అసభ్యంగా ప్రవర్తించాడని క్రికెటర్‌కు జరిమానా

Marcus Stoinis Fined For Homophobic Remark During BBL Match - Sakshi

మెల్‌బోర్న్‌ : ఆస్ట్రేలియన్‌ ఆల్‌రౌండర్‌ మార్కస్‌ స్టొయినిస్‌కు క్రికెట్‌ ఆస్ట్రేలియా భారీ జరిమానా విధించింది. దేశవాలి టీ20బిగ్‌బాష్‌లీగ్‌లో మార్కస్‌ స్టొయినిస్‌ మెల్‌బోర్న్‌ స్టార్స్‌కు ఆడుతున్న సంగతి తెలిసిందే. అయితే బిగ్‌బాష్‌ లీగ్‌లో భాగంగా మెల్‌బోర్న్‌ క్రికెట్‌ గ్రౌండ్‌లో శనివారం మెల్‌బోర్న్‌ స్టార్స్‌, రినిగేడ్స్‌ మధ్య మ్యాచ్‌ జరిగింది. మ్యాచ్‌ మధ్యలో స్టొయినిస్‌  తన సహచర ఆటగాడైన కేన్‌ రిచర్డ్‌సన్‌పై అసభ్య పదజాలంతో దూషించాడు. దీంతో ఆటగాడిగా ప్రవర్తన నియమావళి ఉల్లగించినందుకు గాను కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ కింద స్టొయినిస్‌కు 7500 ఆస్ట్రేలియన్‌ డాలర్లను జరిమానాగా విధిస్తూ క్రికెట్‌ ఆస్ట్రేలియా పేర్కొంది.' నేను తప్పు చేశానని ఒప్పుకుంటున్నా. కేన్‌ రిచర్డ్‌సన్‌తో అసభ్యంగా ప్రవర్తించినం‍దుకు గ్రౌండ్‌లోనే అంపైర్ల ముందు అతనికి క్షమాపణ చెప్పాను. నేను ఎందుకలా ప్రవర్తించానో నాకు మాత్రమే తెలుసు. క్రికెట్‌ ఆస్ట్రేలియా నాకు వేసిన జరిమానాను అంగీకరిస్తున్నా' అని మార్కస్‌ స్టొయినిస్‌ స్పందించాడు. 

సరిగ్గా ఆరు వారాల క్రితం ఆస్ట్రేలియన్‌ ఫాస్ట్‌ బౌలర్‌ జేమ్స్‌ పాటిన్సన్‌ విక్టోరియా తరపున మ్యాచ్‌ ఆడుతూ ఇదే తరహాలో తీవ్ర అసభ్యపదజాలంతో దూషించడంతో క్రికెట్‌ ఆస్ట్రేలియా ఒక మ్యాచ్‌ సస్పెన్షన్‌తో పాటు భారీ జరిమానాను విధించింది. దీంతో నవంబర్‌లో పాక్‌తో జరిగిన హోమ్‌ సిరీస్‌లో పాటిన్సన్‌ మొదటి టెస్టు మ్యాచ్‌కు దూరమయ్యాడు. కాగా బిగ్‌బాష్‌ లీగ్‌లో ఈ ఏడాది స్టొయినిస్‌ అసాధారణ ఆటతీరు కనబరిచి 281 పరుగులతో లీగ్‌ టాప్‌ స్కోర్‌ర్‌లలో ఒకడిగా నిలిచినా, జనవరిలో భారత్‌తో జరగనున్న వన్డే సిరీస్‌లో మాత్రం చోటు దక్కించుకోలేకపోయాడు. మరోవైపు కేన్‌ రిచర్డ్‌సన్‌ మాత్రం ఈ సిరీస్‌కు ఎంపిక కావడం విశేషం.

2018లో ఆస్ట్రేలియా ఆటగాళ్లు బాల్‌ ట్యాంపరింగ్‌కు పాల్పడినప్పటి నుంచి క్రికెట్‌ ఆస్ట్రేలియా తప్పు చేసిన ఆటగాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటుంది. బాల్‌ ట్యాంపరింగ్‌ చేసినందుకు అప్పటి జట్టు కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌, వైస్‌ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌లు ఏడాది  , బౌలర్‌ బెన్‌క్రాప్ట్‌ 9 నెలల పాటు జట్టుకు దూరమయ్యరు.కాగా మార్కస్‌ స్టొయినిస్‌ను డిసెంబర్‌లో జరిగిన ఐపీఎల్‌ వేలంలో  రూ. 4.80 కోట్లతో ఢిల్లీ క్యాపిటల్స్‌ సొంతం చేసుకోగా, కేన్‌ రిచర్డ్‌సన్‌ను ఆర్‌సీబీ రూ. 4 కోట్లకు దక్కించుకున్న సంగతి తెలిసిందే.
(క్రికెట్‌కు పఠాన్‌ గుడ్‌బై )
(ముగిసిన ఐపీఎల్‌ వేలం)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top