 
															ఫైనల్లో ముంబై ఇండియన్స్
ఐపీఎల్-8లో భాగంగా ఇక్కడ చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన తొలి క్వాలిఫయర్ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ 25 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్ కు చేరింది.
	ముంబై:ఐపీఎల్-8లో భాగంగా ఇక్కడ చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన తొలి క్వాలిఫయర్ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ 25 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్ కు చేరింది. ముంబై విసిరిన 188 పరుగుల విజయలక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన చెన్నైకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. డ్వేన్ స్మిత్ డకౌట్ రూపంలో తొలి వికెట్ గా వెనుదిరిగి అభిమానుల్ని నిరాశపరిచాడు.ఆ తరువాత మైక్ హస్పీ(16)పరుగులు చేసి అదే బాటలో పయనించడంతో చెన్నైకు కష్టాల్లో పడింది. మైక్ హస్సీ అవుటయ్యే సరికి చెన్నై స్కోరు 46. ఆ తరుణంలో  డుప్లెసిస్ కు జతకలిసిన సురేష్ రైనా చెన్నై ఇన్నింగ్స్ కు మరమ్మత్తులు చేపట్టాడు.వీరిద్దరు కలిసి 35 పరుగులు భాగస్వామ్యాన్ని నెలకొల్పిన అనంతరం రైనా(25)పరుగులు చేసి హర్బజన్ బౌలింగ్ లో వెనుదిరిగాడు. ఆ తదుపరి బంతికే కెప్టెన్ మహేంద్ర సింగ్ డకౌట్ రూపంలో పెవిలియన్ కు చేరాడు.అటు తరువాత ఎన్నో ఆశలు పెట్టుకున్న బ్రేవో (20), నేగీ (3), రవీంద్ర జడేజా(19) కూడా విఫలం చెందడంతో చెన్నై 19 ఓవర్లలో చెన్నై 162 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది.  ముంబై బౌలర్లలో మలింగాకు మూడు వికెట్లు లభించగా, హర్భజన్ సింగ్, వినయ్ కుమార్ లు చెరో రెండు వికెట్లు, సుచిత్, మెక్ లాగాహన్ లకు తలో వికెట్ లభించింది.
	
	అంతకుముందు టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ 187 పరుగులు చేసింది.  సిమ్మన్స్(65), పార్థీవ్ పటేల్(35)లు రాణించడంతో ముంబైకు శుభారంభం లభించింది. కాగా, అనంతరం పాండ్యా(1), రోహిత్ శర్మ(19) లు ఆకట్టుకోలేకపోయారు. మధ్యలో పొలార్డ్(41) ముంబై భారీ స్కోరు చేయడంలో సహకరించాడు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
