చాంప్స్‌ కార్తీక్, అపూర్వ | Kartik, Apoorva won under 14 tennis titles | Sakshi
Sakshi News home page

చాంప్స్‌ కార్తీక్, అపూర్వ

Nov 19 2017 10:55 AM | Updated on Nov 19 2017 10:55 AM

Kartik, Apoorva won under 14 tennis titles - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: చాంపియన్‌షిప్‌ సిరీస్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో వడ్డేపల్లి కార్తీక్‌ నీల్, అపూర్వ వేమూరి సత్తా చాటారు. ఆనంద్‌ టెన్నిస్‌ అకాడమీలో జరిగిన ఈ టోర్నీ అండర్‌–14 బాలబాలికల విభాగంలో విజేతలుగా నిలిచి టైటిళ్లను కైవసం చేసుకున్నారు. శనివారం జరిగిన అండర్‌–14 బాలుర ఫైనల్లో కార్తీక్‌ నీల్‌ 6–3, 4–6, 6–2తో రోహన్‌ కావలిపై గెలుపొందగా, బాలికల విభాగంలో అపూర్వ 6–2, 6–1తో ఐరా షా (మహారాష్ట్ర)ను ఓడించింది. డబుల్స్‌ విభాగంలోనూ అపూర్వ జోడి విజేతగా నిలిచింది.

బాలికల డబుల్స్‌ ఫైనల్లో అపూర్వ–అభయ వేమూరి ద్వయం 6–0, 6–1తో మలిష్క (తెలంగాణ)–జ్యోతిష (తమిళనాడు) జంటపై గెలిచి టైటిల్‌ను దక్కించుకుంది. బాలుర డబుల్స్‌ టైటిల్‌ పోరులో కహిర్‌ వరిక్‌ (మహారాష్ట్ర)–సి.ఆర్యంత్‌ (తెలంగాణ) జోడీకి వాకోవర్‌ లభించింది. అండర్‌–12 బాలికల ఫైనల్లో ఐరా (మహారాష్ట్ర) 7–5, 6–1తో సౌమ్య (తెలంగాణ)పై, బాలుర తుదిపోరులో మోహి త్‌ సాయిచరణ్‌ రెడ్డి (తెలంగాణ) 6–3, 4–6, 6–3తో శ్రీశరణ్‌ (తెలంగాణ)పై గెలుపొంది చాంపియన్‌లుగా నిలిచారు.

Advertisement
 
Advertisement
Advertisement