
హర్దిక్ పాండ్యా
ముంబై : టీమిండియా ఆల్‌రౌండర్, ముంబై ఇండియన్స్ ఆటగాడు హర్దిక్ పాండ్యా చాలా కష్టపడాలని ఆ జట్టు కోచ్ మహేళ జవవర్దనే అభిప్రాయపడ్డాడు. మంగళవారం సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో స్పల్ప స్కోరును చేధించలేక ముంబై 31 పరుగుల తేడాతో పరాజయం పొందిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ అనంతరం ఓటమిపై జయవర్దనే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు.
ఏ ఒక్క ఆటగాడు బాధ్యత తీసుకోలేదు..
‘ఈ పరాజయంపై ఎవరిని నిందించదలుచుకోలేదు. కానీ ఈ ఓటమి తీవ్రంగా నిరాశపరిచింది. మేం కొన్ని మ్యాచ్‌లు ఓడినా.. మంచి క్రికెట్ ఆడుతున్నామనే భావన కలిగింది. కానీ స్పల్ఫ స్కోరు చేధనకు దిగిన మా బ్యాట్స్‌మన్‌లో ఏ ఒక్కరు బాధ్యతాయుతంగా ఆడకపోవడం నిరాశ కలిగించింది. 10 ఓవర్ల అనంతరం ఎవరైనా బాధ్యత తీసుకుంటారని భావించా కానీ అలా ఎవరు చేయలేదు.
ఇక పాండ్యా బ్యాటింగ్‌పై స్పందిస్తూ.. అతని పట్ల ప్రత్యర్థి ఆటగాళ్లు మంచి ప్రణాళికలతో బరిలోకి దిగారని, అతను చాలా కష్టపడాలని, ఇలా అయితే కష్టమని తెలిపాడు. ‘‘ ప్రతి ఏడాది ఒకే శైలిలో బ్యాటింగ్ చేయకూడదు. ఆటలో మెరుగుదల లేకుంటే రాణించడం కష్టం. ఈ విషయాన్ని పాండ్యా నేర్చుకోవాలి. అతను ఇంకా చాలా కష్టపడాలి. కేవలం నైపుణ్యంతో విజయం అందుకోలేం. పరిస్థితులకు తగ్గట్టు ఆడే సామర్థ్యం ఉండాలి. ప్రతి ఆటగాడు ఈ విషయాలను గ్రహించాలి. ఎందుకంటే ఈ టోర్నీకి అంతర్జాతీయ బౌలర్లు వినూత్న పద్దతులతో వస్తారు. వారని సమర్థవంతంగా ఎదుర్కునేలా సిద్ధం కావాలి. అలా లేనప్పుడు స్థిరంగా రాణించలేం’’ అని జయవర్ధనే అభిప్రాయపడ్డాడు. ఇక ఈ మ్యాచ్‌లో పాండ్యా 19 బంతులాడి కేవలం 3 పరుగులే చేశాడు. ముఖ్యంగా రషీద్ బౌలింగ్‌లో తెగ ఇబ్బందిపడ్డాడు.