డివిలియర్స్‌ను స్లెడ్జింగ్‌ చేయలేదు!

Kevin Pietersen interviews Virat Kohli on Instagram - Sakshi

ఆరోగ్య కారణాలతోనే శాకాహారిగా మారా..

కోహ్లి చెప్పిన విశేషాలు

న్యూఢిల్లీ: భారత క్రికెట్‌ జట్టు సారథి విరాట్‌ కోహ్లి లాక్‌డౌన్‌ కారణంగా దొరికిన సమయాన్ని పూర్తిగా ఆస్వాదిస్తున్నారు. దేశవ్యాప్త కర్ఫ్యూ ప్రకటించడానికి కాస్త ముందుగా అతను, తన భార్యతో కలిసి ఒక ఫామ్‌హౌస్‌కు వెళ్లిపోయాడు. ప్రస్తుతం అతను అక్కడే ఉన్నాడు. ఈ నేపథ్యంలో ‘ఇన్‌స్ట్రగామ్‌’లో కోహ్లికి, ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ కెవిన్‌ పీటర్సన్‌కు మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. కేపీ అడిగిన ప్రశ్నలకు కోహ్లి జవాబులిచ్చాడు. కొన్ని విశేషాలు విరాట్‌ మాటల్లోనే...

► నేను, అనుష్క ఒకే చోట ఇంత సమయం ఎప్పుడూ గడపలేదు. అయితే మనం ఏమీ చేయలేం. అంతా బాగుంటే ఈ సమయానికి చిన్నస్వామి స్టేడియంలో ఉండేవాడిని.  
► ఒక్క సారి కూడా బెంగళూరు ఐపీఎల్‌ గెలవలేకపోవడం నిరాశ కలిగించేదే. పెద్ద స్టార్లు ఉండటంతో అందరి దృష్టి జట్టుపైనే ఉండేది. 3 సార్లు ఫైనల్, 3 సార్లు సెమీస్‌ చేరినా టైటిల్‌ గెలవకపోతే వీటికి అర్థం లేదు. అత్యుత్తమ జట్టుతో కూడా టైటిల్‌ సాధ్యం కాలేదు. మేం ఎంత గెలిచేందుకు ప్రయత్నిస్తే అది అంత దూరమైనట్లు అనిపించింది.   
►  భారత్‌ తరఫున ధోనితో, ఐపీఎల్‌లో డివిలియర్స్‌తో జోడిగా మైదానంలో ఆడటాన్ని బాగా ఇష్టపడతా. ఆటలో ఎలాంటి పరిస్థితులు ఉ న్నా నా మిత్రులపై మాత్రం ఆగ్రహం చూపిం చలేను. డివిలియర్స్‌ అలాంటి వాడే. అతనితో నా స్నేహం ఎంతో ప్రత్యేకం. కాబట్టి నా కెరీర్‌ లో ఎప్పుడూ అతడిని స్లెడ్జింగ్‌ చేయలేదు. అసలు కళ్లలో కళ్లు పెట్టి నేరుగా చూడలేదు.
►  2014 ఇంగ్లండ్‌ పర్యటన నా కెరీర్‌లో చేదు జ్ఞాపకం. బాగా ఆడాలని ఎంతగా ప్రయత్నించినా ఘోరంగా విఫలమయ్యాను. నిజాయితీగా చెప్పాలంటే జట్టు కోసం కాకుండా వ్యక్తిగత ప్రదర్శనపై దృష్టి పెట్టి తప్పు చేశా. ఇంగ్లండ్‌ గడ్డపై టెస్టుల్లో బాగా ఆడితే నాకు పేరు ప్రఖ్యాతులు బాగా వచ్చేస్తాయని భావించడంతోనే సమస్య వచ్చింది.   
► 2018 ఇంగ్లండ్‌ సిరీస్‌కు ముందు శాకాహారిగా మారాను. అంతకు ముందు దక్షిణాఫ్రికా సిరీస్‌ సమయంలో నా మెడ భాగంలో వెన్నుముక సమస్యలతో తీవ్రంగా బాధపడ్డా. రాత్రి పడుకోలేకపోయేవాడిని. నా శరీరం ఎక్కువ మొత్తంలో యూరిక్‌ ఆసిడ్‌ విడుదల చేసేది. దాంతో అప్పటికప్పుడు మాంసాహారం మానేసేందుకు సిద్ధమయ్యా.  
► 2008లో ఒక సారి గోల్ఫ్‌ ఆడాను. చక్కటి స్టాన్స్‌తో కవర్‌ మీదుగా సూపర్‌ షాట్‌ ఆడాను. డివిలియర్స్‌ నా వద్దకు వచ్చి బంతి నువ్వే తెచ్చుకోవాలని చెప్పాడు. అంతే...నేను మళ్లీ ఈ ఆట ఆడనని చెప్పేశా.
చివరకు ఈ చర్చలో మధ్యలోకి వచ్చిన అనుష్క శర్మ ‘ఇక చాలు... డిన్నర్‌ టైమ్‌ అయింది’ అంటూ పోస్ట్‌ పెట్టడంతో పీటర్సన్‌ ఈ ఇంటర్వ్యూను ముగించాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top