పీబీఎల్‌కు వేళాయె...

 Premier Badminton League: Season four all set to begin in Mumbai - Sakshi

నేటి నుంచి ప్రీమియర్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌

ఈసారి తొమ్మిది ఫ్రాంచైజీలు

సింధు సారథ్యంలో బరిలోకి హైదరాబాద్‌

నార్త్‌ ఈస్ట్రన్‌ వారియర్స్‌ కెప్టెన్‌గా సైనా  

అభిమానులను అలరించేందుకు... ప్రీమియర్‌ బ్యాడ్మింటన్‌  లీగ్‌ వచ్చేసింది. ప్రపంచ దిగ్గజాలనదగ్గ ఆటగాళ్ల మధ్య హోరాహోరీ సమరాలతో ఆద్యంతం కట్టిపడేయనుంది. జోరుమీదున్న పీవీ సింధు... కొరకరాని కొయ్యల్లాంటి కరోలినా మారిన్‌ మధ్య పోరాటంతో టోర్నీ తొలి రోజే రక్తికట్టనుంది. చాంపియన్ల మధ్య నేటి నుంచి 23 రోజుల పాటు రాకెట్ల పోరు హోరెత్తనుంది.   

ముంబై: ఏటేటా ఆదరణ పెంచుకుంటూ... ఆకర్షణ జోడించుకుంటూ వస్తోన్న ప్రీమియర్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌ (పీబీఎల్‌) నాలుగో సీజన్‌లోకి అడుగుపెట్టింది. ముంబై వేదికగా శనివారం లీగ్‌ నగారా మోగనుంది. పుణే సెవెన్‌ ఏసెస్, హైదరాబాద్‌ హంటర్స్‌ మధ్య ఇక్కడి వర్లిలోని నేషనల్‌ స్పోర్ట్స్‌ క్లబ్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌ఎస్‌సీఐ)లో ప్రారంభ మ్యాచ్‌ జరుగనుంది. టోర్నీ ఫార్మాట్‌ ప్రకారం ఇరు జట్ల మధ్య పోరులో రెండు పురుషుల సింగిల్స్, ఒక మహిళల సింగిల్స్, మిక్స్‌డ్‌ డబుల్స్, పురుషుల డబుల్స్‌ విభాగాల్లో ఐదు మ్యాచ్‌లు జరుగుతాయి. ఒక్కో మ్యాచ్‌ మూడు గేమ్‌ల పాటు సాగుతుంది. ప్రతి గేమ్‌కు గరిష్టంగా 15 పాయింట్లు సాధించాల్సి ఉంటుంది. గతేడాది 8 జట్లుండగా, ఈసారి వాటికి పుణె సెవెన్‌ ఏసెస్‌ జతయింది. మొత్తం 23 రోజుల పాటు ఐదు వేదికల్లో మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఇందులో అహ్మదాబాద్, పుణే తొలిసారి ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన 8 మంది ఆటగాళ్లు లీగ్‌ బరిలో ఉండటం విశేషం. బెంగళూరులో జనవరి 13న జరిగే ఫైనల్‌తో టోర్నీ ముగుస్తుంది. 

సింధు నిలబెడుతుందా? 
గతేడాది వరకు చెన్నైకు ఆడిన తెలుగమ్మాయి, సంచలనాల పూసర్ల వెంకట సింధు ప్రస్తుతం హైదరాబాద్‌ హంటర్స్‌ సారథిగా బరిలో దిగుతోంది. ఈ నేపథ్యంలో సొంత నగరం, లీగ్‌ డిఫెండింగ్‌ చాంపియన్‌ అయిన హైదరాబాద్‌ను మరోసారి విజేతగా నిలపాల్సిన బాధ్యత ఆమెపై ఉంది. ఇటీవలే వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌ నెగ్గి చరిత్ర సృష్టించిన సింధు... ఆ జోరును కొనసాగిస్తే ఇదేమంత కష్టం కాదు. అయితే, జట్టులోని మిగతా సభ్యులూ ఇందుకు తగినట్లుగా ఆడాలి. ‘నాలుగో సీజన్‌లో హైదరాబాద్‌కు ఆడుతున్నాను. నా శక్తి మేర ఆడేందుకు ప్రయత్నిస్తా. ఇలాగే జట్టు సభ్యులు రాణిస్తారని ఆశిస్తున్నా’ అని సింధు పేర్కొంది. 

బలంగా పుణే
ఒలింపిక్, ప్రపంచ చాంపియన్‌ కరోలినా మారిన్‌ ప్రాతినిధ్యంతో పుణే ఫ్రాంచైజీ అరంగేట్రంలోనే బలంగా కనిపిస్తోంది. ఆమెకు తోడు ఆసియా జూ.బాలుర చాంపియన్‌షిప్‌ విజేత లక్ష్య సేన్, డబుల్స్‌ నిపుణుడు మథియాస్‌ బొ, అజయ్‌ జయరాం, ప్రజక్తా సావంత్‌లతో పుణే అవకాశాలు మెరుగయ్యాయి. మారిన్‌ 2016, 2017 ఎడిషన్‌లలో హైదరాబాద్‌కు ఆడింది.  

ఈ పోరు ఆసక్తికరం...
మంచి ఫామ్‌లో ఉన్న సింధు.. ఆమెకు దీటైన కరోలినా మారిన్‌ శనివారం తలపడనున్నారు. ఈ మ్యాచ్‌ ఆసక్తికరంగా సాగడం ఖాయం. బెంగళూరు రాప్టర్స్‌కు కిడాంబి శ్రీకాంత్, ఢిల్లీ డాషర్స్‌కు హెచ్‌ఎస్‌ ప్రణయ్, నార్త్‌ ఈస్ట్రన్‌ వారియర్స్‌కు సైనా నెహ్వాల్‌ కెప్టెన్లుగా తమతమ జట్లను నడిపించనున్నారు. 

►8 బ్యాడ్మింటన్‌ ప్రపంచ టాప్‌–10 ర్యాంకుల్లోని 8 మంది ఈ లీగ్‌లో ఆడనున్నారు

►90 పాల్గొననున్న మొత్తం ఆటగాళ్ల సంఖ్య 

►17 దేశాల ఆటగాళ్లు లీగ్‌లో ప్రాతినిధ్యం వహించనున్నారు 

► మొత్తం జట్లు : 9 హైదరాబాద్‌ హంటర్స్,  ముంబై రాకెట్స్, నార్త్‌ ఈస్ట్రన్‌ వారియర్స్, పుణే 7 ఏసెస్, చెన్నై స్మాషర్స్, అహ్మదాబాద్‌ స్మాష్‌ మాస్టర్స్, అవధ్‌ వారియర్స్, బెంగళూరు రాప్టర్స్, ఢిల్లీ డాషర్స్‌

 హైదరాబాద్‌ హంటర్స్‌ జట్టు
►కెప్టెన్‌: పీవీ సింధు 
►పురుషుల సింగిల్స్‌: లీ హ్యున్‌ ఇ, చిట్టబోయిన రాహుల్‌ యాదవ్, మార్క్‌ కాల్జౌ 
►మహిళల సింగిల్స్‌: పీవీ సింధు, సాయి ఉత్తేజిత రావు 
►పురుషుల డబుల్స్‌: కిమ్‌ సా రాంగ్, అరుణ్‌ జార్జ్,  బోదిన్‌ ఇస్సారా 
►  మిక్స్‌డ్‌ డబుల్స్‌: ఇయొం హె వాన్, జక్కంపూడి మేఘన
►రూ. 6 కోట్లు  మొత్తం ప్రైజ్‌మనీ 
►రూ. 3 కోట్లు  విజేత జట్టుకు 
►రూ.1.5 కోట్లు  రన్నరప్‌కు
►మూడు, నాలుగు స్థానాలకు: రూ.75 లక్షల చొప్పున
► సాయంత్రం గం‘‘ 7నుంచి స్టార్‌స్పోర్ట్స్‌–1లో  ప్రత్యక్షప్రసారం

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top