మయాంక్‌ ట్రిపుల్‌ సెంచరీ

Mayank triple century - Sakshi

విజయం దిశగా కర్ణాటక  

పుణే:  కర్ణాటక బ్యాట్స్‌మన్‌ మయాంక్‌ అగర్వాల్‌ (494 బంతుల్లో 304 నాటౌట్‌; 28 ఫోర్లు, 4 సిక్సర్లు) ఫస్ట్‌ క్లాస్‌ కెరీర్‌లో తొలి ట్రిపుల్‌ సెంచరీతో చెలరేగాడు. ఫలితంగా మహారాష్ట్రతో ఇక్కడ జరుగుతున్న మ్యాచ్‌లో కర్ణాటక విజయం దిశగా సాగుతోంది. ఓవర్‌నైట్‌ స్కోరు 461/1తో ఆట కొనసాగించిన కర్ణాటక తమ తొలి ఇన్నింగ్స్‌ను 5 వికెట్ల నష్టానికి 628 పరుగుల వద్ద డిక్లేర్‌ చేసి 383 పరుగుల భారీ ఆధిక్యం సాధించింది. రెండో రోజు గురువారం ఆట ముగిసేసరికి 219 పరుగుల వద్ద ఉన్న మయాంక్‌ అదే జోరును కొనసాగించి ‘ట్రిపుల్‌’ను అందుకోగా, కరుణ్‌ నాయర్‌ (116) కూడా సెంచరీ చేశాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో మహారాష్ట్ర 4 వికెట్లకు 135 పరుగులు చేసింది. మరో 248 పరుగులు వెనుకబడి ఉన్న ఆ జట్టు చివరి రోజు ఓట మి నుంచి తప్పించుకోవడం దాదాపు అసాధ్యమే.  

►3 ఈ సీజన్‌లో ప్రశాంత్‌ చోప్రా, హనుమ విహారి తర్వాత ట్రిపుల్‌ సెంచరీ సాధించిన మూడో ఆటగాడు మయాంక్‌. భారత గడ్డపై ఓవరాల్‌గా ఇది 50వ ఫస్ట్‌క్లాస్‌ ట్రిపుల్‌ సెంచరీ కావడం విశేషం. 2006–07 సీజన్‌ నుంచి తీసుకుంటే గత పదేళ్లలోనే భారత్‌లో 28 ‘ట్రిపుల్స్‌’ నమోదు కాగా... ఇదే సమయంలో ప్రపంచంలోని అన్ని దేశాల్లో కలిపి 31 ట్రిపుల్‌ సెంచరీలు మాత్రమే రికార్డయ్యాయి. చతేశ్వర్‌ పుజారా, రవీంద్ర జడేజా మాత్రమే చెరో మూడు ట్రిపుల్‌ సెంచరీలు సాధించారు.   

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top