రాహుల్ ఆల్‌రౌండ్ షో
ప్రొ కబడ్డీ లీగ్ చివరి దశకు చేరుకుంటున్న కొద్దీ తెలుగు టైటాన్స్ జట్టు చెలరేగుతోంది. కెప్టెన్ రాహుల్ చౌధరి ఆల్‌రౌండ్ షో చూపెట్టడంతో...
ఢిల్లీపై తెలుగు టైటాన్స్ విజయం
కోల్‌కతా: ప్రొ కబడ్డీ లీగ్ చివరి దశకు చేరుకుంటున్న కొద్దీ తెలుగు టైటాన్స్ జట్టు చెలరేగుతోంది. కెప్టెన్ రాహుల్ చౌధరి ఆల్‌రౌండ్ షో చూపెట్టడంతో మంగళవారం దబాంగ్ ఢిల్లీ కేసీతో జరిగిన మ్యాచ్‌లో టైటాన్స్ 36-28 తేడాతో నెగ్గింది. మూడు వరుస ఓటములతో టోర్నీ ఆరంభించిన టైటాన్స్ గత ఆరు మ్యాచ్‌ల్లో పరాజయమే లేకుండా పట్టికలో రెండో స్థానానికి చేరింది. రాహుల్ కీలక సమయంలో విజృంభించి ఏకంగా 14 రైడింగ్ పాయింట్లతో పాటు ఓ సూపర్ టాకిల్ సహా 2 పాయింట్లు అందించాడు. ఢిల్లీ నుంచి మెరాజ్ షేక్ ఎనిమిది, సెల్వమణి ఐదు రైడింగ్ పాయింట్లు చేశారు.
తొలి అర్ధభాగం 18 నిమిషాల వరకు మ్యాచ్ ఇరు జట్ల మధ్య హోరాహోరీగా సాగింది. 8-8తో సమానంగా ఉన్న దశలో రాహుల్ చౌధరి సూపర్ రైడ్‌తో ఆలౌట్ చేసి జట్టును 12-8కి తీసుకెళ్లాడు. 26వ నిమిషంలో మూడు పాయింట్లు సాధించిన రైడ్‌లో తను గాయపడగా చికిత్స అనంతరం తలకు బ్యాండేజితో బరిలోకి దిగాడు. అటు చివర్లో మరింత దూకుడును ప్రదర్శించిన టైటాన్స్ సునాయాసంగా నెగ్గింది. మరో మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్ 27-25తో బెంగాల్ వారియర్స్‌పై గెలిచింది. వరుసగా ఆరు ఓటముల తర్వాత బెంగళూరు గెలవడం విశేషం.
ప్రొ కబడ్డీలో నేడు
యు ముంబా X పుణెరి పల్టాన్
రాత్రి 8 గంటల నుంచి
మహిళల లీగ్‌లో..
స్టార్మ్ క్వీన్స్ X ఫైర్ బర్డ్స్
రాత్రి 9 గంటల నుంచి
స్టార్ స్పోర్ట్స్2లో ప్రత్యక్ష ప్రసారం


