క్రికెటర్ షమీకి భారీ ఊరట!

Mohammed Shami Got Clean Chit In Match Fixing Case - Sakshi

సాక్షి, ముంబై: భార్య హసీన్ జహాన్ ఆరోపణలతో గత కొన్ని రోజులుగా ఉక్కిరిబిక్కిరవుతున్న టీమిండియా క్రికెటర్ మహ్మద్ షమీకి భారీ ఊరట లభించింది. పేసర్ షమీ ఎలాంటి మ్యాచ్‌ ఫిక్సింగ్‌లకు పాల్పడలేదని తేలింది. ఈ మేరకు బీసీసీఐ అవినీతి నిరోధక శాఖ విభాగం చీఫ్ నీరజ్ కుమార్ గురువారం ఓ ప్రకటనలో వెల్లడించారు. త్వరలో ప్రారంభం కానున్న ఐపీఎల్ లో ఆడేందుకు షమీకి మార్గం సుగమమైంది.

హసీన్ జహాన్ చేసిన ఫిక్సింగ్ ఆరోపణల్లో మ్యాచ్ ఫిక్సింగ్ ఒకటి కాగా, వారం రోజుల కిందట బీసీసీఐ నేతృత్వంలోని అవినీతి నిరోధక విభాగం షమీ కేసును దర్యాప్తు చేసింది. అయితే అతడు మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు తమకు ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదని నీరజ్ కుమార్ వివరించారు. తమ నివేదికలో షమీకి క్లీన్ చిట్ ఇవ్వడంతో అతడి క్రికెట్ కెరీర్‌కు ఎలాంటి ఢోకా లేదని తేలింది. మరోవైపు బీసీసీఐ ఇటీవల పునరుద్ధరించిన వార్షిక కాంట్రాక్టు ఆటగాళ్ల జాబితాలో బౌలర్ షమీ పేరు చేర్చినట్లు సమాచారం. 

భార్య హసీన్ జహాన్ చేసిన ఆరోపణల కారణంగా కాంట్రాక్టు జాబితాలో చోటు కల్పించని, బీసీసీఐ తాజాగా షమీ నిర్దోషి అని తేల్చుతూ.. అతడిని వార్షిక కాంట్రాక్టులో గ్రేడ్ 'బి'లో చేర్చింది. దీని ప్రకారం షమీ వార్షిక జీతభత్యాలు రూ.3 కోట్లు అందుకోనున్నాడు. ఏ ప్లస్ గ్రేడ్ ఆటగాళ్లు రూ.7కోట్లు, ఏ గ్రేడ్‌ క్రికెటర్లు 5 కోట్ల వార్షిక వేతనం పొందనుండగా సి గ్రేడ్ ఆటగాళ్లు కోటి రూపాయలు బీసీసీఐ నుంచి అందుకుంటారు.

కాగా, హసీన్ జహాన్ ఫిర్యాదు చేసిన హత్యాయత్నం, గృహ హింస, అత్యాచార యత్నం కేసుల విచారణ షమీపై ఇంకా కొనసాగుతోంది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top