ఉతప్ప ‘మోత' | Kolkata Knight Riders beat Mumbai Indians by 6 wickets | Sakshi
Sakshi News home page

ఉతప్ప ‘మోత'

May 15 2014 1:03 AM | Updated on Sep 2 2017 7:21 AM

ఉతప్ప ‘మోత'

ఉతప్ప ‘మోత'

ఐపీఎల్-7లో కాస్త ఆలస్యంగా కోలుకున్నా... కోల్‌కతా హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసి ప్లే ఆఫ్ అవకాశాలను మెరుగుపరుచుకుంది.

కోల్‌కతా విజయాల హ్యాట్రిక్  
 ముంబైపై 6 వికెట్ల తేడాతో గెలుపు
 ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం  
 రోహిత్‌సేనకు సంక్లిష్టం
 
 వారం రోజుల్లోనే ఎంత తేడా..! వరుస ఓటములతో, బ్యాటింగ్ సమస్యలతో అల్లాడిన జట్టు ఇదేనా..! ఇప్పుడు కోల్‌కతాను చూస్తే ఇదే అనిపిస్తోంది. ముఖ్యంగా ఉతప్ప.... వరుసగా మూడో మ్యాచ్‌లోనూ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి కోల్‌కతాను గెలిపించాడు. గంభీర్ సేనకు ఇది హ్యాట్రిక్ విజయం కావడం విశేషం.
 
 కటక్: ఐపీఎల్-7లో కాస్త ఆలస్యంగా కోలుకున్నా... కోల్‌కతా హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసి ప్లే ఆఫ్ అవకాశాలను మెరుగుపరుచుకుంది. బుధవారం ఇక్కడి బారాబతి స్టేడియంలో జరిగిన కీలక మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ముంబై బ్యాట్స్‌మెన్‌కు ముకుతాడు వేస్తే.. ఆపై ఉతప్ప (52 బంతుల్లో 80; 9 ఫోర్లు, 3 సిక్స్‌లు) అద్భుత ఇన్నింగ్స్ ఆడడంతో లక్ష్యాన్ని కోల్‌కతా అలవోకగా ఛేదించింది. టాస్ కోల్పోయి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది.
 
 రోహిత్ శర్మ (45 బంతుల్లో 51; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), రాయుడు (27 బంతుల్లో 33; 3 ఫోర్లు, 1 సిక్స్) మాత్రమే రాణించారు. అనంతరం కోల్‌కతా 4 వికెట్లు కోల్పోయి మరో 8 బంతులు మిగిలి ఉండగానే విజయాన్నందుకుంది. ఉతప్పకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఈ ఓటమితో ముంబై ప్లే ఆఫ్ అవకాశాలను మరింత సంక్లిష్టం చేసుకుంది.
 
 ముంబై నత్త నడక..
 స్లో పిచ్‌పై నత్త నడకన ఇన్నింగ్స్ ప్రారంభించిన ముంబైకి పవర్ ప్లే ముగిసేటప్పటికే రెండు ఎదురుదెబ్బలు తగిలాయి. గౌతమ్ (8)ను మోర్నీ మోర్కెల్, సిమ్మన్స్ (12)ను షకీబ్ అవుట్ చేశారు. దీంతో ఆరు ఓవర్లలో ముంబై 37 పరుగులు మాత్రమే చేయగలిగింది.
 
  ఆ తరువాత రోహిత్‌తో కలిసి మూడో వికెట్‌కు 35 పరుగులు జోడించాక రాయుడు కూడా వెనుదిరిగాడు. కోరీ అండర్సన్ క్రీజులోకి వస్తూనే ఓ సిక్స్, ఫోర్‌తో ఎదురుదాడికి దిగి ఇన్నింగ్స్‌కు ఊపు తెచ్చాడు. మోర్కెల్ వేసిన 16వ ఓవర్లో రోహిత్ రెండు భారీసిక్స్‌లు బాదినా.. అదే ఓవర్లో అండర్సన్ (18) ఔటయ్యాడు. రోహిత్‌కు పొలార్డ్ జత కలిసినా.. చివరి ఐదు ఓవర్లలో ముంబై 42 పరుగులు మాత్రమే చేయగలిగింది.
 
 ఉతప్ప నిలకడ..
 లక్ష్యఛేదనలో కోల్‌కతాకు గంభీర్-ఉతప్ప మరోసారి శుభారంభాన్నిచ్చారు. తొలి వికెట్‌కు 50 పరుగులు జోడించారు. ఆ తరువాత మనీష్ పాండేతో కలిసి ఛేజింగ్ కొనసాగించాడు. ఈ క్రమంలో పాండే (14), లక్ష్యానికి 26 పరుగుల దూరంలో ఉతప్ప అవుటయ్యాడు. విజయం ముంగిట షకీబ్ (9) కూడా అవుటైనా..యూసుఫ్ పఠాన్ (13 బంతుల్లో 20 నాటౌట్; 3 ఫోర్లు) కోల్‌కతాను గమ్యానికి చేర్చాడు.
 
 స్కోరు వివరాలు:
 ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: సిమ్మన్స్ (బి) షకీబ్ 12, గౌతమ్ (సి) సూర్యకుమార్ (బి) మోర్నీ మోర్కెల్ 8, రాయుడు (సి) సూర్యకుమార్ (బి) చావ్లా 33, రోహిత్ (బి) నరైన్ 51, అండర్సన్ (సి) చావ్లా (బి) మోర్కెల్ 18, పొలార్డ్ (నాటౌట్) 10, తారే (నాటౌట్) 2, ఎక్స్‌ట్రాలు 7, మొత్తం: (20 ఓవర్లలో 5 వికెట్లకు) 141.
 
 వికెట్ల పతనం: 1-12, 2-35, 3-70, 4-115, 5-138.
 బౌలింగ్: మోర్నీ మోర్కెల్ 4-0-35-2, ఉమేశ్ యాదవ్ 3-0-24-0, షకీబ్ 4-0-21-1, నరైన్ 4-0-18-1, చావ్లా 4-0-32-1, యూసుఫ్ పఠాన్ 1-0-10-0.
 కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: ఉతప్ప (బి) సిమ్మన్స్ 80, గంభీర్ (బి) హర్భజన్ 14, మనీష్ పాండే (బి) హర్భజన్ 14, యూసుఫ్ పఠాన్ (నాటౌట్) 20, షకీబ్ అల్ హసన్ (సి) రాయుడు (బి) మలింగ 9, టెన్ డెస్కాటె (నాటౌట్) 0, ఎక్స్‌ట్రాలు 5, మొత్తం: (18.4 ఓవర్లలో 4 వికెట్లకు) 142.
 
 వికెట్ల పతనం: 1-50, 2-96, 3-116, 4-138.
 బౌలింగ్: మలింగ 3.4-0-30-1, బుమ్రాహ్ 3-0-23-0, హర్భజన్ 4-0-22-2, ఓజా 4-0-25-0, సిమ్మన్స్ 3-0-34-1, పొలార్డ్ 1-0-7-0.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement