
కరాచీ: పాకిస్తాన్ ప్రధానమంత్రిగా ఇమ్రాన్ ఖాన్ బాధ్యతలు చేపట్టాక పాక్ క్రికెట్‌లో వేగంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మన్ పదవికి నజామ్ సేథీ రాజీనామా చేశారు. ఆయన పదవీకాలం 2020 వరకు ఉన్నా, అనూహ్యంగా పదవి నుంచి తప్పుకొన్నారు. ‘ నేనే పీసీబీ పదవికి రాజీనామా చేస్తూ లేఖను ప్రధానికి సమర్పించడకోసం కొన్ని రోజులుగా వెయిట్ చేస్తున్నా. సోమవారం నా రాజీనామాను సమర్పించాను. పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు ఆల్ ది బెస్ట్. మన క్రికెట్ ఉన్నతి శిఖరాలను అధిరోహిస్తుందని ఆశిస్తున్నా’ అని పేర్కొన్నారు.
2017 ఆగస్టులో పీసీబీ చైర్మన్‌గా నజామ్ సేథీ బాధ్యతలు స్వీకరించారు. ఆయన్ను పీసీబీ గవర్నింగ్ బాడీ ఏకగీవ్రంగా ఎన్నుకుంది. అయితే ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ఇమ్రాన్ ఖాన్‌తో నజామ్‌కు సత్సంబంధాలు లేకపోవడమే రాజీనామకు కారణంగా తెలుస్తోంది. నజామ్ పదవీ బాధ్యతల్ని వైదొలిగిన వెంటనే ఐసీసీ మాజీ చీఫ్ ఎహ్‌సాన్ మణిని చైర్మన్‌గా నామినేట్ చేస్తున్నట్టు ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ట్వీట్ చేశారు. క్రికెట్‌లో మంచి అనుభవం ఉన్న మణి పీసీబీ చాకచక్యంగా నడుపుతాడని ఇమ్రాన్ ధీమా వ్యక్యం చేశారు.