మాజీ చాంపియన్ల సమరం

Pakistan set sights on Sri Lanka after surprise win against England - Sakshi

పాక్‌తో తలపడనున్న శ్రీలంక

బ్యాటింగ్‌పై లంక ఆందోళన

మధ్యాహ్నం 3 గంటల నుంచి స్టార్‌స్పోర్ట్స్‌–1లో ప్రత్యక్ష ప్రసారం

బ్రిస్టల్‌: వరుస ప్రపంచకప్‌ల చాంపియన్లు పాకిస్తాన్‌ (1992), శ్రీలంక (1996) జట్లు నేడు ‘ఢీ’కొనేందుకు సిద్ధమయ్యాయి. ఇరు జట్లు తొలి మ్యాచ్‌లో చేతులెత్తేసినా... రెండో మ్యాచ్‌లో విజయం సాధించాయి. అయితే శ్రీలంక కంటే పాకిస్తానే కాస్త పటిష్టంగా కనిపిస్తోంది. గత మ్యాచ్‌లో ఆతిథ్య ఇంగ్లండ్‌కు గట్టి షాక్‌ ఇచ్చిన పాక్‌ ఇపుడు రెండో విజయంపై కన్నేసింది. బ్యాటింగ్‌ కూడా బలపడటంతో శ్రీలంకకు కష్టాలు తప్పేలాలేవు. ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌తో పాకిస్తాన్‌ టాపార్డర్‌ బ్యాట్స్‌మెన్‌ ఫామ్‌లోకి వచ్చారు. బాబర్‌ ఆజమ్, హఫీజ్, కెప్టెన్‌ సర్ఫరాజ్‌ అర్ధసెంచరీలతో ఊపు మీదున్నారు. బౌలింగ్‌లో వాహబ్‌ రియాజ్, షాదాబ్‌ ఖాన్, ఆమిర్‌లు నిలకడగా వికెట్‌ తీస్తున్నారు.

మరోవైపు కరుణరత్నె సారథ్యంలోని లంక మాత్రం రెండు మ్యాచ్‌ల్లోనూ ఇంకా బ్యాటింగ్‌లో సత్తా చాటలేకపోయింది. రెండు మ్యాచ్‌ల్లో 50 ఓవర్ల కోట పూర్తిగా ఆడనేలేదు. మొదటి మ్యాచ్‌లో కివీస్‌ ధాటికి బ్యాట్లెత్తిన లంక బ్యాట్స్‌మెన్‌... తర్వాత క్రికెట్‌ కూన అఫ్గానిస్తాన్‌పై కూడా జోరు కనబర్చలేకపోయారు. చచ్చీచెడి 201 పరుగులు చేశారు. అఫ్గాన్‌ బ్యాటింగ్‌ వైఫల్యంతో మూల్యం చెల్లించుకుంది కానీ లేదంటే లంక రెండో మ్యాచ్‌ కూడా ఓడిపోయేది.  వరల్డ్‌కప్‌లో లంకపై పాకిస్తాన్‌కు ఘనమైన రికార్డు ఉంది. ఇప్పటిదాకా ఏ ప్రపంచకప్‌లోనూ పాక్‌పై లంక గెలవలేకపోయింది. ఆడిన ఏడు మ్యాచ్‌ల్లోనూ ఓటమినే మూటగట్టుకుంది. ఇపుడు ఈ మరక చెరిపేసుకోవాలంటే లంక ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టాలి.  

 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top