అర నిమిషంలో అద్భుతం 

 Late Goal, New Life: Germany Claws Its Way Back Into the World Cup - Sakshi

కీలక పోరులో జర్మనీ సంచలన విజయం 

గెలిపించిన టోనీ క్రూస్‌ గోల్‌ 

2–1తో స్వీడన్‌కు అనూహ్య ఓటమి

డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగి తొలి మ్యాచ్‌లో ఎదురైన అనూహ్య పరాజయం వెంటాడుతుండగా జర్మనీ బరిలోకి దిగింది. అటు వైపు ప్రత్యర్థి స్వీడన్‌ను చూస్తే గత ఆరు ప్రపంచ కప్‌లలో గ్రూప్‌ దశలో ఒక్క మ్యాచ్‌ కూడా ఓడిపోలేదు. ‘డ్రా’ కూడా ఒకరకంగా ఓటమితో సమానమనేది జర్మనీ పరిస్థితి... చివరి 8 నిమిషాల్లో 10 మంది ఆటగాళ్లతోనే మైదానంలో పోరాడాల్సి వచ్చింది. నిర్ణీత సమయం దాటి ఇంజ్యూరీ సమయం కూడా ముగింపు దశకు రావడంతో ఇక గెలుపు ఆశలు వదులుకున్న వేళ అద్భుతం జరిగింది. ఆట ఆగిపోవడమే తరువాయి అనుకుంటున్న క్షణాన 94 నిమిషాల 39వ సెకన్లో జర్మనీ గోల్‌తో అనూహ్యం చేసి చూపించింది. స్వీడన్‌ ఆటగాళ్లు జీవిత కాలం తేరుకోలేని విధంగా షాక్‌ ఇచ్చి తమ ఆశలను సజీవంగా నిలబెట్టుకుంది. తప్పుడు పాస్‌తో స్వీడన్‌ తొలి గోల్‌ చేయడానికి కారకుడై విలన్‌లా కనిపించిన టోనీ క్రూస్‌... ఆఖరి నిమిషంలో గోల్‌ చేసి ఒక్కసారిగా హీరోగా మారిపోయాడు.    

సోచీ: ప్రపంచకప్‌ చరిత్రలో తొలిసారి గ్రూప్‌ దశ నుంచే నిష్క్రమించే అవమానం నుంచి జర్మనీ తప్పించుకుంది. మ్యాచ్‌ ‘డ్రా’గా ముగిసినా అవకాశాలు సంక్లిష్టంగా మారిపోయే మ్యాచ్‌లో అద్భుత ఆటతో గట్టెక్కింది. శనివారం రాత్రి ఇక్కడి ఫిష్త్‌ స్టేడియంలో జరిగిన గ్రూప్‌ ‘ఎఫ్‌’ మ్యాచ్‌లో జర్మనీ 2–1 గోల్స్‌ తేడాతో స్వీడన్‌ను ఓడించింది. ముందుగా స్వీడన్‌ తరఫున ఒలా టొయివొనెన్‌ (32వ నిమిషంలో) గోల్‌ సాధించి స్వీడన్‌కు ఆధిక్యం అందించాడు. ఆ తర్వాత మార్కోస్‌ ర్యూస్‌ (48వ నిమిషంలో) చక్కటి గోల్‌తో సమం చేశాడు. చివర్లో టోనీ క్రూస్‌ (90+5వ నిమిషం) చేసిన గోల్‌తో జర్మనీ విజేతగా నిలిచింది. తాజా ఫలితంతో ఈ గ్రూప్‌ నుంచి ముందుకు వెళ్లే జట్లేవో ఇంకా తేలలేదు. బుధవారం జరిగే చివరి రౌండ్‌ మ్యాచ్‌లలో కొరియాతో జర్మనీ, మెక్సికోతో స్వీడన్‌ తలపడతాయి.  

స్వీడన్‌ జోరు... 
తొలి పోరులో మెక్సికో చేతిలో అనూహ్య పరాజయం తర్వాత జర్మనీ తమ జట్టును, వ్యూహాలను భారీగా మార్చుకొని బరిలోకి దిగింది. ఈ క్రమంలో తమ సీనియర్‌ ఆటగాడు ఒజిల్‌ను కూడా అనూహ్యంగా తుది జట్టు నుంచి పక్కన పెట్టింది. 2010 ప్రపంచ కప్‌ తర్వాత ఒక ప్రధాన అంతర్జాతీయ టోర్నీ మ్యాచ్‌లో ఒజిల్‌ ఆడకపోవడం ఇదే మొదటిసారి. అయితే కొత్త మార్పులు ఒక్కసారిగా జట్టుకు ఉపయోగపడలేదు. ఆరంభంలో చక్కటి డిఫెన్స్‌తో జర్మనీని నిలువరించిన స్వీడన్‌కు 24వ నిమిషంలో గోల్‌ అవకాశం లభించింది. మార్కస్‌ బెర్గ్‌ దాదాపు గోల్‌ చేసినంత పని చేసినా... మాన్యూల్‌ న్యూర్‌ నిలువరించాడు. అయితే ఈ క్రమంలో బెర్గ్‌ను జర్మనీ ఆటగాడు బోటెంగ్‌ అడ్డుకున్నా, రిఫరీ పెనాల్టీ మాత్రం ఇవ్వలేదు. గత మ్యాచ్‌లో కౌంటర్‌ అటాక్‌తో జర్మనీపై మెక్సికో ఫలితం సాధించగా, ఈసారి స్వీడన్‌ అదే చేసింది. కొద్ది సేపటికే ఆ జట్టు గోల్‌తో ఖాతా తెరిచింది. బంతిపై పట్టు కోల్పోయిన క్రూస్‌ ప్రత్యర్థి జట్టు వైపు పాస్‌ పంపించాడు. దీనిని అందుకున్న స్వీడన్‌ ఆటగాడు విక్టర్‌ క్లాసెన్‌ తన సహచరుడు టొయివోనెన్‌కు పాస్‌ చేయగా చక్కటి నియంత్రణతో గోల్‌ కొట్టడంతో జర్మనీ విస్తుపోయింది. తొలి అర్ధ భాగం ముగిసేసరికి బంతి చాలా వరకు జర్మనీ ఆధీనంలోనే ఉన్నా, గోల్‌ మాత్రం ప్రత్యర్థికే దక్కింది.  

కలిసొచ్చిన అదృష్టం... 
రెండో అర్ధభాగంలో డ్రాక్స్‌లర్‌ స్థానంలో మారియో గోమెజ్‌ మైదానంలోకి వచ్చాడు. మూడు నిమిషాలకే ఈ వ్యూహం ఫలితాన్నిచ్చింది. టిమో వార్నర్‌ ఇచ్చిన ‘లో క్రాస్‌ పాస్‌’ను గోమెజ్‌ అందుకొని ముందుకు పంపగా, అంతే వేగంగా గోల్‌ పోస్ట్‌ దగ్గరకు దూసుకొచ్చిన సహచరుడు ర్యూస్‌ గోల్‌గా మలచి జర్మనీకి ప్రాణం పోశాడు. స్కోరు సమమైన తర్వాత ఆధిక్యం అందుకునేందుకు జర్మనీకి అనేక అవకాశాలు వచ్చాయి. ముఖ్యంగా గోమెజ్‌ రెండు సార్లు, బ్రాండిట్‌ ఒకసారి గోల్‌ చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించినా స్వీడన్‌ సమర్థంగా అడ్డుకోగలిగింది. 82వ నిమిషంలో బోటెంగ్‌ రెడ్‌ కార్డుకు గురై మైదానం నుంచి నిష్క్రమించాడు. దాంతో జర్మనీ పది మందితోనే ఆట కొనసాగించగా, చివరి నిమిషాల్లో మరింత డ్రామా సాగింది. క్రూస్‌ ఇచ్చిన చక్కటి క్రాస్‌ను హెడర్‌తో గోమెజ్‌ గోల్‌ కొట్టే ప్రయత్నం చేసినా కీపర్‌ ఒల్సన్‌ దానిని చక్కగా ఆపగలిగాడు. ఇంజ్యూరీ టైమ్‌లో ఇక 21 సెకన్లే మిగిలాయి. ‘డ్రా’ కావడం ఖాయమనిపించింది. ఈ దశలో పెనాల్టీ ఏరియా మూల నుంచి ర్యూస్‌ సహకారంతో క్రూస్‌ అద్భుతంగా కొట్టిన ఫ్రీ కిక్‌ కీపర్‌ను దాటి వెళ్లడంతో జర్మనీ పిచ్చెక్కినట్లు సంబరాలు చేసుకోగా, స్వీడన్‌ నిర్ఘాంతపోయింది.  

మైదానం బయట గొడవ! 
చివరి క్షణాల వరకు మ్యాచ్‌ను అదుపులో ఉంచుకొని అనూహ్యంగా ఓటమిపాలు కావడం స్వీడన్‌ కోచ్‌ జేన్‌ అండర్సన్‌కు ఆవేదన కలిగించింది. మ్యాచ్‌ తర్వాత జర్మనీ జట్టు సహాయక సిబ్బందితో అతనికి తీవ్ర వాగ్వాదం జరిగింది. అసలే పరాజయ బాధలో ఉన్న తమను వారు రెచ్చగొట్టారని అతను వ్యాఖ్యానించాడు. ‘జర్మనీ జట్టుకు సంబంధించినవారు (బిజినెస్‌ మేనేజర్‌ తదితరులు) మా మొహాల మీదకు దూసుకొచ్చి సంబరాలు చేసుకున్నారు. మేమూ 90 నిమిషాలు అద్భుతంగా ఆడాం. ఒకసారి ఆఖరి విజిల్‌ మోగితే చేతులు కలపడమే ఉంటుంది కానీ ఇలా చేస్తారా. మమ్మల్ని అగౌరవపర్చడం ఆగ్రహం కలిగించింది. మాకు పెనాల్టీ ఇచ్చే విషయంలో వీడియో అసిస్టెంట్‌ రిఫరీ కలగజేసుకోకపోవడం దురదృష్టకరం. కానీ ఇప్పుడు ఏమీ చేయలేం’ అని అండర్సన్‌ అన్నాడు.  

94 నిమిషాల 39 సెకన్లు... 
ప్రపంచ కప్‌ చరిత్రలో నిర్ణీత సమయంలోపు ముగిసిన మ్యాచ్‌లో ఇంతకంటే చివరి క్షణాల్లో విజయానికి కారణమైన గోల్‌ నమోదు కాలేదు. గతంలో ఫ్రాన్సెస్కో తొట్టి (ఇటలీ) 94ని. 26 సెకన్ల సమయంలో ఆస్ట్రేలియాపై (2006లో) గోల్‌ నమోదు చేశాడు.   

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top