‘మన్‌’జీత్‌గయా...

Manjit Singh wins gold, Jinson Johnson silver in Mens 800m - Sakshi

పురుషుల 800 మీటర్ల పరుగులో  మన్‌జీత్‌ సింగ్‌కు స్వర్ణం  

రజతం నెగ్గిన జిన్సన్‌ జాన్సన్‌

సింధు, సురేఖ మెడలో రజతాలు 

పదో రోజు భారత్‌ ఖాతాలో  మొత్తం 9 పతకాలు  

పురుషుల 800 మీటర్ల ఫైనల్‌ రేసు. భారత స్టార్‌ జిన్సన్‌ జాన్సన్‌ కచ్చితంగా పతకం సాధిస్తాడని అంచనాలు ఉన్నాయి. అందుకు తగినట్లుగానే రేసు సాగింది. కానీ ఎక్కడో దూరంగా ఉన్న మరో భారత అథ్లెట్‌ మన్‌జీత్‌ సింగ్‌ అనూహ్యంగా దూసుకొచ్చాడు. ఒక్కొక్కరినీ వెనక్కి తోసి పరుగెడుతూ చివరకు అగ్రస్థానంలో నిలిచి పసిడిని అందుకున్నాడు. అతని వెనకే జాన్సన్‌ నిలవడంతో ఒకే ఈవెంట్‌లో స్వర్ణ, రజతాలు భారత్‌ ఖాతాలో చేరాయి. మరోసారి ఫైనల్లో తడబడిన తెలుగు తేజం పీవీ సింధు బ్యాడ్మింటన్‌ తుది పోరులో ఓడి రజతంతో సరి పెట్టుకోగా... మరో తెలుగమ్మాయి జ్యోతి సురేఖ సభ్యురాలిగా ఉన్న ఆర్చరీ జట్టు రజతంతో మురిసింది. టీటీలో తొలి కాంస్యంతో చరిత్ర సృష్టించగా... ఎవరూ పెద్దగా దృష్టి పెట్టని ‘కురాష్‌’లో రెండు మెడల్స్‌ రావడంతో పదో రోజు ముగిసేసరికి ఆసియా క్రీడల్లో భారత్‌ మొత్తం 50 పతకాలతో 8వ స్థానంలో నిలిచింది.

జకార్తా: అంచనాలను నిజం చేస్తూ ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్ల జోరు మరో రోజు కొనసాగింది. మంగళవారం కూడా అథ్లెటిక్స్‌ నుంచే భారత్‌ ఖాతాలో స్వర్ణ పతకం చేరింది. పురుషుల 800 మీటర్ల పరుగులో మన్‌జీత్‌ సింగ్‌ అగ్రస్థానంలో నిలిచి పసిడి సొంతం చేసుకున్నాడు. 1 నిమిషం 46.15 సెకన్లలో అతను రేసు పూర్తి చేశాడు. భారత్‌కే చెందిన జిన్సన్‌ జాన్సన్‌ (1ని. 46.35 సెకన్లు) రెండో స్థానంలో నిలిచి రజతం సాధించాడు. అబూ బకర్‌ (ఖతర్‌–1ని. 46.38 సెకన్లు) కాంస్యం అందుకున్నాడు. మన్‌జీత్‌ అగ్రస్థానం స్పష్టంగా ఖరారు కాగా, ఇతర పతక విజేతలను ఫొటోఫినిష్‌ ద్వారా తేల్చారు. 1982 ఢిల్లీ ఆసియా క్రీడల్లో ఛార్లెస్‌ స్వర్ణం గెలుచుకున్న తర్వాత 800 మీటర్ల పరుగులో భారత్‌కు ఇదే తొలి పసిడి కావడం విశేషం. ఇదే జకార్తాలో జరిగిన 1962 ఏషియాడ్‌లో దల్జీత్, అమ్రిత్‌ పాల్‌ రజత, కాంస్యాలు సాధించిన తర్వాత 800 మీటర్ల పరుగులో ఇద్దరు భారత అథ్లెట్లు పతకాలు నెగ్గడం కూడా ఇదే మొదటిసారి.  

మిక్స్‌డ్‌ రిలేలోనూ రజతం 
తొలిసారి ప్రవేశపెట్టిన 4గీ400 మిక్స్‌డ్‌ రిలే ఈవెంట్‌లో కూడా భారత జట్టు రజత పతకం గెలుచుకుంది. 3 నిమిషాల 15.71 సెకన్లలో భారత్‌ రేసును పూర్తి చేసి రెండో స్థానంలో నిలిచింది. ఈ టీమ్‌లో మొహమ్మద్‌ అనస్‌ యహియా, పూవమ్మ, హిమ దాస్, అరోకియా రాజీవ్‌ సభ్యులుగా ఉన్నారు. తొలి లెగ్‌లో అనస్‌ అద్భుతంగా పరుగెత్తి ముందంజలో నిలవగా, పూవమ్మ దానిని కొనసాగించింది. అయితే మూడో లెగ్‌లో ప్రత్యర్థితో పోలిస్తే హిమ దాస్‌ బాగా నెమ్మదించిపోయింది. బహ్రెయిన్‌ అథ్లెట్‌ అడెకోయా తన సహచరి సల్వా నాసర్‌కు బ్యాటన్‌ అందిస్తూ ట్రాక్‌పై పడిపోవడంతో ఆమెను తప్పించుకుంటూ తనను తాను నియంత్రించుకునే క్రమంలో హిమ దాస్‌ వేగం తగ్గించాల్సి వచ్చింది. చివరి లెగ్‌లో రాజీవ్‌ తీవ్రంగా శ్రమించినా ఫలితం దక్కలేదు. దాంతో భారత బృందం రజతంతోనే సంతృప్తి చెందాల్సి వచ్చింది. ఈ ఈవెంట్‌లో బహ్రెయిన్‌ (3 ని. 11.89 సెకన్లు) స్వర్ణం... కజకిస్తాన్‌ (3 ని. 19.52 సెకన్లు) కాంస్యం సాధించాయి.   

‘కురాష్‌’లో రెండు పతకాలు... 
ఆసియా క్రీడల్లో తొలిసారి ప్రవేశ పెట్టిన కురాష్‌ (రెజ్లింగ్‌ తరహా క్రీడ)లో భారత క్రీడాకారిణులు పింకీ బల్హారా, మాలప్రభ (52 కేజీలు) రజతం, కాంస్యం గెలిచారు. ఫైనల్లో పింకీ 0–10తో గుల్నార్‌ (ఉజ్బెకిస్తాన్‌) చేతిలో... సెమీఫైనల్లో మాలప్రభ 0–10తో గుల్నార్‌ (ఉజ్బెకిస్తాన్‌) చేతిలోనే ఓడింది. 

కన్నబిడ్డను చూసుకోకుండా... 
రెండేళ్ల క్రితమే మన్‌జీత్‌ కెరీర్‌ దాదాపు ముగింపు దశకు వచ్చేసింది. అప్పటికి అతని వయసు 27 ఏళ్లు కాగా... ‘ఇప్పటి వరకు నువ్వు చెప్పుకోదగ్గ ప్రదర్శన ఇవ్వలేదు. ఇంకా మెరుగుపర్చుకునే వయసు కూడా నీది కాదు’ అంటూ ఓఎన్‌జీసీ చిన్న కాంట్రాక్ట్‌ ఉద్యోగం నుంచి కూడా అతడిని తొలగించింది. డబ్బుల కోసం ఇంకా తల్లిదండ్రులపై ఆధారపడే పరిస్థితి. అతనిపై ఎవరికీ నమ్మకం లేకపోగా తనకు కూడా ఎలాంటి ఆశలు లేవు. కెరీర్‌లో ఎప్పుడూ ఒక్క అంతర్జాతీయ పతకం కూడా గెలవని మన్‌జీత్‌ జాతీయ స్థాయిలో ఆఖరి సారిగా 2013లో పతకం సాధించాడు. ఇలాంటి సమయంలో ఆర్మీ కోచ్‌ అమ్రిష్‌ కుమార్‌ మాత్రమే అండగా నిలిచారు. అప్పటి వరకు ఫలితాలు బాగా లేకపోయినా మన్‌జీత్‌లో ప్రతిభ ఉందని గుర్తించిన అమ్రిష్‌ ‘నీ జీవితంలో ఎలాంటి బాధ్యతలు లేకుండా రెండేళ్లు నాకు ఇస్తే ఆసియా క్రీడల్లో పతకం సాధించేలా చేస్తాను’ అని ప్రోత్సహించారు. అంతే... కోచ్‌కు మాట ఇచ్చి రెండేళ్లు అతను తీవ్రంగా కష్టపడ్డాడు. నెలకు 30 వేల సొంత ఖర్చుతో ఆర్మీ క్యాంప్‌లో శిక్షణ పొందాడు. అయినా సరే ఆసియా చాంపియన్‌షిప్, 2018 కామన్వెల్త్‌ క్రీడలకు కూడా అర్హత  సాధించలేకపోయాడు. కానీ మన్‌జీత్‌ పట్టు వదల్లేదు. మంగళవారం పోరుకు కూడా క్వాలిఫయింగ్‌ చివరి స్థానంలో నిలిచి అర్హత సాధించిన అతను ఏకంగా స్వర్ణం కొట్టేశాడు. మార్చి 6న అతనికి కొడుకు పుట్టాడు. కానీ ట్రైనింగ్‌లో ఉన్న మన్‌జీత్‌ ఇప్పటి వరకు తన బిడ్డను చూడలేదు. ‘ఇప్పుడు నా కొడుకును కలుస్తాను. నా స్వర్ణాన్ని చూపించి అతని తండ్రి ఏం సాధించాడో చెబుతాను’ అంటూ మన్‌జీత్‌ భావోద్వేగంతో చెప్పాడు!   

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top