breaking news
Rahul Chaudhary
-
రూ.కోట్ల ఆస్తి కోసం హైకోర్టునే పక్కదారి పట్టించారు
సాక్షి, అమరావతి: రూ.కోట్లు విలువచేసే కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ భూమిని కొట్టేసేందుకు కుట్ర జరిగిందన్న అనుమానంతో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టులో ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) సింగమనేని ప్రణతి, ఆమె భర్త, న్యాయవాది మేకా రాహుల్ చౌదరి, అలాగే కాకినాడ మునిసిపల్ కార్పొరేషన్ అధికారుల పాత్రపై అనుమానాలు వ్యక్తం చేసింది. కోర్టును తప్పుదోవ పట్టించి రూ. 15 కోట్ల ప్రభుత్వ ఆస్తిని ప్రైవేటు వ్యక్తులకు అప్ప గించే ప్రయత్నం జరిగి ఉండొచ్చని ఇందుకు సంబంధించిన ఒక రివ్యూ పిటిషన్ విచారణ సందర్భంగా అభిప్రాయపడింది. దీంతో ఈ వ్యవహారానికి సంబంధించి ఈ ఏడాది జనవరి 8వ తేదీన ఇచ్చిన ఉత్తర్వులను రద్దుచేసి రివ్యూ పిటిషన్‌ను అనుమతించింది. ‘మోసం, కుమ్మక్కు, పరస్పర విరుద్ధ ప్రయోజనాల ఘర్షణ (కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రస్ట్) వంటి అంశాలు తీవ్రమైన ఆందోళన కలిగిస్తున్నాయి’అని ఈ కేసు విచారణ సందర్భంగా న్యాయమూర్తి జస్టిస్ నూనెపల్లి హరినాథ్ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ఈ మొత్తం వ్యవహారంపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) విచారణ జరపాలని ఆదేశించారు. ఐజీ స్థాయికంటే తక్కువకాని అధికారి విచారణ చేపట్టాలని నిర్దేశించారు. 12 వారాల్లో నివేదిక సమర్పించాలని ఏసీబీ డీజీని ఆదేశించారు. కోర్టును తప్పుదారి పట్టించిన తీరిది » తూర్పు గోదావరి జిల్లా, కాకినాడ అర్బన్ మండలం, రమణయ్యపేట సర్వే నెంబర్ 127/4లో తమకు చెందిన స్థలాల్లో కాకినాడ మునిసిపల్ కార్పొరేషన్ ప్రహరీ నిర్మిస్తోందని, ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ గోదావరిగుంటకు చెందిన గుబ్బల సత్యనారాయణమూర్తి, మరొకరు 2013లో, ఇదే అభ్యర్థనతో వాసంశెట్టి అప్పారావు మరో ముగ్గురు 2015లో హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాల్లో కాకినాడ మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు 2015లో కౌంటర్లు దాఖలు చేశారు. పిటిషనర్లు ఏ స్థలాలనైతే తమ స్థలాలుగా చెబుతున్నారో వాస్తవానికి అవి ప్రజా ప్రయోజనాల నిమిత్తం విడిచిపెట్టిన స్థలాలని, వాటిని కాపాడాల్సిన బాధ్యత తమపై ఉందని కార్పొరేషన్ అధికారులు కౌంటర్లలో పేర్కొన్నారు. » ఇదిలా ఉండగా, కాకినాడ, జయేంద్ర నగర్ నివాసితుల సంక్షేమ సంఘం ఈ వ్యాజ్యాల్లో ప్రతివాదిగా చేరింది. పిటిషనర్లు తమవిగా చెబుతున్న స్థలాలు వారివి కావని, అవి ప్రజా ప్రయోజనార్థం మునిసిపల్ కార్పొరేషన్‌కు తమ సంఘం బహుమతిగా ఇవ్వడం జరిగిందని హైకోర్టుకు నివేదించింది. » ఈ ఏడాది జనవరిలో ఈ వ్యాజ్యాలు మరోసారి విచారణకు వచ్చాయి. పిటిషనర్లు చెబుతున్న స్థలాలు తమవేనంటూ 2015లో దాఖలు చేసిన కౌంటర్‌కు భిన్నంగా కాకినాడ మునిసిపల్ కార్పొరేషన్ జనవరి 6న మరో కౌంటర్ దాఖలు చేసింది. పిటిషనర్లు తమవిగా చెబుతున్న స్థలాల విషయంలో తాము జోక్యం చేసుకోబోమని కోర్టుకు చెప్పింది. అదే రీతిలో ఆ స్థలాలపై తాము ఎలాంటి హక్కు కోరడం లేదంటూ జయేంద్ర నగర్ నివాసితుల సంక్షేమ సంఘం తరఫు న్యాయవాది సైతం హైకోర్టుకు నివేదించారు. మునిసిపల్ కార్పొరేషన్ తాజా కౌంటర్‌ను పరిగణనలోకి తీసుకుని ఈ వ్యాజ్యాలను పరిష్కరించాలని సంఘం న్యాయవాది కోరారు. దీంతో ఇరుపక్షాల అంగీకారంతో హైకోర్టు సింగిల్ జడ్జి ఈ రెండు వ్యాజ్యాలను పరిష్కరించారు. పిటిషనర్ల స్థలాల విషయంలో జోక్యం చేసుకోవద్దని కార్పొరేషన్ అధికారులను ఆదేశిస్తూ 2026 జనవరిలో ఉత్తర్వులిచ్చారు. » ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ జయేంద్రనగర్ నివాసితుల సంక్షేమ సంఘం ధర్మాసనం ముందు అప్పీళ్లు దాఖలు చేసింది. వీటిపై విచారణ జరిపిన ధర్మాసనం, సింగిల్ జడ్జి ముందు పునఃసమీక్ష (రివ్యూ) పిటిషన్ దాఖలు చేసుకోవాలని సంఘానికి సూచించింది. దీంతో జనవరి 8న ఇచ్చిన ఉత్తర్వులను రివ్యూ చేయాలంటూ జయేంద్రనగర్ నివాసితుల సంక్షేమ సంఘం పిటిషన్ దాఖలు చేసింది. » జయేంద్రనగర్ నివాసితుల సంక్షేమ సంఘం తరఫు న్యాయవాది చల్లా వెంకట్ వాదనలు వినిపిస్తూ పిటిషనర్లు, ప్రభుత్వం, మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు, తమ న్యాయవాది కుమ్మక్కై, ఆస్తిని కాజేయడానికి ప్లాన్ వేసి, కోర్టును తప్పుదోవ పట్టించారని విన్నవించారు. హైకోర్టు గమనించిన ముఖ్యాంశాలు..» ప్రణతి గతంలో పిటిషనర్ల తరఫున న్యాయవాదిగా వ్యవహరించి, ఆ తర్వాత ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాదిగా బాధ్యతలు చేపట్టారు. » ఆమె స్థానంలో ఆమె భర్త రాహుల్ చౌదరి అదే పిటిషనర్ల తరఫున వకాలత్ దాఖలు చేశారు. » 2015లో భూమి తమదేనని చెప్పిన మునిసిపల్ కార్పొరేషన్, 2026లో ఆ భూమిపై హక్కు కోరబోమని విరుద్ధ అఫిడవిట్ దాఖలు చేసింది. » హైకోర్టులో ప్రభుత్వం తరఫున మళ్లీ ప్రణతి హాజరు కావడం, కాకినాడ మునిసిపల్ కార్పొరేషన్ గతంలో దాఖలు చేసిన కౌంటర్‌కు భిన్నంగా.. ఇప్పుడు ప్రైవేటు వ్యక్తులకు అనుకూలంగా కౌంటర్ దాఖలు చేయడం వంటి వరుస పరిణామాలపై న్యాయమూర్తి అనుమానాలు వ్యక్తం చేశారు. » ఈ పరిణామాలు కోర్టును తప్పుదోవ పట్టించి ప్రభుత్వ ఆస్తిని కాజేయాలనే ప్రయత్నాన్ని సూచిస్తున్నాయని వ్యాఖ్యానించారు. » ఈ కేసుల్లో ఆయా పార్టీల తరఫున హాజరైన న్యాయవాదులు వ్యవహరించిన తీరు వృత్తిపరమైన తీవ్ర దుష్ప్రవర్తన, కోర్టును మోసం చేయడానికి చేసిన ప్రయత్నమన్నారు. » ప్రభుత్వం, దాని అనుబంధ సంస్థల తరఫున హాజరైన న్యాయవాదులు తమ బాధ్యతలను నిర్వర్తించడంలో దారుణంగా విఫలమయ్యారని తీవ్రంగా ఆక్షేపించారు. » రిట్ పిటిషనర్లు, ప్రతివాదులు (ప్రభుత్వం) తరఫున హాజరైన న్యాయవాదులు కోర్టును మోసం చేయడం పట్ల కోర్టు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. -
రాహుల్ ఆల్‌రౌండ్ షో
ఢిల్లీపై తెలుగు టైటాన్స్ విజయం కోల్‌కతా: ప్రొ కబడ్డీ లీగ్ చివరి దశకు చేరుకుంటున్న కొద్దీ తెలుగు టైటాన్స్ జట్టు చెలరేగుతోంది. కెప్టెన్ రాహుల్ చౌధరి ఆల్‌రౌండ్ షో చూపెట్టడంతో మంగళవారం దబాంగ్ ఢిల్లీ కేసీతో జరిగిన మ్యాచ్‌లో టైటాన్స్ 36-28 తేడాతో నెగ్గింది. మూడు వరుస ఓటములతో టోర్నీ ఆరంభించిన టైటాన్స్ గత ఆరు మ్యాచ్‌ల్లో పరాజయమే లేకుండా పట్టికలో రెండో స్థానానికి చేరింది. రాహుల్ కీలక సమయంలో విజృంభించి ఏకంగా 14 రైడింగ్ పాయింట్లతో పాటు ఓ సూపర్ టాకిల్ సహా 2 పాయింట్లు అందించాడు. ఢిల్లీ నుంచి మెరాజ్ షేక్ ఎనిమిది, సెల్వమణి ఐదు రైడింగ్ పాయింట్లు చేశారు. తొలి అర్ధభాగం 18 నిమిషాల వరకు మ్యాచ్ ఇరు జట్ల మధ్య హోరాహోరీగా సాగింది. 8-8తో సమానంగా ఉన్న దశలో రాహుల్ చౌధరి సూపర్ రైడ్‌తో ఆలౌట్ చేసి జట్టును 12-8కి తీసుకెళ్లాడు. 26వ నిమిషంలో మూడు పాయింట్లు సాధించిన రైడ్‌లో తను గాయపడగా చికిత్స అనంతరం తలకు బ్యాండేజితో బరిలోకి దిగాడు. అటు చివర్లో మరింత దూకుడును ప్రదర్శించిన టైటాన్స్ సునాయాసంగా నెగ్గింది. మరో మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్ 27-25తో బెంగాల్ వారియర్స్‌పై గెలిచింది. వరుసగా ఆరు ఓటముల తర్వాత బెంగళూరు గెలవడం విశేషం. ప్రొ కబడ్డీలో నేడు యు ముంబా X పుణెరి పల్టాన్ రాత్రి 8 గంటల నుంచి మహిళల లీగ్‌లో.. స్టార్మ్ క్వీన్స్ X ఫైర్ బర్డ్స్ రాత్రి 9 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్2లో ప్రత్యక్ష ప్రసారం


