హ్యాట్సాఫ్‌ పుజారా... 

Pujara hundred one of the finest Test match knocks you will see - Sakshi

టెస్టు క్రికెట్‌ ఎలా ఆడాలో, ఎంతటి ఓపికతో ఇన్నింగ్స్‌ను నిర్మించాలో చతేశ్వర్‌ పుజారా మళ్లీ చేసి చూపించాడు. 40 డిగ్రీల వేడి వాతావరణంలో ప్రత్యర్థి బౌలర్లు అలసిపోయే వరకు, బంతి మెత్త బడిపోయే వరకు పట్టుదలగా నిలవడం... ఆ తర్వాత పరుగులు రాబట్టి జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించడం ఎలాగో ‘చింటూ’కు తెలిసినంతగా మరెవరికీ తెలీదేమో. కోహ్లి కెప్టెనయ్యాక దూకుడు అనే మాటకు అర్థమే మారిపోయింది. అవసరం ఉన్నా లేకపోయినా, పరిస్థితులు ఎలా ఉన్నా పట్టించుకోకుండా ధాటిగా ఆడటమే విజ యానికి బాటలు వేస్తుందనే నమ్మకం జట్టులో పాతుకుపోయింది. ఇలాంటి స్థితిలో పుజారాను కూడా పదే పదే పక్కన పెట్టేందుకు భారత టీమ్‌ మేనేజ్‌మెంట్‌ ఏమాత్రం సంకోచించలేదు. రెండేళ్ల క్రితమైతే వెస్టిండీస్‌లో కేవలం ‘స్ట్రయిక్‌రేట్‌’ పేరు తో పుజారాను కాదని రోహిత్‌కు తుది జట్టులో చోటు కల్పించారు. ఇటీవలి ఇంగ్లండ్‌ పర్యటన తొలి టెస్టులోనూ అతడిని ఆడించలేదు. కానీ టెస్టు జట్టులో పుజారా తన విలువను మరోసారి ప్రదర్శించాడు. సరిగ్గా మూడు నెలల క్రితం ఇంగ్లండ్‌తో సౌతాంప్టన్‌లో జరిగిన నాలుగో టెస్టు తరహాలోనే పుజారా మళ్లీ ఒక్కడే నిలిచి జట్టును ఆదుకున్నాడు.

నాటి మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 273 పరుగులు చేయగా పుజారా132 నాటౌట్‌. తర్వాతి అత్యధిక స్కోరు 46 పరుగులు మాత్రమే. చివరి రెండు వికెట్లకు 78 పరుగులు జోడిస్తే పుజారా అందులో 54 పరుగులు చేశాడు. ఇప్పుడు అడిలైడ్‌ టెస్టులో ఎనిమిది, తొమ్మిది వికెట్లకు కలిపి 61 పరుగులు జత చేస్తే వాటిలో పుజారా 51 పరుగులు చేశాడంటే టెయిలెండర్లతో కలిసి కూడా ఇన్నింగ్స్‌ను నడిపించగల సామర్థ్యం పుజారాకు ఉందని అర్థమవుతుంది.   రెండో ఓవర్‌ చివరి బంతికి రాహుల్‌ వెనుదిరిగిన తర్వాత పుజారా క్రీజ్‌లోకి వచ్చాడు. లంచ్‌ వరకు అతి జాగ్రత్తగా అతని ఇన్నింగ్స్‌ సాగింది. మరో ఎండ్‌లో రోహిత్‌ ధాటిని ప్రదర్శిస్తున్నా తనకే సొంతమైన శైలిలోనే అతను ఆడాడు. నాలుగు కీలక వికెట్లు కోల్పోయిన జట్టును ఆదుకోవాల్సిన తరుణంలో అభేద్యమైన డిఫెన్స్‌నే నమ్ముకోవడంతో తొలి సెషన్‌ ముగిసేసరికి 62 బంతుల్లో 11 పరుగులే చేయగలిగాడు. లంచ్‌ తర్వాత కూడా ఇదే ఆట సాగడంతో ఒక దశలో వరుసగా 29 బంతుల పాటు పుజారా సింగిల్‌ కూడా తీయలేదు! ఆరో వికెట్‌గా పంత్‌ వెనుదిరిగే సమయానికి భారత్‌ స్కోరు 127 కాగా పుజారా 119 బంతుల్లో చేసింది 35 పరుగులే. ఈ దశలో తమ చేతుల్లోకి ఆట వచ్చేసిందని ఆస్ట్రేలియా భావించింది. కానీ పుజారా ఆలోచనలు వేరేలా ఉన్నాయి. అదే పట్టుదలతో రెండో సెషన్‌ కూడా ముగించిన అతను కొద్దిసేపటి తర్వాత 153వ బంతికి అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అటు అశ్విన్‌ ఔటయ్యే సమయానికి పుజారా స్కోరు 72 పరుగులు కాగా... టెయిలెండర్లతో కలిసి సెంచరీ అసాధ్యమని అనిపించింది. కానీ ఇషాంత్, షమీ అతనికి అండగా నిలిచారు.  

89 పరుగుల వద్దనుంచి పుజారాలో కొత్త ఆట కనిపించింది. హాజల్‌వుడ్‌ బౌలింగ్‌లో వరుస బంతుల్లో హుక్‌ షాట్‌తో సిక్సర్, పుల్‌ షాట్‌తో ఫోర్‌ రాబట్టి అతను 99కి చేరుకున్నాడు. సెంచరీకి చేరువైన దశలో అతనినుంచి ఇలాంటి ఆట అనూహ్యంగా అనిపించింది. తర్వాతి ఓవర్లో రెండు పరుగులు తీయడంతో అతని అద్భుత సెంచరీ పూర్తయింది. ఆ తర్వాత కూడా స్టార్క్‌ బౌలింగ్‌లో వరుసగా ఫోర్, సిక్స్‌ బాదడం విశేషం. తర్వాతి ఓవర్‌ కోసం స్ట్రయికింగ్‌ను కాపాడుకునే ప్రయత్నంలో లేని పరుగు కోసం ప్రయత్నించి రనౌట్‌ కావడంతో చిరస్మరణీయ ఇన్నింగ్స్‌కు ముగింపు లభించింది. ఇన్నింగ్స్‌ ఆసాంతం పుజారా ఆట చూస్తే అతడిని ఔట్‌ చేయడానికి రనౌట్‌ తప్ప మరో మార్గం లేదనిపించింది. టెస్టు జట్టులో అందరూ దూకుడుగా ఆడేవారు ఉండాల్సిన అవసరం లేదని పుజారా అమూల్య ఇన్నింగ్స్‌ను చూస్తే ఎవరైనా చెప్పగలరు. సిరీస్‌ తొలి రోజే భారత్‌ పరువు పోకుండా అతని ఆట కాపాడింది. మ్యాచ్‌ గమనం ఎలా సాగినా ఆసీస్‌ గడ్డపై చతేశ్వర్‌ తొలి సెంచరీ మాత్రం అందరికీ గుర్తుండిపోతుంది.  

అదృష్టం కలిసొచ్చి... 
89 పరుగుల వద్ద హాజల్‌వుడ్‌ బౌలింగ్‌లో కట్‌ షాట్‌ ఆడబోయి పుజారా పైన్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. చిన్న శబ్దం రావడంతో బౌలర్, కీపర్‌ అన్యమనస్కంగా అప్పీల్‌ చేశారు గానీ ఇతర సహచరులెవరూ పెద్దగా పట్టించుకోలేదు. దాంతో ఆసీస్‌ రివ్యూ చేయలేదు. తర్వాతి రీప్లేలో బంతి బ్యాట్‌ను తాకిందని తేలింది. ఫలితంగా బతికిపోయిన పుజారా సెంచరీని పూర్తి చేసుకున్నాడు.   

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top