
ఫుట్‌బాల్ ప్రపంచంలో సంచలనంగా మారిన ఓ వార్త ప్రస్తుతం అంతర్జాతీయ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. బ్రెజిల్‌కు చెందిన ఓ 31 ఏళ్ల వ్యాపారవేత్త తన యావదాస్తిని (సుమారు ₹8,400 కోట్లు (USD 6.1 బిలియన్)) తన దేశానికే చెందిన స్టార్ ఫుట్‌బాలర్ నెయ్‌మార్‌కు రాసిచ్చాడు. ఈ వార్త సోషల్‌మీడియాలోనూ హాట్ టాపిక్‌గా మారింది.
బ్రెజిల్‌లోని రియో గ్రాండ్ డో సల్‌కు చెందిన ఓ వ్యాపారవేత్త ఇటీవలే మరణించాడు. అతనికి భార్య, పిల్లలు లేరు. అతనికి నెయ్‌మార్ అంటే అపారమైన ప్రేమ, అభిమానం. ఆ వ్యక్తి తన జీవితంలో ఒక్కసారి కూడా నెయ్‌మార్‌ను కలవలేదు. కేవలం నెయ్‌మార్ వ్యక్తిత్వం నచ్చి ఇదే ఏడాది జూన్‌లో తన యావదాస్తిని వారసత్వంగా ఇస్తున్నట్లు వీలునామా రాశాడు.
ఆ విల్‌లో సదరు వ్యాపారవేత్త ఈ విషయాలను ప్రస్తావించాడు. నేను ఎవరి ప్రమేయం లేకుండా, ఇష్టపూర్వకంగా ఈ నిర్ణయం తీసుకున్నాను. నాకు నెయ్‌మార్ అంటే చాలా ఇష్టం, అతనిలో నన్ను నేను చూసుకుంటాను. నెయ్‌మార్ చాలా నిస్వార్థమైన వ్యక్తి. ఎంత ఎదిగినా చాలా తగ్గి ఉంటాడు. అతనిలో గర్వం కొంచమైనా లేదు.
నెయ్‌మార్ కుటుంబానికి ఇచ్చే విలువ, తండ్రితో అతని బాండింగ్ నాకు చాలా నచ్చుతుంది. అతన్ని చూసినప్పుడు నాకు నా తండ్రితో గడిపిన క్షణాలు గుర్తుకొస్తాయి. ఈ కాలంలో నెయ్‌మార్ లాంటి వ్యక్తిత్వం ఉన్న వారిని చూడలేము. అందుకే అతనికి నా యావదాస్తి రాసిస్తున్నాను. నెయ్‌మార్‌కు నా ఆస్తి దక్కితే ఖచ్చితంగా మంచి పనికే ఉపయెగపడుతుందని సదరు వ్యాపారవేత్త తన విల్‌లో రాసుకొచ్చాడు.
ఈ వీలునామా ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉంది. ఈ విల్‌కు ఆ వ్యాపారవేత్త బంధువులు అభ్యంతరం చెప్పకపోతే అతి త్వరలో నెయ్‌మార్ చేతుల్లోకి ఆస్తి వస్తుంది. అయితే ఈ విల్‌పై నెయ్‌మార్ ఇప్పటివరకు స్పందించలేదు. ఈ విషయం తెలిసి యావత్ ప్రపంచం నిర్ఘాంతపోతుంది. వ్యక్తిత్వం నచ్చినంత మాత్రనా, ఇంత ఆస్తిని ధారాదత్తం చేస్తారా అని జనాలు నోరెళ్లబెడుతున్నారు.
వాస్తవానికి ప్రపంచం మొత్తానికి నెయ్‌మార్ ఓ స్టార్ ఫుట్‌బాలర్‌గా మాత్రమే తెలుసు. అతనిది చిన్నపిల్లల మనస్తత్వం అని దగ్గరి వారు అంటుంటారు. నెయ్‌మార్ ఆన్‌ఫీల్డ్, ఆఫ్ ద ఫీల్డ్ చాలా సరదాగా ఉంటాడు. సహచరులతో నెయ్‌మార్ చిలిపి చేష్ఠలు సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతుంటాయి.
తాజా ఉదంతంతో నెయ్‌మార్‌లోని కొత్త కోణం ప్రపంచానికి తెలిసింది. ఓ వ్యక్తి ఒక్క సారి కూడా కలవకుండానే వేల కోట్ల ఆస్తి రాసిచ్చాడంటే నెయ్‌మార్ వ్యక్తిత్వం ఎంత గొప్పదై ఉంటుందో ఊహించుకోవచ్చు. మొత్తానికి ఈ వార్త నెయ్‌మార్‌ను ఫుట్‌బాల్‌కు పరిచయం లేని వారికి కూడా పరిచయం చేసింది.
33 ఏళ్ల నెయ్‌మార్ ప్రస్తుతం సాంటోస్ క్లబ్‌కు ఆడుతున్నాడు. ఫిట్‌నెస్ సమస్యల కారణంగా గత కొంతకాలంగా జాతీయ జట్టుకు (బ్రెజిల్) దూరంగా ఉన్నాడు. 2026 వరల్డ్‌కప్ సమయానికంతా జట్టులోకి రావాలని భావిస్తున్నాడు. అయితే కొత్త కోచ్ కార్లో అంచెలొట్టి నెయ్‌మార్‌ను జాతీయ జట్టులోకి రాకుండా అడ్డుపడుతున్నట్లు తెలుస్తుంది.