
ఆండీ ముర్రే కోచ్‌గా అమెలీ మౌరెస్మో
బ్రిటన్ టెన్నిస్ స్టార్ ఆండీ ముర్రే సంచలన నిర్ణయం తీసుకున్నాడు. మహిళా మాజీ క్రీడాకారిణిని తన కోచ్‌గా నియమించుకున్నాడు.
లండన్: బ్రిటన్ టెన్నిస్ స్టార్ ఆండీ ముర్రే సంచలన నిర్ణయం తీసుకున్నాడు. మహిళా మాజీ క్రీడాకారిణిని తన కోచ్‌గా నియమించుకున్నాడు. మహిళల సింగిల్స్‌లో ప్రపంచ మాజీ నంబర్‌వన్, ఫ్రాన్స్ క్రీడాకారిణి అమెలీ మౌరెస్మోను ముర్రే తన కొత్త కోచ్‌గా ఎంపిక చేసుకున్నాడు. 34 ఏళ్ల మౌరెస్మో క్రీడాకారిణిగా రెండు గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు ఆస్ట్రేలియా ఓపెన్ (2006), వింబుల్డన్ (2006)లను సాధించింది. అయితే పురుషుడిని పోలిన రూపం కలిగిన మౌరెస్మో పలు వివాదాలనూ ఎదుర్కొంది. ఆమె మహిళ కాదని, తనలో మగ లక్షణాలు ఉన్నాయంటూ స్విట్జర్లాండ్ స్టార్ ప్లేయర్ మార్టినా హింగిస్ వంటి తోటి క్రీడాకారిణులు అప్పట్లో ఆరోపణలు చేశారు.
కాగా... గ్రాస్ కోర్టులపై చక్కటి పట్టున్న మౌరెస్మోను కోచ్‌గా నియమించుకోవడం ద్వారా రానున్న గ్రాస్ కోర్టు సీజన్‌లో, యూఎస్ ఓపెన్‌లో రాణించాలన్నది ముర్రే ఆలోచన. గత ఏడాది వింబుల్డన్‌లో ముర్రే విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. పురుష క్రీడాకారులకు మహిళా ప్లేయర్స్ కోచ్‌లుగా ఉండటం అరుదు. 1990 దశకంలో చెస్నోకోవ్ (రష్యా)కు తాతియానా నౌమ్‌కో; 1980 దశకంలో టిమ్ మయోటికి బిల్లీ జీన్ కింగ్ కోచ్‌లుగా ఉన్నారు. నేటితరం ఆటగాళ్లలో డెనిస్ ఇస్తోమిన్ (ఉజ్బెకిస్థాన్)కు అతని తల్లి క్లౌడియా కోచ్‌గా వ్యవహరిస్తోంది.