‘క్రికెటర్లు మనుషులే.. ట్రోలింగ్‌ వద్దు’

Mashrafe Mortaza Has An Important Message for The Bangladesh Fans - Sakshi

బంగ్లా కెప్టెన్‌ మష్రఫె మొర్తాజా

బర్మింగ్‌హామ్‌: భారత్‌తో కీలక మ్యాచ్‌ జరుగుతున్న నేపథ్యంలో ఏ ఒక్కరు ట్రోలింగ్‌ పాల్పడవద్దని బంగ్లాదేశ్‌ కెప్టెన్‌ మష్రఫె మొర్తాజా ఆ దేశ అభిమానులకు సూచించాడు. తమ శక్తిమేర పోరాడి అన్ని విభాగాల్లో 100 శాతం రాణించి విజయం కోసం కృషి చేస్తామన్నాడు. ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా నేడు భారత్‌-బంగ్లాదేశ్‌ తలపడుతున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌ సందర్భంగా మొర్తాజా మీడియాతో మాట్లాడాడు. ‘ ఈ టోర్నీలో భారత్‌ చాలా బలంగా ఉంది. ఆ జట్టును ఓడించడం అంత తేలిక కాదు. కానీ ఆఖరి బంతి వరకు శక్తిమేర పోరాడి విజయం కోసం ప్రయత్నిస్తాం. మేం ప్రపంచకప్‌లో ఉంటామా లేదా అనేది పక్కన పెడితే ఇప్పటివరకూ ఆడిన క్రికెట్‌ కన్నా ఈ మ్యాచ్‌లో ఇంకా మెరుగ్గా రాణించాలి. ప్రపంచశ్రేణి ఆల్‌రౌండర్‌ షకీబ్‌ అల్‌ హసన్‌ ఈ టోర్నీలో అద్భుతంగా రాణిస్తున్నాడు. అతడు ఆడాల్సింది చాలా ఉంది కాబట్టి మంచి ఫలితాలే సాధిస్తాడని ఆశిస్తున్నాం.

ట్రోలింగ్‌ వద్దు..
సోషల్‌ మీడియాలో వ్యక్తిగతంగా దాడి చేస్తూ విమర్శలు గుప్పించండం సహించరానిది. ఇది ఆటగాళ్లకు చాలా కష్టంగా ఉంటుంది. వాటి నుంచి తప్పించుకోవడానికి మేం పడే కష్టాలు వర్ణాతీతం. క్రికెటర్లు కూడా మనుషులే. ఈ తరహా ట్రోలింగ్‌ ఇరు దేశాల సంబంధాలపై ప్రభావం చూపుతోంది. దయచేసి ట్రోలింగ్‌కు పాల్పడవద్దు. ఇరు జట్లు విజయం కోసం ఆరాటపడుతున్నాయి. మా అభిమానులు ఖచ్చితంగా మాకు మద్దతుగా ఉండాలి. కానీ అది ఇతరులకు ఇబ్బంది కలిగేలా ఉండకూడదు. మన దేశాన్ని తక్కువ చేసేలా మేం చేయం. ఇది మా అందరి మెదళ్లలో ఉంది. 

భారత స్పిన్‌ ద్వయం..
గత రెండు, మూడేళ్లుగా భారత స్పిన్నర్లు కుల్దీప్‌, చహల్‌ అద్భుతంగా రాణిస్తున్నారు.  ఇంగ్లండ్‌ చేతిలో ఓడినంత మాత్రాన మేం భారత్‌ను ఓడిస్తామనే ఆలోచన లేదు. మా బ్యాటింగ్ లైనప్‌ బాగుంది. సరైన ప్రణాళికలు అమలు చేసి విజయం కోసం ఆఖరి బంతివరకు పోరాడుతాం’ అని మొర్తజా తెలిపాడు. 
చదవండి: తప్పులు సరిచేసుకుంటారా?

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top