స్టార్‌ ఆటగాళ్లతో బరిలోకి 

 PV Sindhu, Kidambi Srikanth to spearhead India challenge at Sudirman Cup - Sakshi

సుదిర్మన్‌ కప్‌కు  భారత జట్టు ప్రకటన

సింధు, శ్రీకాంత్, సైనాలకు చోటు  

న్యూఢిల్లీ: ఆసియా బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో నిరాశపరిచిన భారత బృందం... ప్రపంచ మిక్స్‌డ్‌ టీమ్‌ చాంపియన్‌షిప్‌ సుదిర్మన్‌ కప్‌లో పతకంతో తిరిగి రావాలనే లక్ష్యంతో స్టార్‌ ఆటగాళ్లందరినీ బరిలోకి దించాలని నిర్ణయించింది. చైనాలోని నానింగ్‌ నగరంలో మే 19 నుంచి 26 వరకు జరిగే ఈ టోర్నమెంట్‌లో పాల్గొనే భారత జట్టును భారత బ్యాడ్మింటన్‌ సంఘం (బాయ్‌) మంగళవారం ప్రకటించింది. మహిళల సింగిల్స్‌లో భారత అగ్రశ్రేణి క్రీడాకారిణులు పీవీ సింధు, సైనా నెహ్వాల్‌... పురుషుల సింగిల్స్‌లో భారత నంబర్‌వన్‌ కిడాంబి శ్రీకాంత్, రెండో ర్యాంకర్‌ సమీర్‌ వర్మలను ఎంపిక చేశారు. 2017 సుదిర్మన్‌ కప్‌లో భారత జట్టు క్వార్టర్‌ ఫైనల్‌కు చేరుకొని చైనా చేతిలో ఓడిపోయింది.

ఈసారి ఎనిమిదో సీడ్‌గా భారత్‌ పోటీపడనుంది. గ్రూప్‌ ‘డి’లో మాజీ చాంపియన్‌ చైనా, మలేసియాలతోపాటు భారత్‌కు చోటు కల్పించారు. ఈ గ్రూప్‌లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు క్వార్టర్‌ ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. ఫలితంగా భారత్‌ ముందంజ వేయాలంటే లీగ్‌ దశలో కచ్చితంగా మలేసియాపై గెలవాల్సి ఉంటుంది. మాజీ నంబర్‌వన్‌ లీ చోంగ్‌ వీ గైర్హాజరీలో మలేసియా జట్టు బలహీనంగా కనిపిస్తున్న నేపథ్యంలో భారత్‌కు ఈసారి కూడా క్వార్టర్‌ ఫైనల్‌ చేరుకునే అవకాశాలున్నాయి. సుదర్మిన్‌ కప్‌లో భాగంగా ఒక మ్యాచ్‌లో పురుషుల సింగిల్స్, మహిళల సింగిల్స్, పురుషుల డబుల్స్, మహిళల డబుల్స్, మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగాల్లో ఒక్కో మ్యాచ్‌ను నిర్వహిస్తారు.  

పురుషుల జట్టు: శ్రీకాంత్, సమీర్‌ వర్మ (సింగిల్స్‌), సాత్విక్‌ సాయిరాజ్, చిరాగ్‌ శెట్టి, సుమీత్‌ రెడ్డి, మనూ అత్రి, ప్రణవ్‌ చోప్రా (డబుల్స్‌). 
మహిళల జట్టు: పీవీ సింధు, సైనా నెహ్వాల్‌ (సింగిల్స్‌), నేలకుర్తి సిక్కి రెడ్డి, అశ్విని పొన్నప్ప, మేఘన, పూర్వీషా రామ్‌ (డబుల్స్‌).  
 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top