
సింగపూర్: ఈ సీజన్‌లో ఇంకా టైటిల్ బోణీ కొట్టలేకపోయిన భారత బ్యాడ్మింటన్ స్టార్ పూసర్ల వెంకట (పీవీ) సింధుకు సింగపూర్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 టోర్నమెంట్‌లోనూ చుక్కెదురైంది. జపాన్‌కు చెందిన రెండో సీడ్ నొజోమి ఒకుహారాతో శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో సింధు వరుస గేముల్లో 7–21, 11–21తో ఓడిపోయింది. దీంతో ఈ టోర్నీలో భారత్ పోరాటం ముగిసింది. ఈ మ్యాచ్ ముందు వరకు జపాన్ ప్రత్యర్థిపై మన తెలుగుతేజానిదే పైచేయి. ముఖాముఖి పోరులో 7–6తో ఆధిక్యంలో నిలిచింది.
చివరిసారిగా తలపడిన రెండు సార్లూ సింధుదే విజయం. అయితే శనివారంనాటి పోటీలో ఆ ఆధిపత్యం కొనసాగలేదు. కేవలం 37 నిమిషాల్లోనే జపాన్ స్టార్ నాలుగో సీడ్ సింధును ఓడించింది. చిత్రంగా ఈ మ్యాచ్‌లో రియో ఒలింపిక్స్ రన్నరప్ సింధు తన స్థాయికి తగ్గ ప్రదర్శన కనబరచలేదు. తొలిగేమ్‌లో అయితే కనీస పోరాటం లేకుండానే తలవంచింది. రెండో గేమ్ కూడా భిన్నంగా జరగలేదు. ఆరంభంలో కాస్త పోరాడినట్లు కనిపించినా... క్రమంగా ప్రత్యర్థి వేగాన్ని సింధు అందుకోలేకపోయింది. ఈ మ్యాచ్ ఫలితంతో ఒకుహారా ముఖాముఖి రికార్డును 7–7తో సమం చేసింది.