8 నెలల తర్వాత బౌలింగ్‌.. తొలి బంతికే.!

Mathews Gets Match Winning Wicket Off His First Delivery After 8 Months - Sakshi

చెస్టర్‌ లీ స్ట్రీట్‌ : ‘ఓల్డ్‌ ఈజ్‌ గోల్డ్‌’ అని శ్రీలంక సీనియర్‌ క్రికెటర్‌ ఏంజెలో మాథ్యుస్‌ మరోసారి నిరూపించాడు. సోమవారం వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక 23 పరుగులతో విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే అప్పుడెప్పుడో బౌలింగ్‌ చేసిన మాథ్యుస్‌ సరిగ్గా 8 నెలల తర్వాత క్లిష్ట సమయంలో బంతిని అందుకొని తొలి బంతికే కీలక వికట్‌ పడగొట్టి శ్రీలంక విజయంలో కీలక పాత్ర పోషించాడు. 339 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్‌ను వికెట్‌ కీపర్‌ నికోలస్‌ పూరన్‌ (103 బంతుల్లో 118; 11 ఫోర్లు, 4 సిక్స్‌లు) అద్భుత శతకంతో గెలుపు దిశగా తీసుకెళ్లాడు. విండీస్‌ విజయానికి చివరి మూడు ఓవర్లలో 30 పరుగులు కావాల్సి ఉండగా.. క్రీజులో సెంచరీ హీరో పూరన్‌తో షెల్డాన్‌ కాట్రెల్‌లు ఉన్నారు. పూరన్‌ దూకుడు చూసి విండీస్‌ విజయం ఖాయమని భావించారు. కానీ అనూహ్యంగా బంతిని అందుకున్న మాథ్యుస్‌ తొలి బంతికే ​అతడిని పెవిలియన్‌ చేర్చాడు. ఆఫ్‌స్టంప్‌ దిశగా వేసిన బంతిని పూరన్‌ కవర్స్‌ దిశగా ఆడాలని ప్రయత్నించగా.. అది కాస్త బ్యాట్‌కు ఎడ్జై కీపర్‌ కుసాల్‌ పెరెరా చేతిలో పడింది. అంతే శ్రీలంక ఆటగాళ్లలో ఆనందం వెల్లివిరిసింది.

అయితే మ్యాచ్‌ అనంతరం ఈ వికెట్‌పై మాథ్యూస్‌ మాట్లాడుతూ సంతోషం వ్యక్తం చేశాడు. ‘ గత 8 నెలలుగా నేను బౌలింగ్‌ చేయని విషయం మీకు తెలిసిందే. ఇది నేను 8 నెలల తర్వాత వేసిన తొలి బంతి. మేం గెలవాలంటే రెండు ఓవర్లు జాగ్రత్తగా వేయాలి.  విధ్వంసకరంగా ఆడుతున్న పూరన్‌ ఉండగా స్పిన్నర్లతో వేయించలేం. ఇలాంటి క్లిష్టసమయంలో నేను మా కెప్టెన్‌ దగ్గరకు వెళ్లి.. నాకు ఇలాంటి పరిస్థితుల్లో బౌలింగ్‌ చేసిన అనుభవం ఉంది. రెండు ఓవర్లు బౌలింగ్‌ చేస్తానని చెప్పాను. దీనికి సానుకూలంగా స్పందించిన కెప్టెన్‌ నాకు అవకాశం ఇచ్చాడు’ అని మాథ్యూస్‌ చెప్పుకొచ్చాడు. ఇక రెండు ఓవర్లు వేసిన మాథ్యుస్‌ కేవలం 6 పరుగులే ఇచ్చి ఒక వికెట్‌ పడగొట్టాడు.

చదవండి : లంక విజయం

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top