భావితరానికి బాట వేశాం | Mithali Raj Chosen As World Cup Team Captain By ICC | Sakshi
Sakshi News home page

భావితరానికి బాట వేశాం

Jul 25 2017 12:12 AM | Updated on Sep 5 2017 4:47 PM

భావితరానికి బాట వేశాం

భావితరానికి బాట వేశాం

ఏమాత్రం అంచనాలు లేకుండా... ఎవరి దృష్టినీ ఆకర్షించకుండా మహిళల ప్రపంచకప్‌లో అడుగుపెట్టిన భారత జట్టు సృష్టించిన సంచలనం

మహిళల క్రికెట్‌కు ఆదరణ పెరుగుతోంది
ఫైనల్లో ఒత్తిడిని అధిగమించలేకపోయాం
మాకూ ఐపీఎల్‌ ఉంటే మంచిది 
కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ మనోగతం  


ఏమాత్రం అంచనాలు లేకుండా... ఎవరి దృష్టినీ ఆకర్షించకుండా మహిళల ప్రపంచకప్‌లో అడుగుపెట్టిన భారత జట్టు సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు.. పటిష్ట జట్లనే మట్టికరిపిస్తూ ఏకంగా తుది పోరుకే చేరి ఒక్కసారిగా భారత క్రీడాభిమానుల హృదయాలను కొల్లగొట్టింది. దీంతో అంతా మహిళల క్రికెట్‌ గురించే మాట్లాడుకోసాగారు. ఇప్పుడు ఈ పరిణామాలే భవిష్యత్‌ అద్భుతంగా ఉండేందుకు దోహద పడతాయని కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ ఆకాంక్షిస్తోంది.  

లండన్‌: ఇంగ్లండ్‌ వేదికగా జరిగిన ప్రపంచకప్‌లో విశేషంగా రాణించి తమ జట్టు రాబోయే తరాలకు బాట వేసినట్లు  టీమిండియా కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ తెలిపింది. అయితే ఫైనల్లో ఓటమి తీవ్రంగా నిరాశపరిచిందని... కీలకదశలో ఒత్తిడికి లోనుకావడమే దీనికి కారణమని వివరించింది. బిగ్‌బాష్, ఐపీఎల్‌ తరహా లీగ్‌ల్లో ఆడితే ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవచ్చని ప్రస్తుతం లండన్‌లోనే ఉన్న 34 ఏళ్ల మిథాలీ రాజ్‌ పేర్కొంది. అలాగే ఈ మెగా టోర్నీలో జట్టు ప్రదర్శన, ఇతర అంశాలపై మిథాలీ వెలిబుచ్చిన అభిప్రాయాలు ఆమె మాటల్లోనే...
రాబోయే తరానికి వేదికను ఏర్పాటు చేశాం...

మా జట్టు ఆడిన తీరుపై నేను గర్వంగా ఉన్నాను. భారత వర్ధమాన మహిళా క్రికెటర్లకు వీరంతా మంచి వేదికను ఏర్పాటు చేసినట్టుగానే భావిస్తున్నాను. క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకునేందుకు ద్వారాలు తెరిచినట్టయ్యింది. దీనికి ఎవరికి వారు గర్వపడాల్సిందే.
ఒత్తిడిని అధిగమించలేకపోయారు...

ఫైనల్‌కు ముందు జట్టులోని ప్రతి ఒక్కరు నెర్వస్‌గా ఉన్నారు. ఇది మా ఓటమికి కారణమయ్యింది. ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్న అనుభవం వారికి లేదు. కానీ టోర్నీ అంతా వారు పోరాడిన తీరు మెచ్చుకోదగింది.

మహిళల జట్టుకు భవిష్యత్‌ ఉంది...
జట్టులో నాణ్యమైన క్రికెటర్లున్నారు. భారత జట్టుకు మెరుగైన భవిష్యత్‌ ఉంది. కీలక మ్యాచ్‌ల్లో ఒత్తిడిని తగ్గించుకుని ఆడితే సరిపోతుంది. 2005 ప్రపంచకప్‌ ఫైనల్లో మేం ఆసీస్‌ చేతిలో 98 పరుగుల తేడాతో ఓడాం. దాంతో పోలిస్తే ఇప్పటికి మేం చాలా మెరుగుపడినట్టే.

టెయిలెండర్లకు బ్యాటింగ్‌ రావాలి...
ఫైనల్లో హర్మన్‌ప్రీత్‌ కౌర్, పూనమ్‌ రౌత్‌ ఆడిన తీరు అద్భుతం. అయితే వారిద్దరి వికెట్లు పడిన తర్వాత పరిస్థితి మొత్తం తలకిందులైంది. లోయర్‌ మిడిలార్డర్‌ బ్యాటింగ్‌పై చాలాకాలంగా ఆందోళన ఉంది. వారి నుంచి కాస్త పరుగులు రావాల్సి ఉంది. టెయిలెండర్లకు బ్యాటింగ్‌ రావడం కూడా ముఖ్యమే.

స్పందన అనూహ్యం...
ప్రధాని, మాజీ క్రికెటర్లతో పాటు దేశవ్యాప్తంగా అభిమానులు స్పందించిన తీరు నిజంగా సంతోషాన్నిచ్చింది. కచ్చితంగా మమ్మల్ని చూసి బీసీసీఐ గర్విస్తుంది. లీగ్‌ దశలో వరుసగా దక్షిణాప్రికా, ఆసీస్‌ జట్ల చేతిలో ఓడిపోయాక మేము ఫైనల్‌కు వస్తామని ఎవరూ అనుకోలేదు. అయితే మేము కలిసికట్టుగా పోరాడి టైటిల్‌ పోరుకు అర్హత సాధించాం.

ఐపీఎల్, బీబీఎల్‌ ఉపయోగపడతాయి...
స్మృతి, హర్మన్‌ప్రీత్‌లకు బిగ్‌బాష్‌ లీగ్‌ అనుభవం బాగా ఉపయోగపడింది. మాలో చాలామందికి అలాంటి లీగ్‌ల్లో ఆడగలిగితే ఇలాంటి కీలక మ్యాచ్‌ల్లో తడబడకుండా ఉండగలరు. నాకైతే మహిళలకు కూడా ఐపీఎల్‌ను ఏర్పాటు చేసేందుకు ఇదే సరైన సమయమని అనిపిస్తోంది.  

మరింత మెరుగ్గా రాణించగలం: జులన్‌
మహిళల ప్రపంచకప్‌ ఫైనల్లో ఓడి నిరాశపరిచినా మరింత మెరుగ్గా రాణించగల సత్తా భారత జట్టుకు ఉందని పేసర్‌ జులన్‌ గోస్వామి అభిప్రాయపడింది. ‘టోర్నీ ప్రారంభమైన తొలి రోజున మా జట్టు ఫైనల్‌ చేరుతుందని ఎవరూ ఊహించలేదు. తొలి మ్యాచ్‌లోనే ఇంగ్లండ్‌ను ఓడించిన అనంతరం మాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. జట్టుగా సమష్టి పోరాటం చేస్తే ఫలితం దక్కుతుందని మేం నమ్మాం. ఈ ప్రయాణాన్ని మేం ఆస్వాదిస్తున్నాం. ఒక్క ఫైనల్‌ తప్ప మా ఆటతీరు గర్వించే స్థాయిలోనే ఉంది’ అని గోస్వామి పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement