ఈ నలు‘గురి’... 

Mayank, Prithvi, Siraj ,hanuma vihari: Form Guide of Team India New Recruits - Sakshi

మయాంక్, పృథ్వీ షా, విహారి, సిరాజ్‌లకు చక్కటి అవకాశం

విండీస్‌ సిరీస్‌లో రాణిస్తే  భవిష్యత్‌కు భరోసా

సీనియర్ల స్థానాలనూ భర్తీ చేసే చాన్స్‌

ఓపెనింగ్‌లో ఏర్పడిన అనూహ్య ఖాళీలు... ఆరో స్థానంలో నిఖార్సైన బ్యాట్స్‌మన్‌ను ఆడించే ఆలోచన... పేస్‌ వనరులను మరింత పదునెక్కించే ఉద్దేశం...! సమీకరణాలు ఏమైతేనేమి? వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌ ఒక్కసారిగా నలుగురు యువ ఆటగాళ్లకు మహదవకాశంగా మారింది. టెస్టు జట్టులో తొలిసారి ఎంపికైన ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్, పేసర్‌ మొహమ్మద్‌ సిరాజ్‌లతో పాటు ఇప్పటికే జట్టుతో ఉన్న హనుమ విహారి, పృథ్వీ షాలలో కనీసం ఇద్దరు, లేదంటే ముగ్గురు ఈ సిరీస్‌లో టీమిండియా తరఫున మైదానంలోకి దిగడం ఖాయం. జట్టుకు అత్యవసరమైన ఇలాంటి పరిస్థితుల్లో తమ ప్రదర్శనతో ఆకట్టుకుంటే వీరి భవిష్యత్‌కు భరోసా లభించడమే కాకుండా జట్టులో స్థానాలు సుస్థిరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.   

సాక్షి క్రీడా విభాగం : ఇటీవలి కాలంలో ఎన్నడూ లేని విధంగా రెండు సిరీస్‌ల వ్యవధిలో టీమిండియా టెస్టు జట్టులోకి ఐదుగురు కొత్త ఆటగాళ్లు వచ్చి చేరారు. ఇందుకు రెగ్యులర్‌ ఆటగాళ్ల ఫామ్‌ లేమి వంటి పరిస్థితులు కొంత కారణం కాగా... తప్పక పరీక్షించి చూడాలనేంతగా యువతరం సత్తా చాటడం మరో కారణం. వీరిలో వికెట్‌ కీపర్‌గా రిషభ్‌ పంత్‌ ఇప్పటికే తన ఎంపికకు కొంత న్యాయం చేశాడు. మిగిలింది మయాంక్, పృథ్వీ షా, హనుమ విహారి, సిరాజ్‌. తాజా పరిణామాల మధ్య వీరి ముందున్నది చక్కటి అవకాశం. దీనిని సద్వినియోగం చేసుకుంటే జట్టు అవసరాలు తీరి మరింత పటిష్టం అయ్యేందుకు వీలుంటుంది. ఈ నేపథ్యంలో ఒక్కొక్కరి ముందున్న సవాళ్లు ఎలాంటివి? వాటిని అందుకునే మార్గాలేమిటి? అనేది పరిశీలిస్తే... 

ఓపెనింగ్‌ సమస్య తీర్చేనా! 
సంప్రదాయ క్రికెట్‌లో గత పదేళ్లుగా భారత్‌ తరఫున ఓపెనర్లుగా అరంగేట్రం చేసింది నలుగురే (విజయ్, ధావన్, అభినవ్‌ ముకుంద్, కేఎల్‌ రాహుల్‌) ఆటగాళ్లు. సెహ్వాగ్‌–గంభీర్‌ స్థాయిలో వీరిలో ఏ జోడీ కూడా స్థిరంగా రాణించలేదు. మిడిలార్డర్‌లో లెక్కకు మిక్కిలి ప్రత్యామ్నాయాలున్నా, ఇన్నింగ్స్‌కు బలమైన పునాది వేసే ఆటగాడి కోసం అన్వేషణ సాగుతూనే ఉంది. ఇప్పుడు ధావన్, విజయ్‌లపై వేటుతో ఒక స్థానం ఖాళీ అయింది. వయసురీత్యా చూసినా, ఫామ్‌ను పరిగణనలోకి తీసుకున్నా అద్భుతం అనదగ్గ స్థాయిలో రాణిస్తే తప్ప వీరు మళ్లీ టెస్టులకు ఎంపికవడం కష్టమే. ఒక ఓపెనర్‌గా రాహుల్‌ స్థిరపడ్డాడని అనుకున్నా, మరో స్థానం మయాంక్‌ అగర్వాల్, పృథ్వీ షా కోసం ఎదురుచూస్తోంది. వీరిలో ఒకరు విండీస్‌ సిరీస్‌లో అరంగేట్రం చేయడం పక్కా. అనుభవరీత్యా చూస్తే టీం మేనేజ్‌మెంట్‌ మయాంక్‌ వైపే మొగ్గు చూపొచ్చని అంచనా. అయితే, పృథ్వీని ఆడించినా ఆశ్చర్యం లేదు. ఎలాగూ ప్రత్యర్థి బలహీనమైనదే కాబట్టి చెరొక టెస్టు చాన్సిచ్చినా ఇవ్వొచ్చు. ఇప్పటికైతే అవకాశాలు సమంగా ఉన్నాయి. ఇక ప్రతిభ పరంగా ఇద్దరూ సమఉజ్జీలే. ఈ కాలపు టెస్టులకు తగిన స్ట్రయిక్‌ రేట్‌ (పృథ్వీ–76.69; మయాంక్‌ 60.93) ఉన్నవారే. సాధికారిక డిఫెన్స్‌తో పాటు దూకుడుగానూ ఆడగలరు. టెక్నిక్‌ పరంగానూ లోపాలు లేవు. బలహీనమైన విండీస్‌ బౌలింగ్‌లో పరుగులు సాధించి ఆత్మవిశ్వాసం కూడగట్టుకుంటే... తదుపరి ఆస్ట్రేలియా పర్యటనకూ వీరినే పరిగణించే అవకాశం ఉంటుంది. మరోవైపు దేశవాళీల్లో కనుచూపు మేరలో మరే ఓపెనింగ్‌ ఆటగాడూ వీరి స్థాయిలో రాణించడం లేదు. దీన్నిబట్టి... తొలుత విఫలమైనా కుదురుకునే వరకు ఈ ఇద్దరికి అవకాశాలిస్తారని చెప్పొచ్చు. వీరు చేయాల్సిందల్లా... తమ సామర్థ్యానికి తగినట్లుగా ఆడటమే. అదే జరిగితే టీమిండియాను వేధిస్తున్న ‘ఓపెనింగ్‌’ ఇబ్బంది తీరినట్లే. 

విహారి ‘ఆరో’హణం... 
కోహ్లి సేన విదేశీ పరాజయాలకు ప్రధాన కారణం... ఆరో స్థానంలో సమర్థుడైన బ్యాట్స్‌మన్‌ లేకపోవడం. వీవీఎస్‌ లక్ష్మణ్‌ తర్వాత ఈ స్థానాన్ని భర్తీ చేయదగ్గ ఆటగాడు దొరకలేదు. లోయరార్డర్‌తో సమన్వయం చేసుకుంటూ జట్టుకు అవసరమైన పరుగులు జోడించడం నంబర్‌ 6 బ్యాట్స్‌మన్‌ కర్తవ్యం. ఈ బాధ్యతను నిర్వర్తించేవారు లేకే ఇంగ్లండ్‌ పర్యటనలో టెస్టులను కోల్పోవాల్సి వచ్చింది. అయితే, ఆ సిరీస్‌లో ఐదో టెస్టు ఆడిన హనుమ విహారి ఆరో నంబరుకు తగినవాడిగా ఆశలు రేపాడు. బ్యాటింగ్‌లో అర్ధ శతకంతో పాటు ఉపయుక్తమైన ఆఫ్‌ స్పిన్‌తో మూడు వికెట్లు పడగొట్టాడు. జట్టుకు సరిగ్గా అవసరమైన ప్రదర్శన ఇది. ఓ విధంగా చెప్పాలంటే స్పిన్‌ వేయగలగడమే... కరుణ్‌ నాయర్‌ను కాదని విహారిని ఆడించేలా చేసింది. విండీస్‌ సిరీస్‌లోనూ సత్తా చాటితే మున్ముందు హార్దిక్‌ పాండ్యా బదులుగా బ్యాటింగ్‌ ఆల్‌రౌండర్‌గా విహారినే టీం మేనేజ్‌మెంట్‌ నమ్ముకోవచ్చు.  

పేస్‌ ‘సిరాజసం’ చాటితే... 
పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ప్రతిభ చాటుకున్నా సిరాజ్‌ టెస్టు స్థాయికి ఎదుగుతాడని ఎవరూ ఊహించలేదు. కానీ, ఏడాది వ్యవధిలోనే అతడు అద్భుతంగా రూపాంతరం చెందాడు. దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా ‘ఎ’ జట్లపై గణాంకాలు చూస్తే అతడి పేస్‌ ఎంత పదునెక్కిందో తెలుస్తోంది. నిలకడైన వేగంతో పాటు స్వింగ్, బౌన్స్‌ సిరాజ్‌ బౌలింగ్‌ ప్రత్యేకతలు. ఇషాంత్, షమీ, భువనేశ్వర్, బుమ్రా, ఉమేశ్‌ యాదవ్‌ తర్వాత ఇప్పుడు దేశంలో టాప్‌ పేసర్‌ సిరాజే అనడంలో సందేహం లేదు. పేస్‌ పిచ్‌లు తయారు చేయనున్నారన్న ఊహాగానాల మధ్య... భీకర ఫామ్‌లో ఉన్నందున విండీస్‌ సిరీస్‌లో ఓ టెస్టులో అతడిని బరిలో దింపినా దింపొచ్చు. ఇది ఆస్ట్రేలియా సిరీస్‌కూ ఎంపికయ్యేందుకు సిరాజ్‌కు సరైన మార్గం. తన శైలి బౌలింగ్‌కు ఆసీస్‌ పిచ్‌లు నప్పుతాయి కూడా. ఇన్ని అంచనాల మధ్య ఈ హైదరాబాదీ ఏం చేస్తాడో మరి?

 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top