వొజ్నియాకి ఔట్‌

Maria Sharapova ends Caroline Wozniackis Australian Open defence - Sakshi

మూడో రౌండ్‌లోనే ఓడిన డిఫెండింగ్‌ చాంపియన్‌

షరపోవా సంచలనం

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌ విభాగంలో డిఫెండింగ్‌ చాంపియన్‌ కరోలైన్‌ వొజ్నియాకి కథ ముగిసింది. మాజీ విజేత షరపోవా (రష్యా) కీలకదశలో పైచేయి సాధించి వొజ్నియాకిని బోల్తా కొట్టించి ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్‌ మూడో రౌండ్‌లో మాజీ నంబర్‌వన్, 30వ సీడ్‌ షరపోవా 6–4, 4–6, 6–3తో మూడో సీడ్‌ వొజ్నియాకి (డెన్మార్క్‌)పై గెలిచింది. 2 గంటల 24 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో 2008 చాంపియన్‌ షరపోవా ఐదు ఏస్‌లు సంధించి, ఏడు డబుల్‌ ఫాల్ట్‌లు చేసింది. 46 అనవసర తప్పిదాలు చేసిన ఈ రష్యా స్టార్‌ వొజ్నియాకి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్‌ చేసి ఫలితాన్ని శాసించింది.

రెండో సీడ్‌ కెర్బర్‌ (జర్మనీ), ఐదో సీడ్‌ స్లోన్‌ స్టీఫెన్స్‌ (అమెరికా), ఎనిమిదో సీడ్‌ క్విటోవా (చెక్‌ రిపబ్లిక్‌) కూడా ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించారు. మూడో రౌండ్‌ మ్యాచ్‌ల్లో కెర్బర్‌ 6–1, 6–0తో కింబర్లీ బిరెల్‌ (ఆ స్ట్రేలియా)పై, స్లోన్‌ స్టీఫెన్స్‌ 7–6 (8/6), 7–6 (7/5)తో పెట్రా మార్టిక్‌ (క్రొయేషియా)పై, క్విటోవా 6–1, 6–4తో బెన్సిచ్‌ (స్విట్జర్లాండ్‌)పై నెగ్గారు. 11వ సీడ్‌ సబలెంకా (బెలారస్‌) 3–6, 2–6తో అనిస్‌మోవా (అమెరికా) చేతిలో... 19వ సీడ్‌ గార్సియా (ఫ్రాన్స్‌) 3–6, 2–6తో డానియెలా (అమెరికా) చేతిలో ఓడిపోయారు. 

ఫెడరర్, నాదల్‌ జోరు 
పురుషుల సింగిల్స్‌ విభాగంలో డిఫెండింగ్‌ చాంపియన్‌ ఫెడరర్‌ (స్విట్జర్లాండ్‌), మాజీ విజేత రాఫెల్‌ నాదల్‌ (స్పెయిన్‌) ప్రిక్వార్టర్‌ ఫైనల్‌కు చేరారు. మూడో రౌండ్‌లో ఫెడరర్‌ 6–2, 7–5, 6–2తో టేలర్‌ ఫ్రిట్జ్‌ (అమెరికా)పై, నాదల్‌ 6–1, 6–2, 6–4తో అలెక్స్‌ డి మినార్‌ (ఆస్ట్రేలియా)పై గెలిచారు. ఆరో సీడ్‌ మారిన్‌ సిలిచ్‌ (క్రొయేషియా) 4–6, 3–6, 6–1, 7–6 (10/8), 6–3తో ఫెర్నాండో వెర్డాస్కో (స్పెయిన్‌)పై శ్రమించి నెగ్గగా... పదో సీడ్‌ కరెన్‌ ఖచనోవ్‌ (రష్యా) 4–6, 5–7, 4–6తో బటిస్టా అగుట్‌ (స్పెయిన్‌) చేతిలో ఓడిపోయాడు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top