
మరో సుదీర్ఘ సమరం... కానీ ఫలితమే ప్రతికూలం... తొలి మూడు మ్యాచ్‌ల్లో మూడు గేమ్‌లపాటు ఆడి గెలుపొందిన సింధు కీలక సెమీఫైనల్లో మాత్రం ఒత్తిడికి తలొగ్గింది. పాయింట్లు సాధించాల్సిన సమయంలో అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకుంది.
బర్మింగ్‌హామ్: ఆఖరి క్షణం వరకు నువ్వా నేనా అన్నట్లు సాగిన సమరంలో భారత బ్యాడ్మింటన్ స్టార్ పూసర్ల వెంకట (పీవీ) సింధు ఫినిషింగ్ టచ్ ఇవ్వలేకపోయింది. ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో తెలుగు తేజం పోరాటం సెమీఫైనల్లోనే ముగిసింది. శనివారం 79 నిమిషాలపాటు జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో ప్రపంచ మూడో ర్యాంకర్ సింధు 21–19, 19–21, 18–21తో ప్రపంచ రెండో ర్యాంకర్ అకానె యామగుచి (జపాన్) చేతిలో ఓడిపోయింది.
క్వార్టర్ ఫైనల్లో జపాన్‌కే చెందిన ప్రపంచ చాంపియన్ ఒకుహారాపై అద్భుత విజయం సాధించిన సింధు అదే ఫలితాన్ని సెమీస్‌లో పునరావృతం చేయలేకపోయింది. యామగుచితో ముఖాముఖి రికార్డులో 6–3తో ఆధిక్యంలో ఉన్న సింధు ఈ మ్యాచ్‌లో తొలి గేమ్‌లో 5–0తో ఆధిక్యంలోకి వెళ్లి శుభారంభం చేసింది. ఆ తర్వాత ఇదే జోరు కొనసాగించి 17–10తో ముందంజ వేసింది. ఈ దశలో సింధు ఆటతీరు గతి తప్పింది. వరుసగా ఏడు పాయింట్లు కోల్పోయింది. దాంతో స్కోరు 17–17తో సమమైంది.
ఈ సమయంలో సింధు వరుసగా రెండు పాయింట్లు నెగ్గి 19–17తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ ఆధిక్యాన్ని కాపాడుకొని తొలి గేమ్‌ను 20 నిమిషాల్లో సొంతం చేసుకుంది. రెండో గేమ్‌లో యామగుచి తేరుకుంది. సింధు వ్యూహాత్మక ఆటతీరుకు సరైన సమాధానమిస్తూ నిలకడగా పాయింట్లు సాధించింది. సుదీర్ఘంగా సాగిన ర్యాలీలను సింధు పాయింట్లుగా మల్చుకోలేకపోయింది. ఆమె కొట్టిన షాట్‌లు నెట్‌కు తగలడమో లేదా బయటకు వెళ్లడమో జరిగాయి.
ఫలితంగా యామగుచి రెండో గేమ్‌ను 21–19తో నెగ్గి మ్యాచ్‌లో నిలిచింది. నిర్ణాయక మూడో గేమ్‌లో ఇద్దరూ నువ్వా నేనా అన్నట్లు పోరాడారు. పలుమార్లు సుదీర్ఘ ర్యాలీలు కనిపించాయి. ఒకదశలో సింధు 13–7తో ఆరు పాయింట్ల ఆధిక్యాన్ని సంపాదించి విజయం దిశగా సాగింది. అయితే పట్టువదలని యామగుచి పోరాడింది. స్కోరు సమం చేసింది. సింధు 18–17తో ఒక పాయింట్ ఆధిక్యంలో ఉన్న దశలో యామగుచి ఒక్కసారిగా చెలరేగింది. వరుసగా నాలుగు పాయింట్లు గెలిచి గేమ్‌తోపాటు మ్యాచ్‌ను సొంతం చేసుకొని సింధు ఆశలపై నీళ్లు చల్లింది.
ప్రణయ్‌కు నిరాశ: శుక్రవారం రాత్రి జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రణయ్ 22–20, 16–21, 21–23తో హువాంగ్ యుజియాంగ్ (చైనా) చేతిలో ఓడిపోయాడు.