మెస్సీ మళ్లీ... | Messi scores two as Argentina beat Nigeria | Sakshi
Sakshi News home page

మెస్సీ మళ్లీ...

Jun 26 2014 1:29 AM | Updated on Oct 22 2018 5:58 PM

మెస్సీ మళ్లీ... - Sakshi

మెస్సీ మళ్లీ...

పటిష్టమైన అర్జెంటీనా చేతిలో ఓడిపోయినా... నైజీరియా జట్టు ప్రపంచకప్‌లో నాకౌట్‌కు అర్హత సాధించింది. మ్యాచ్‌ను డ్రా చేసుకున్నా ముందుకు వెళ్లే స్థితిలో బరిలోకి దిగిన నైజీరియా...

అర్జెంటీనా ‘హ్యాట్రిక్’ విజయం
  నైజీరియాపై 3-2తో గెలుపు
 గ్రూప్ ‘ఎఫ్’లో అగ్రస్థానం
 ఓడినా నాకౌట్‌కు నైజీరియా
 
 క్లబ్ మ్యాచ్‌ల్లో కళ్లు చెదిరే విన్యాసాలతో గోల్స్ చేస్తాడని... దేశం తరఫున ఆడే సమయంలో మాత్రం అలాంటివేవి కానరావని తనపై ఉన్న విమర్శలకు అర్జెంటీనా సూపర్‌స్టార్ లియోనెల్ మెస్సీ తనదైన శైలిలో సమాధానం ఇచ్చాడు. నైజీరియాపై రెండు కళ్లుచెదిరే గోల్స్‌తో అర్జెంటీనా ఖాతాలో హ్యాట్రిక్ విజయం చేర్చాడు. ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ మెస్సీ గోల్స్ చేయడం విశేషం.
 
 పోర్టో అలెగ్రె: పటిష్టమైన అర్జెంటీనా చేతిలో ఓడిపోయినా... నైజీరియా జట్టు ప్రపంచకప్‌లో నాకౌట్‌కు అర్హత సాధించింది. మ్యాచ్‌ను డ్రా చేసుకున్నా ముందుకు వెళ్లే స్థితిలో బరిలోకి దిగిన నైజీరియా... అటు ఇదే గ్రూప్‌లో మరో మ్యాచ్‌లో ఇరాన్ ఓడిపోవడంతో గట్టెక్కింది. బుధవారం గ్రూప్ ‘ఎఫ్’లో ఆసక్తికరంగా సాగిన మ్యాచ్‌లో అర్జెంటీనా 3-2తో నైజీరియాపై నెగ్గింది.ఆట 3వ నిమిషంలో, 45+1వ నిమిషంలో మెస్సీ రెండు గోల్స్ చేశాడు. ఆట 50వ నిమిషంలో రోజో అర్జెంటీనాకు మూడో గోల్ చేశాడు. నైజీరియా తరఫున మూసా (4వ, 47వ) రెండు గోల్స్ సాధించాడు. ఈ గెలుపుతో అర్జెంటీనా 9 పాయింట్లతో గ్రూప్ ‘ఎఫ్’లో అగ్రస్థానాన్ని దక్కించుకోగా... 4 పాయింట్లతో నైజీరియా రెండో స్థానంలో నిలిచి నాకౌట్ దశకు అర్హత సాధించింది.
 
 ఈ మ్యాచ్‌కు ముందు ప్రస్తుత ప్రపంచకప్‌లో ప్రత్యర్థి జట్టుకు ఒక్క గోల్ కూడా సమర్పించుకోని జట్టుగా నిలిచిన నైజీరియాకు మూడో నిమిషంలోనే షాక్ తగిలింది. ఏంజెల్ డి మారియా కొట్టిన షాట్ నైజీరియా గోల్‌పోస్ట్ స్థంభానికి తగిలి ‘డి’ ఏరియా మధ్యభాగానికి తిరిగి రాగా... దూసుకొచ్చిన అర్జెంటీనా కెప్టెన్ మెస్సీ శక్తివంతమైన కిక్‌తో బంతిని లక్ష్యానికి చేర్చాడు. మెస్సీ కెరీర్‌లోనే ఇది అత్యంత తక్కువ సమయంలో (2 నిమిషాల 26 సెకన్లు) చేసిన తొలి గోల్ కావడం విశేషం.
 
 అయితే అర్జెంటీనా ఆనందం తదుపరి నిమిషంలోనే ఆవిరైంది. బాబాతుండే ఇచ్చిన పాస్‌ను అహ్మద్ మూసా గోల్‌గా మలచడంతో స్కోరు 1-1తో సమమైంది. ఫలితంగా ప్రపంచకప్ చరిత్రలో తొలి నాలుగు నిమిషాల్లోనే రెండు గోల్స్ నమోదైన మూడో మ్యాచ్‌గా ఇది గుర్తింపు పొందింది.
 
 తొలి అర్ధభాగం 1-1తో సమంగా ముగుస్తుందని అనుకుంటున్న తరుణంలో మెస్సీ మాయ చేశాడు. 25 గజాల దూరం నుంచి ఎడమ కాలితో మెస్సీ సంధించిన ఫ్రీకిక్ నేరుగా గోల్‌పోస్ట్‌లోనికి వెళ్లింది.
 
 ద్వితీయార్థంలో మూడు నిమిషాల వ్యవధిలో రెండు గోల్స్ నమోదయ్యాయి. 47వ నిమిషంలో అహ్మద్ మూసా గోల్‌తో నైజీరియా 2-2తో స్కోరును సమం చేసింది. అయితే 50వ నిమిషంలో రోజో చేసిన గోల్‌తో అర్జెంటీనా 3-2తో ఆధిక్యంలోకి వెళ్లి చివరి వరకు నిలబెట్టుకుంది.
 

Advertisement
 
Advertisement
Advertisement