జొకోవిచ్ ‘సిక్సర్’ | Novak Djokovic beats Andy Murray to win sixth Australian Open title | Sakshi
Sakshi News home page

జొకోవిచ్ ‘సిక్సర్’

Feb 1 2016 12:14 AM | Updated on Sep 3 2017 4:42 PM

జొకోవిచ్ ‘సిక్సర్’

జొకోవిచ్ ‘సిక్సర్’

అదే జోరు. అదే ఫలితం. వెరసి ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో నొవాక్ జొకోవిచ్ ఆరోసారి విజేతగా నిలిచాడు.

* ఆరోసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ హస్తగతం
* రూ. 16 కోట్ల 35 లక్షల ప్రైజ్‌మనీ సొంతం
* ఐదోసారి ఫైనల్లో ఓడిన ఆండీ ముర్రే

మెల్‌బోర్న్: అదే జోరు. అదే ఫలితం. వెరసి ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో నొవాక్ జొకోవిచ్ ఆరోసారి విజేతగా నిలిచాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో టాప్ సీడ్ జొకోవిచ్ 6-1, 7-5, 7-6 (7/3)తో రెండో సీడ్ ఆండీ ముర్రే (బ్రిటన్)పై గెలుపొందాడు. గతంలో జొకోవిచ్ 2008, 2011, 2013, 2014, 2015లలో ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్స్‌ను సొంతం చేసుకున్నాడు. మరోవైపు ఆండీ ముర్రే ఐదోసారీ రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకున్నాడు.

ఐదు ఫైనల్స్‌లో ముర్రే నాలుగుసార్లు జొకోవిచ్ చేతిలో... ఒకసారి ఫెడరర్ (2010లో) చేతిలో ఓటమి చవిచూశాడు.
 రెండు గంటల 53 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో జొకోవిచ్ ఆటతీరుకు ముర్రే వద్ద సమాధానం లేకపోయింది. తొలి సెట్‌లో కేవలం ఒక గేమ్ కోల్పోయిన జొకోవిచ్... రెండో సెట్‌లో రెండుసార్లు ముర్రే సర్వీస్‌ను బ్రేక్ చేసి తన సర్వీస్‌ను ఒకసారి చేజార్చుకున్నాడు. మూడో సెట్‌లో ఇద్దరూ ఒక్కోసారి సర్వీస్‌ను కోల్పోయారు. అయితే టైబ్రేక్‌లో జొకోవిచ్ పైచేయి సాధించి వరుస సెట్‌లలో విజయాన్ని ఖాయం చేసుకున్నాడు. ముర్రే ఏకంగా 65 అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకున్నాడు.
 
విజేతగా నిలిచిన జొకోవిచ్‌కు 34 లక్షల ఆస్ట్రేలియన్ డాలర్ల (రూ. 16 కోట్ల 35 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 2000 ర్యాంకింగ్ పాయింట్లు... రన్నరప్ ఆండీ ముర్రేకు 17 లక్షల ఆస్ట్రేలియన్ డాలర్ల (రూ. 8 కోట్ల 17 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 1300 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.
 
ఈ గెలుపుతో జొకోవిచ్ ఓపెన్ శకంలో (1968 నుంచి) అత్యధికంగా ఆరుసార్లు ఆస్ట్రేలియన్ ఓపెన్‌ను నెగ్గిన తొలి ప్లేయర్‌గా గుర్తింపు పొందాడు. 1968కి ముందు ఈ టోర్నీని రాయ్ ఎమర్సన్ (ఆస్ట్రేలియా) ఆరుసార్లు సాధించాడు. ప్రస్తుతం ఎమర్సన్ పేరిట ఉన్న అత్యధిక ఆస్ట్రేలియన్ టైటిల్స్ రికార్డును జొకోవిచ్ సమం చేశాడు.
 తన కెరీర్‌లో 11వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించిన జొకోవిచ్ అత్యధిక గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ నెగ్గిన క్రీడాకారుల జాబితాలో జాన్ బోర్గ్ (స్వీడన్), రాడ్ లేవర్ (ఆస్ట్రేలియా)లతో కలిసి సంయుక్తంగా నాలుగో స్థానానికి చేరుకున్నాడు. ఫెడరర్ (17 టైటిల్స్) తొలి స్థానంలో, పీట్ సంప్రాస్ (అమెరికా), రాఫెల్ నాదల్ (స్పెయిన్-14 చొప్పున) రెండో స్థానంలో, రాయ్ ఎమర్సన్ (12 టైటిల్స్) మూడో స్థానంలో ఉన్నారు.
 
తాజా పరాజయంతో ఆండీ ముర్రే ఓపెన్ శకంలో ఒకే గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఐదుసార్లు ఫైనల్లో ఓడిన రెండో క్రీడాకారుడిగా నిలిచాడు. గతంలో ముర్రేకు కోచ్‌గా వ్యవహరించిన ఇవాన్ లెండిల్ యూఎస్ ఓపెన్‌లో (1982, 83, 84, 88, 89) ఐదుసార్లు ఫైనల్‌కు చేరుకొని రన్నరప్‌గా నిలిచాడు. ఆ తర్వాత లెండిల్ యూఎస్ ఓపెన్‌ను మూడుసార్లు (1985, 86, 87) సాధించడం విశేషం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement