రూ.కోట్ల ఆస్తి కోసం హైకోర్టునే పక్కదారి పట్టించారు | The High Court was sidelined for a property worth crores of rupees. | Sakshi
Sakshi News home page

రూ.కోట్ల ఆస్తి కోసం హైకోర్టునే పక్కదారి పట్టించారు

Jul 30 2026 5:29 AM | Updated on Jul 30 2026 5:30 AM

The High Court was sidelined for a property worth crores of rupees.

కాకినాడ అర్బన్‌ మండలంలో రూ.15 కోట్ల భూమిని కొట్టేసే ప్రయత్నం 

ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సింగమనేని ప్రణతి, ఆమె భర్త, అధికారుల పాత్ర 

భార్య ప్రభుత్వం తరఫున.. భర్త పిటిషనర్ల తరఫున వాదనలు 

వృత్తి ధర్మాన్ని, విశ్వసనీయతను విస్మరించిన న్యాయవాదులు 

ఈ మొత్తం వ్యవహారంపై హైకోర్టు ఆగ్రహం 

దర్యాప్తును 3 నెలల్లో పూర్తి చేసి నివేదికివ్వాలని ఏసీబీకి ఆదేశం

సాక్షి, అమరావతి: రూ.కోట్లు విలువచేసే కాకినాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ భూమిని కొట్టేసేందుకు కుట్ర జరిగిందన్న అనుమానంతో ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టులో ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) సింగమనేని ప్రణతి, ఆమె భర్త,  న్యాయవాది మేకా రాహుల్‌ చౌదరి, అలాగే కాకినాడ మునిసిపల్‌ కార్పొరేషన్‌ అధికారుల పాత్రపై అనుమానాలు వ్యక్తం చేసింది. కోర్టును తప్పుదోవ పట్టించి రూ. 15 కోట్ల ప్రభుత్వ ఆస్తిని ప్రైవేటు వ్యక్తులకు అప్ప గించే ప్రయత్నం జరిగి ఉండొచ్చని ఇందుకు సంబంధించిన ఒక రివ్యూ పిటిషన్‌ విచారణ సందర్భంగా అభిప్రాయపడింది. దీంతో ఈ వ్యవహారానికి సంబంధించి ఈ ఏడాది జనవరి 8వ తేదీన ఇచ్చిన ఉత్తర్వులను రద్దుచేసి రివ్యూ పిటిషన్‌ను అనుమతించింది.  

‘మోసం, కుమ్మక్కు, పరస్పర విరుద్ధ ప్రయోజనాల ఘర్షణ (కాన్‌ఫ్లిక్ట్‌ ఆఫ్‌ ఇంట్రస్ట్‌) వంటి అంశాలు తీవ్రమైన ఆందోళన కలిగిస్తున్నాయి’అని ఈ కేసు విచారణ సందర్భంగా న్యాయమూర్తి జస్టిస్‌ నూనెపల్లి హరినాథ్‌ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ఈ మొత్తం వ్యవహారంపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) విచారణ జరపాలని ఆదేశించారు. ఐజీ స్థాయికంటే తక్కువకాని అధికారి విచారణ చేపట్టాలని నిర్దేశించారు. 12 వారాల్లో నివేదిక సమర్పించాలని ఏసీబీ డీజీని ఆదేశించారు.  

కోర్టును తప్పుదారి పట్టించిన తీరిది 
» తూర్పు గోదావరి జిల్లా, కాకినాడ అర్బన్‌ మండలం, రమణయ్యపేట సర్వే నెంబర్‌ 127/4లో తమకు చెందిన స్థలాల్లో కాకినాడ మునిసిపల్‌ కార్పొరేషన్‌ ప్రహరీ నిర్మిస్తోందని, ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ గోదావరిగుంటకు చెందిన గుబ్బల సత్యనారాయణమూర్తి, మరొకరు 2013లో, ఇదే అభ్యర్థనతో వాసంశెట్టి అప్పారావు మరో ముగ్గురు 2015లో హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాల్లో కాకినాడ మునిసిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు 2015లో కౌంటర్లు దాఖలు చేశారు. పిటిషనర్లు ఏ స్థలాలనైతే తమ స్థలాలుగా చెబుతున్నారో వాస్తవానికి అవి ప్రజా ప్రయోజనాల నిమిత్తం విడిచిపెట్టిన స్థలాలని, వాటిని కాపాడాల్సిన బాధ్యత తమపై ఉందని కార్పొరేషన్‌ అధికారులు కౌంటర్లలో పేర్కొన్నారు. 

»  ఇదిలా ఉండగా, కాకినాడ, జయేంద్ర నగర్‌ నివాసితుల సంక్షేమ సంఘం ఈ వ్యాజ్యాల్లో ప్రతివాదిగా చేరింది. పిటిషనర్లు తమవిగా చెబుతున్న స్థలాలు వారివి కావని, అవి ప్రజా ప్రయోజనార్థం మునిసిపల్‌ కార్పొరేషన్‌కు తమ సంఘం బహుమతిగా ఇవ్వడం జరిగిందని హైకోర్టుకు నివేదించింది.  

» ఈ ఏడాది జనవరిలో ఈ వ్యాజ్యాలు మరోసారి విచారణకు వచ్చాయి. పిటిషనర్లు చెబుతున్న స్థలాలు తమవేనంటూ 2015లో దాఖలు చేసిన కౌంటర్‌కు భిన్నంగా కాకినాడ మునిసిపల్‌ కార్పొరేషన్‌ జనవరి 6న మరో కౌంటర్‌ దాఖలు చేసింది. పిటిషనర్లు తమవిగా చెబుతున్న స్థలాల విషయంలో తాము జోక్యం చేసుకోబోమని కోర్టుకు చెప్పింది. అదే రీతిలో ఆ స్థలాలపై తాము ఎలాంటి హక్కు కోరడం లేదంటూ జయేంద్ర నగర్‌ నివాసితుల సంక్షేమ సంఘం తరఫు న్యాయవాది సైతం హైకోర్టుకు నివేదించారు. మునిసిపల్‌ కార్పొరేషన్‌ తాజా కౌంటర్‌ను పరిగణనలోకి తీసుకుని ఈ వ్యాజ్యాలను పరిష్కరించాలని సంఘం న్యాయవాది కోరారు. దీంతో ఇరుపక్షాల అంగీకారంతో హైకోర్టు సింగిల్‌ జడ్జి ఈ రెండు వ్యాజ్యాలను పరిష్కరించారు. పిటిషనర్ల స్థలాల విషయంలో జోక్యం చేసుకోవద్దని కార్పొరేషన్‌ అధికారులను ఆదేశిస్తూ 2026 జనవరిలో ఉత్తర్వులిచ్చారు.  

» ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ జయేంద్రనగర్‌ నివాసితుల సంక్షేమ సంఘం ధర్మాసనం ముందు అప్పీళ్లు దాఖలు చేసింది. వీటిపై విచారణ జరిపిన ధర్మాసనం, సింగిల్‌ జడ్జి ముందు పునఃసమీక్ష (రివ్యూ) పిటిషన్‌ దాఖలు చేసుకోవాలని సంఘానికి సూచించింది. దీంతో జనవరి 8న ఇచ్చిన ఉత్తర్వులను రివ్యూ చేయాలంటూ జయేంద్రనగర్‌ నివాసితుల సంక్షేమ సంఘం పిటిషన్‌ దాఖలు చేసింది. 

» జయేంద్రనగర్‌ నివాసితుల సంక్షేమ సంఘం తరఫు న్యాయవాది చల్లా వెంకట్‌ వాదనలు వినిపిస్తూ  పిటిషనర్లు, ప్రభుత్వం, మునిసిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు, తమ న్యాయవాది కుమ్మక్కై, ఆస్తిని కాజేయడానికి ప్లాన్‌ వేసి, కోర్టును తప్పుదోవ పట్టించారని విన్నవించారు.  హైకోర్టు గమనించిన ముఖ్యాంశాలు..

» ప్రణతి గతంలో పిటిషనర్ల తరఫున న్యాయవాదిగా వ్యవహరించి, ఆ తర్వాత ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాదిగా బాధ్యతలు చేపట్టారు.  

» ఆమె స్థానంలో ఆమె భర్త రాహుల్‌ చౌదరి అదే పిటిషనర్ల తరఫున వకాలత్‌ దాఖలు చేశారు. 

» 2015లో భూమి తమదేనని చెప్పిన మునిసిపల్‌ కార్పొరేషన్, 2026లో ఆ భూమిపై హక్కు కోరబోమని విరుద్ధ అఫిడవిట్‌ దాఖలు చేసింది. 

»  హైకోర్టులో ప్రభుత్వం తరఫున మళ్లీ ప్రణతి హాజరు కావడం, కాకినాడ మునిసిపల్‌ కార్పొరేషన్‌ గతంలో దాఖలు చేసిన కౌంటర్‌కు భిన్నంగా.. ఇప్పుడు ప్రైవేటు వ్యక్తులకు అనుకూలంగా కౌంటర్‌ దాఖలు చేయడం వంటి వరుస పరిణామాలపై న్యాయమూర్తి అనుమానాలు వ్యక్తం చేశారు. 

» ఈ పరిణామాలు కోర్టును తప్పుదోవ పట్టించి ప్రభుత్వ ఆస్తిని కాజేయాలనే ప్రయత్నాన్ని సూచిస్తున్నాయని వ్యాఖ్యానించారు.  

»  ఈ కేసుల్లో ఆయా పార్టీల తరఫున హాజరైన న్యాయవాదులు వ్యవహరించిన తీరు వృత్తిపరమైన తీవ్ర దుష్ప్రవర్తన, కోర్టును మోసం చేయడానికి చేసిన ప్రయత్నమన్నారు.  

» ప్రభుత్వం, దాని అనుబంధ సంస్థల తరఫున హాజరైన న్యాయవాదులు తమ బాధ్యతలను నిర్వర్తించడంలో దారుణంగా విఫలమయ్యారని తీవ్రంగా ఆక్షేపించారు.  

»  రిట్‌ పిటిషనర్లు, ప్రతివాదులు (ప్రభుత్వం) తరఫున హాజరైన న్యాయవాదులు కోర్టును మోసం చేయడం పట్ల  కోర్టు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement