నల్లగొండ ఈగల్స్‌ జట్టుకు టైటిల్‌ 

Nalgonda Eagles Wins Telangana Kabaddi Title - Sakshi

వరంగల్‌ వారియర్స్‌కు మూడో స్థానం

 తెలంగాణ ప్రీమియర్‌ కబడ్డీ లీగ్‌

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ప్రీమియర్‌ కబడ్డీ లీగ్‌ సీజన్‌–3లో నల్లగొండ వారియర్స్‌ జట్టు అదరగొట్టింది. యూసుఫ్‌గూడలోని కోట్ల విజయ భాస్కర్‌ రెడ్డి మైదానంలో జరిగిన ఈ టోర్నీలో నల్లగొండ ఈగల్స్‌ జట్టు చాంపియన్‌గా నిలిచింది. శనివారం జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో నల్లగొండ ఈగల్స్‌ 44–39తో మంచిర్యాల టైగర్స్‌పై గెలుపొంది టైటిల్‌ను హస్తగతం చేసుకుంది. తొలుత రైడింగ్‌లో మల్లికార్జున్‌ (24 పాయింట్లు) విజృంభించడంతో తొలి అర్ధభాగం ముగిసేసరికి నల్లగొండ ఈగల్స్‌ జట్టు 23–21తో స్వల్ప ఆధిక్యాన్ని ప్రదర్శించింది. రెండో అర్ధభాగంలోనూ సమష్టిగా రాణించిన నల్లగొండ 21 పాయింట్లు స్కోర్‌ చేసి విజయాన్ని అందుకుంది. మ్యాచ్‌ ఆసాంతం ఆకట్టుకున్న పి. మల్లికార్జున్‌ ‘బెస్ట్‌ రైడర్‌ ఆఫ్‌ ద మాŠయ్చ్‌’ అవార్డు అందుకున్నాడు. 3 పాయింట్లు సాధించిన కార్తీక్‌ యాదవ్‌ (మంచిర్యాల టైగర్స్‌) ‘బెస్ట్‌ డిఫెండర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ గా ఎంపికయ్యాడు.  

సైబరాబాద్‌పై వరంగల్‌ గెలుపు  
మూడో స్థానం కోసం జరిగిన వర్గీకరణ మ్యాచ్‌లో వరంగల్‌ వారియర్స్‌ జట్టు ఆకట్టుకుంది. ఈ మ్యాచ్‌లో వరంగల్‌ వారియర్స్‌ 39–26తో సైబరాబాద్‌ చార్జర్స్‌ను ఓడించి మూడో స్థానాన్ని దక్కించుకుంది. మ్యాచ్‌ ప్రారంభంలో సైబరాబాద్‌ జట్టు చెలరేగింది. వరుసగా పాయింట్లు సాధిస్తూ 21–11తో స్పష్టమైన ఆధిక్యంలో నిలిచింది. అయితే రెండో అర్ధభాగంలో చెలరేగిన వరంగల్‌ వారియర్స్‌ అనూహ్య రీతిలో విజయం సాధించింది. రైడర్‌ జి. రాజు 17 పాయింట్లతో చెలరేగడంతో రెండో అర్ధభాగంలో ఏకంగా 28 పాయింట్లు సాధించి విజయాన్ని అందుకుంది. వరంగల్‌ జోరు ముందు సైబరాబాద్‌ చతికిలబడింది. ఈ మ్యాచ్‌లో ‘బెస్ట్‌ రైడర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా జి.రాజు, ‘బెస్ట్‌ డిఫెండర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా వి. రమేశ్‌ ఎంపికయ్యారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top