ఆధారాల్లేవ్‌

Mahela Jayawardene Attended For Investigation Of 2011 World Cup Final Fixing Allegations - Sakshi

2011 ప్రపంచ కప్‌ ఫైనల్‌ ‘ఫిక్స్‌’ ఆరోపణలపై విచారణ నిలిపేసిన శ్రీలంక పోలీసులు

తీవ్ర విమర్శలతో వెనక్కి తగ్గిన ప్రభుత్వం 

కొలంబో: ఒక రాజకీయ నాయకుడి ఆరోపణలను ప్రామాణికంగా తీసుకొని మ్యాచ్‌ ఫిక్సింగ్‌పై విచారణ పేరుతో తమ దిగ్గజ క్రీడాకారులను అవమానిస్తున్నారంటూ దేశంలో తీవ్ర విమర్శలు రావడంతో శ్రీలంక ప్రభుత్వం వెనక్కి తగ్గింది. 2011 వన్డే ప్రపంచ కప్‌ ఫైనల్లో లంక పరాజయంపై ఇప్పటి వరకు జరిపిన దర్యాప్తును నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఆరోపణలకు సంబంధించి ఎలాంటి కనీస ఆధారాలు లేవని, ఇకపై ఎలాంటి విచారణ ఉండబోదని లంక పోలీసులు స్పష్టం చేశారు. మాజీ కెప్టెన్లు కుమార సంగక్కర, మహేలా జయవర్ధనేల వాంగ్మూలాలు తీసుకున్న తర్వాత ఇక సందేహించేందుకు ఎలాంటి అవకాశం కనిపించలేదని వారు వెల్లడించారు. భారత్‌ గెలిచిన నాటి ఫైనల్‌ను కొందరు ఫిక్స్‌ చేశారంటూ అప్పటి క్రీడా మంత్రి మహిదానంద అలుత్‌గమగే ఆరోపించారు. ఆ వెంటనే ప్రభుత్వం దీనిపై విచారించమంటూ స్పెషల్‌ ఇన్వెస్టిగేటివ్‌ డివిజన్‌ను ఆదేశించింది.

‘మహిదానంద చేసిన 14 ఆరోపణల్లో ఒక్కదానికీ కనీస ఆధారం లేదు. మున్ముందు ఆటగాళ్లను ప్రశ్నించాల్సిన అవసరమూ రాదు. మా అంతర్గత చర్చల తర్వాత విచారణను ముగించాలని నిర్ణయించుకున్నాం. మా నివేదికను కేంద్ర క్రీడా శాఖ కార్యదర్శికి పంపిస్తాం’ అని దర్యాప్తు అధికారి జగత్‌ ఫొన్సెకా స్పష్టం చేశారు. నాటి చీఫ్‌ సెలక్టర్‌ అరవింద డిసిల్వాతో పాటు కెప్టెన్‌ సంగక్కర, సీనియర్‌ బ్యాట్స్‌మన్‌ జయవర్ధనే, ఓపెనర్‌ తరంగలను పోలీసులు విచారించారు. ఫైనల్‌ మ్యాచ్‌ చివరి నిమిషంలో తుది జట్టులో నలుగురు ఆటగాళ్లను మార్చడంపై సందేహాలున్నాయని మహిదానంద ఆరోపించారు. ‘దీనిపై కూడా స్పష్టమైన వివరణ లభించింది. కాబట్టి జట్టులోని మిగతా ఆటగాళ్లను విచారించడం కూడా అనవసరమని భావించాం’ అని ఫొన్సెకా చెప్పారు. ఫైనల్‌ జరిగిన తొమ్మిదేళ్ల తర్వాత ఇలా వ్యవహరించడంపై తొలి రోజునుంచే పలువురు క్రికెట్‌ అభిమానులు దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శించారు.

మాకూ అనుమానాల్లేవు... 
2011 వన్డే వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ ఫలితంపై తమకు ఎలాంటి సందేహాలు లేవని అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) అవినీతి నిరోధక విభాగం (ఏసీయూ) కూడా స్పష్టం చేసింది.  మ్యాచ్‌ జరిగిన తీరును అనుమానించాల్సిన అవసరమే లేదని ఐసీసీ ఏసీయూ జనరల్‌ మేనేజర్‌ అలెక్స్‌ మార్షల్‌ చెప్పారు. ‘ఈ మ్యాచ్‌ గురించి ఇటీవల వచ్చిన ఆరోపణలపై మేం కూడా దృష్టి పెట్టాం. కొత్తగా విచారణ జరిపేందుకు కావాల్సిన అంశాలు కూడా ఏమీ లేవు’ అని ఆయన పేర్కొన్నారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top