార్డు ఉంది. 2017లో ఆమె రన్నరప్‌గా నిలువగా... 2018లో విజేతగా అవతరించింది.

ఈసారి సింధుకు క్లిష్టమైన ‘డ్రా’ ఎదురైంది. మహిళల సింగిల్స్‌ గ్రూప్‌ ‘ఎ’లో సింధుతోపాటు ప్రపంచ నాలుగో ర్యాంకర్‌ అకానె యామగుచి (జపాన్‌), రెండో ర్యాంకర్‌ చెన్‌ యుఫె (చైనా), ఏడో ర్యాంకర్‌ హి బింగ్‌జియావో (చైనా) ఉన్నారు. నేడు జరిగే తొలి లీగ్‌ మ్యాచ్‌లో యామగుచితో సింధు ఆడుతుంది. ముఖాముఖి రికార్డులో సింధు 10–6తో ఆధిక్యంలో ఉంది. గ్రూప్‌ ‘బి’లో నంబర్‌వన్‌ తై జు యింగ్‌ (చైనీస్‌ తైపీ), ప్రపంచ మాజీ చాంపియన్స్‌ రచనోక్‌ (థాయ్‌లాండ్‌),  ఒకుహారా (జపాన్‌), బుసానన్‌ (థాయ్‌ లాండ్‌) ఉన్నారు. లీగ్‌ దశ మ్యాచ్‌లు ముగిశాక గ్రూప్‌ ల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన వారు సెమీఫైనల్స్‌కు అర్హత సాధిస్తారు. 14న సెమీఫైనల్స్, 15న ఫైనల్స్‌ జరుగుతాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement