
‘డాన్’ను పట్టించిన ప్రపంచకప్...
సాంచెజ్ అరెలానో...ఎన్నో ఏళ్ల పాటు మెక్సికో దేశాన్ని వణికించిన ‘తిజువానా కార్టెల్’ అనే క్రిమినల్ గ్రూప్ అధినేత.
సాంచెజ్ అరెలానో...ఎన్నో ఏళ్ల పాటు మెక్సికో దేశాన్ని వణికించిన ‘తిజువానా కార్టెల్’ అనే క్రిమినల్ గ్రూప్ అధినేత. అత్యంత క్రూరమైనదిగా గుర్తింపు ఉన్న ఈ సంస్థ ముఖ్యంగా డ్రగ్స్ ప్రపంచంలో తనదైన ఆధిపత్యం ప్రదర్శించింది. కొన్నాళ్ళుగా మెక్సికోలో డ్రగ్స్ వ్యాపారం తగ్గు ముఖం పట్టినా...దక్షిణ అమెరికా దేశాల్లో అది మళ్లీ విస్తరిస్తోంది. 2013లో యూఎస్ డ్రగ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అడ్మినిస్ట్రేషన్ ప్రకటించిన ఆరుగురు ‘మోస్ట్ వాంటెడ్ డ్రగ్ ట్రాఫికర్స్’లో అరెలానో ఒకడు.
చాలా కాలంగా పోలీసులు వెతుకున్నా అతను పట్టుబడలేదు. అతని గురించి సమాచారం ఇచ్చినవారికి 14 లక్షల పౌండ్లు (దాదాపు రూ. 14 కోట్లు) బహుమతి ఇస్తామని కూడా ప్రభుత్వం ప్రకటించింది. అయితే సోమవారం మెక్సికోలోని తిజువానా నగరంలో ప్రపంచ కప్ మ్యాచ్ చూస్తూ అతను నాటకీయంగా పట్టుబడ్డాడు. మెక్సికో- క్రొయేషియా మధ్య మ్యాచ్‌ను టీవీలో చూస్తూ లోకాన్ని మరచిపోయినట్లున్నాడు! పోలీసుల రాకను ఏ మాత్రం అంచనా వేయలేకపోయిన అతను దొరికిపోయాడు. అన్నట్లు పట్టుబడిన సమయంలో అతను మెక్సికో టీమ్ గ్రీన్ ఫుట్‌బాల్ జెర్సీ వేసుకోవడంతో పాటు ముఖంపై ఆ దేశపు జాతీయ పతాకాన్ని కూడా పెయింట్ చేసుకొని ఉండటం విశేషం!