
బ్రేవో కొత్త పాటలో కోహ్లి, ధోని!
మైదానంలో దిగితే బంతి, బ్యాట్‌తో అద్భుతాలు చేయగల నైపుణ్యం డ్వేన్ బ్రేవో సొంతం.
ముంబై: మైదానంలో దిగితే బంతి, బ్యాట్‌తో అద్భుతాలు చేయగల నైపుణ్యం డ్వేన్ బ్రేవో సొంతం. ఐపీఎల్‌లో తన సత్తా ఏమిటో ఇప్పటికే అభిమానులు చూశారు. అయితే అతడిలో క్రికెటే కాకుండా మంచి గాయకుడు కూడా ఉన్న విషయం గతేడాది ప్రపంచ వ్యాప్తంగా తెలిసింది. టి20 ప్రపంచకప్‌కు ముందు ‘చాంపియన్’ పేరిట అతడు విడుదల చేసిన ఆల్బమ్ సంచలనం సృష్టించింది. ఇప్పుడు గుజరాత్ లయన్స్ తరఫున గాయం కారణంగా ఒక్క మ్యాచ్ కూడా ఆడని బ్రేవో తాజాగా మరో పాటను విడుదల చేసేందుకు ఎదురు చూస్తున్నాడు.
లయన్స్ జట్టు ట్విట్టర్‌లో ఇందుకు సంబంధించి ఓ వీడియో ఉంచింది. దీంట్లో తన సోదరుడు డారెన్ బ్రేవోతో కనిపించిన డ్వేన్ బ్రేవో తన కొత్త పాట పాడాడు. ఈ పాటలో కెప్టెన్ విరాట్ కోహ్లి, మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని పేర్లు కూడా ఉండటంతో వీరు కూడా ఈ పాటలో కనిపిస్తారేమోనని అంతా భావిస్తున్నారు. గతంలో బ్రేవోకు చెందిన ‘చలో చలో’ పాటలో కోహ్లి కొద్దిసేపు కనిపించాడు.