ముంబై ముచ్చటగా... | Sakshi
Sakshi News home page

ముంబై ముచ్చటగా...

Published Thu, Mar 21 2019 12:04 AM

Mumbai Indians: Strengthening its back-up options - Sakshi

ఐపీఎల్‌లో మొదటి టోర్నీ తర్వాత మరోసారి ఆఖరి బంతికే ఫలితం తేలింది 2017 ఫైనల్లోనే. హోరాహోరీగా సాగిన తుది పోరులో మరో మహారాష్ట్ర జట్టు రైజింగ్‌ పుణే సూపర్‌ జెయింట్‌ను ఓడించి ముంబై ఇండియన్స్‌ ముచ్చటగా మూడో సారి ట్రోఫీ గెలుచుకొని ఈ ఘనత సాధించిన తొలి జట్టుగా నిలిచింది. 2016 విజేత కావడంతో టోర్నీ తొలి మ్యాచ్‌కు ఆ తర్వాత ఫైనల్‌ పోరుకు కూడా హైదరాబాద్‌ ఆతిథ్యమిచ్చింది. 2017 లీగ్‌ దశలో టాప్‌–2లో నిలిచిన జట్లే తుదిపోరులో తలపడ్డాయి. గతానికి భిన్నంగా ఈసారి ఐపీఎల్‌ నిర్వాహకులు ఎనిమిది వేదికల్లో కూడా అక్కడి తొలి మ్యాచ్‌ సమయంలో ప్రారంభోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సీజన్‌ తో ఐపీఎల్‌లో పుణే, గుజరాత్‌ జట్ల ఆట ముగిసింది. టోర్నీ ప్రారంభానికి ముందు  పుణే యాజమాన్యం అనూహ్యంగా ధోనిని కెప్టెన్సీ నుంచి తప్పించింది. అతని స్థానంలో బాధ్యతలు తీసుకున్న స్టీవ్‌ స్మిత్‌ టీమ్‌ను రన్నరప్‌గా నిలపడం విశేషం.  

ఒక్క పరుగుతో... 
ముందుగా ముంబై 8 వికెట్లకు 129 పరుగులు చేసింది. ఒక దశలో ముంబై స్కోరు 79/7 కాగా... ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ కృనాల్‌ పాండ్యా (47) ఆదుకోవడంతో ఆ మాత్రం స్కోరైనా వచ్చింది. అనంతరం పుణే 6 వికెట్లకు 128 పరుగులే చేయగలిగింది. స్మిత్‌ (51), రహానే (44) పోరాటం సరిపోలేదు. చివరి ఓవర్లో విజయానికి 11 పరుగులు కావాల్సి ఉండగా మూడో బంతికి రాయుడు పట్టిన చక్కటి క్యాచ్‌తో స్మిత్‌ ఔటయ్యాడు. ఆఖరి బంతికి 4 పరుగులు అవసరం కాగా... మూడో పరుగు తీసే క్రమంలో బ్యాట్స్‌మన్‌ రనౌటయ్యాడు.

ఆమ్లా జోరు... 
టోర్నీలో ఐదు సెంచరీలు నమోదయ్యాయి. టి20ల్లో పెద్దగా పేరు లేని ఆమ్లా రెండు శతకాలు బాదగా... వార్నర్, స్టోక్స్, శామ్సన్‌ చెరో సెంచరీ కొట్టారు. మ్యాక్స్‌వెల్‌ 26 సిక్సర్లతో అగ్రస్థానంలో నిలిచాడు.

ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌:
బెన్‌ స్టోక్స్‌ (పుణే – 316 పరుగులు, 12 వికెట్లు)  
అత్యధిక పరుగులు (ఆరెంజ్‌ క్యాప్‌):
డేవిడ్‌ వార్నర్‌ (సన్‌రైజర్స్‌–641 పరుగులు) 
అత్యధిక వికెట్లు (పర్పుల్‌ క్యాప్‌):
భువనేశ్వర్‌ (సన్‌రైజర్స్‌–26 వికెట్లు) 

Advertisement
Advertisement