శ్రీకాంత్ సంచలనం | Kidambi Srikanth stuns World No. 10 Tien Minh Nguyen in | Sakshi
Sakshi News home page

శ్రీకాంత్ సంచలనం

Apr 11 2014 12:14 AM | Updated on Jun 2 2018 2:30 PM

శ్రీకాంత్ సంచలనం - Sakshi

శ్రీకాంత్ సంచలనం

ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ యువతార కిదాంబి శ్రీకాంత్... సింగపూర్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీలో సంచలనం సృష్టించాడు.

ప్రపంచ పదో ర్యాంకర్ నగుయాన్‌పై గెలుపు
క్వార్టర్స్‌లో సింధు, సాయిప్రణీత్   సింగపూర్ ఓపెన్


 
 సింగపూర్: ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ యువతార కిదాంబి శ్రీకాంత్... సింగపూర్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీలో సంచలనం సృష్టించాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో అతను 18-21, 21-15, 21-8తో ప్రపంచ పదో ర్యాంకర్, ఏడోసీడ్ తియాన్ మిన్హ్ నగుయాన్ (వియత్నాం)పై విజయం సాధించాడు. తద్వారా క్వార్టర్‌ఫైనల్లోకి దూసుకెళ్లాడు. 58 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఏపీ కుర్రాడు పోరాట పటిమను ప్రదర్శించాడు. తొలి గేమ్‌లో 6-14తో వెనుకబడ్డా మెరుగైన ఆటతో 16-16తో స్కోరును సమం చేశాడు. అయితే స్కోరు 18-18 ఉన్న దశలో వియత్నాం ప్లేయర్ వరుసగా మూడు పాయింట్లు గెలిచి గేమ్‌ను సాధించాడు.


 రెండో గేమ్‌లో 8-5తో దూకుడు మీదున్న శ్రీకాంత్‌ను నగుయాన్ కాసేపు అడ్డుకున్నాడు. కానీ నెట్ వద్ద అప్రమత్తంగా వ్యవహరించిన శ్రీ వరుస పాయింట్లతో హోరెత్తించాడు. నిర్ణయాత్మక మూడో గేమ్‌లో మాత్రం హైదరాబాద్ అబ్బాయి హవా కొనసాగింది. ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా 11-3, 16-6తో స్పష్టమైన ఆధిక్యంలో నిలిచాడు. తర్వాత వరుసగా ఐదు పాయింట్లు నెగ్గి మ్యాచ్‌ను ముగించాడు. ఇతర మ్యాచ్‌ల్లో భమిడిపాటి సాయిప్రణీత్ 24-22, 21-19తో జి లియాంగ్ డెరెక్ వాంగ్ (సింగపూర్)పై నెగ్గగా; హెచ్.ఎస్. ప్రణయ్ 17-21, 21-18, 12-21తో ఐదోసీడ్ పెంగ్యూ డూ (చైనా) చేతిలో ఓటమిపాలయ్యాడు.

 సత్తా చాటిన సింధు
 మహిళల సింగిల్స్‌లో ఏపీ అమ్మాయి ఎనిమిదోసీడ్ పి.వి.సింధు 21-17, 17-21, 21-16 ప్రపంచ 123వ ర్యాంకర్ షిజుకా ఉచెద(జపాన్)పై నెగ్గింది. ఈ మ్యాచ్ గంటా 3 నిమిషాల పాటు జరిగింది. ప్రత్యర్థి నుంచి ప్రతిఘటన ఎదురుకావడంతో సింధు రెండో గేమ్‌ను చేజార్చుకుంది. అయితే కీలకమైన మూడో గేమ్ ఓ దశలో హైదరాబాదీ 15-11 ఆధిక్యాన్ని సంపాదించింది.

కానీ జపాన్ అమ్మాయి ధాటిగా ఆడుతూ ఆధిక్యాన్ని 16-18కి తగ్గించింది. ఈ దశలో భిన్నమైన షాట్లతో అలరించిన సింధు మూడు పాయింట్లు నెగ్గి మ్యాచ్‌ను చేజిక్కించుకుంది. మరో మ్యాచ్‌లో పి.సి.తులసీ 19-21, 7-21తో రెండోసీడ్ యిహాన్ వాంగ్ (చైనా) చేతిలో ఓడింది. పురుషుల డబుల్స్‌లో ఆల్విన్ ఫ్రాన్సిస్-అరుణ్ విష్ణు 17-21, 22-24తో మహ్మద్ అసాన్-హెంద్రా సెతివాన్ (ఇండోనేసియా) చేతిలో ఓడారు.

 దిగజారిన సింధు ర్యాంక్
 అంతర్జాతీయ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యుఎఫ్) తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో సింధు 11వ ర్యాంక్‌కు పడిపోయింది. ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్‌లో తొలి రౌండ్‌లోనే ఓడటం ఆమె ర్యాంక్‌పై ప్రభావం చూపింది. సైనా నెహ్వాల్ మాత్రం 8వ ర్యాంక్‌లోనే కొనసాగుతోంది. పురుషుల విభాగంలో పారుపల్లి కశ్యప్ నాలుగు స్థానాలు మెరుగుపర్చుకుని 19వ ర్యాంక్‌లో నిలిచాడు. శ్రీకాంత్‌కు 25వ ర్యాంక్ లభించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement