
చీటింగ్ కేసులో కోర్టులో హాజరైన స్టార్ ప్లేయర్
అవినీతి, చీటింగ్ కేసుల్లో నిందితుడుగా ఉన్న బార్సిలోనా సూపర్ స్ట్రయికర్ స్పెయిన్ లోని మాడ్రిడ్ నగరంలో ఉన్న నేయ్మర్ స్పానిష్ నేషనల్ కోర్టులో హాజరయ్యాడు.
మాడ్రిడ్: అవినీతి, చీటింగ్ కేసుల్లో నిందితుడుగా ఉన్న బార్సిలోనా సూపర్ స్ట్రయికర్ స్పెయిన్ లోని మాడ్రిడ్ నగరంలో ఉన్న నేయ్మర్ స్పానిష్ నేషనల్ కోర్టులో హాజరయ్యాడు. బ్రెజిలియన్ క్లబ్ సాంటోస్ నుంచి 2013 సమ్మర్ లో బార్సిలోనా జట్టుకు నేయ్మర్ మారాడు. తండ్రితో కలిసి మంగళవారం నాడు స్పానిష్ కోర్టుకు వచ్చాడు. ఈ స్టార్ ప్లేయర్ తండ్రిపై కూడా ఈ కేసులో ఆరోపణలున్నాయి. 90 నిమిషాలపాటు అక్కడ విచారణ జరిగింది. అయితే, మీడియా నేయ్మర్ ను సంప్రదించగా ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దాదాపు రెండేళ్ల నుంచి నేయ్మర్, అతడి తండ్రిపై విచారణ కొనసాగుతూనే ఉంది.
బార్సిలోనా, సాంటోస్ జట్లకు స్టార్ ప్లేయర్ ఒప్పందం విషయంలో వివాదాలు తలెత్తిన విషయం అందరికీ విదితమే. 'డీఐఎస్' కంపెనీ ఇందుకు సంబంధించి దావా వేసింది. బార్కా నేయ్మర్ కు చెల్లిస్తున్న దాదాపు 620 కోట్ల రూపాయల్లో డీఐఎస్ సంస్థ తమకు 40 శాతం బార్సిలోనా క్లబ్ నుంచి చట్టపరంగా రావాల్సి ఉందని దావాలో పేర్కొంది. ఈ కేసు విషమమై బార్కా అధ్యక్షుడు జోసెఫ్ మరియా, మాజీ అధ్యక్షుడు శాండ్రో రోసెల్ లు కూడా సోమవారం స్పెయిన్ కోర్టుకు విచారణ నిమిత్తం హాజరైన విషయం తెలిసిందే.