సురేఖ గురి అదిరింది 

Jyothi Surekha Vennam clinch mixed team bronze in Berlin - Sakshi

ప్రపంచకప్‌ ఆర్చరీ టోర్నమెంట్‌లో రజతం, కాంస్యం సొంతం  

ఈ ఏడాది అద్భుతమైన ఫామ్‌లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ ఆర్చర్‌ వెన్నం జ్యోతి సురేఖ తన ఖాతాలో మరో రెండు అంతర్జాతీయ పతకాలను జమ చేసుకుంది. బెర్లిన్‌ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌ స్టేజ్‌–4 టోర్నమెంట్‌లో సురేఖ కచ్చితమైన గురితో ఓ రజతం, ఒక కాంస్యం సాధించింది. కాంపౌండ్‌ టీమ్‌ విభాగంలో త్రిషా దేబ్, ముస్కాన్‌ కిరార్‌లతో కలిసి సురేఖ రజత పతకం సొంతం చేసుకోగా... మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌లో అభిషేక్‌ వర్మ జతగా కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. ఓవరాల్‌గా ఈ ఏడాది జరిగిన నాలుగు ప్రపంచకప్‌ లలో సురేఖ రెండు రజతాలు, నాలుగు కాంస్య పతకాలు సాధించడం విశేషం.   

బెర్లిన్‌ (జర్మనీ): వరుసగా నాలుగో ప్రపంచకప్‌లోనూ భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన జ్యోతి సురేఖ రెండు పతకాలను కొల్లగొట్టింది. శనివారం జరిగిన ప్రపంచకప్‌ స్టేజ్‌–4 టోర్నీలో సురేఖ, త్రిషా దేబ్, ముస్కాన్‌లతో కూడిన భారత మహిళల జట్టు పాయింట్‌ తేడాతో స్వర్ణ పతకాన్ని చేజార్చుకుంది. ఫైనల్లో భారత్‌ 228–229తో సోఫీ డోడ్‌మోంట్, అమెలీ సాన్‌సెనోట్, సాండ్రా హెర్వీలతో కూడిన ఫ్రాన్స్‌ జట్టు చేతిలో పరాజయం పాలై రజత పతకాన్ని దక్కించుకుంది. నాలుగు రౌండ్‌లపాటు జరిగిన ఫైనల్లో ఒక్కో రౌండ్‌లో ఒక్కో జట్టు ఆరేసి బాణాలు సంధించాయి. తొలి రౌండ్‌లో భారత్‌ 59–57తో పైచేయి సాధించగా... రెండో రౌండ్‌లో 57–59తో, మూడో రౌండ్‌లో 53–58తో వెనుకబడిపోయింది.  చివరిదైన నాలుగో రౌండ్‌లో భారత్‌ 59–55తో ఆధిపత్యం చలాయించినా ఓవరాల్‌గా ప్రత్యర్థి స్కోరుకు ఒక పాయింట్‌ దూరంలో ఉండిపోయింది.  

మిక్స్‌డ్‌ టీమ్‌ కాంస్య పతక పోరులో సురేఖ–అభిషేక్‌ వర్మ జంట 156–153తో యాసిమ్‌ బోస్టాన్‌–డెమిర్‌ ఎల్మాగాక్లి (టర్కీ) జోడీపై విజయం సాధించింది. నాలుగు రౌండ్‌లపాటు జరిగిన ఫైనల్లో ఒక్కో రౌండ్‌లో ఒక్కో జోడీ నాలుగేసి బాణాలు సంధించాయి. తొలి రౌండ్‌లో 39–40తో వెనుకబడ్డ సురేఖ–అభిషేక్‌ జంట... రెండో రౌండ్‌లో 40–36తో... మూడో రౌండ్‌లో 40–39తో పైచేయి సాధించింది. 119–115తో నాలుగు పాయింట్ల ఆధిక్యాన్ని సంపాదించింది. నాలుగో రౌండ్‌లో భారత జంట 37–38తో వెనుకబడ్డా ఓవరాల్‌గా మూడు పాయింట్ల తేడాతో విజయాన్ని దక్కించుకుంది. ఇటీవలే ప్రపంచ ర్యాంకింగ్స్‌లో కెరీర్‌ అత్యుత్తమ ర్యాంక్‌ పదో స్థానానికి చేరుకున్న సురేఖ ఈ సీజన్‌లో... షాంఘై ప్రపంచకప్‌ స్టేజ్‌–1 టోర్నీలో మిక్స్‌డ్‌ ఈవెంట్‌లో కాంస్యం... అంటాల్యా ప్రపంచకప్‌ స్టేజ్‌–2 టోర్నీలో టీమ్‌ ఈవెంట్‌లో రజతం, మిక్స్‌డ్‌ ఈవెంట్‌లో కాంస్యం... సాల్ట్‌లేక్‌ సీటీ ప్రపంచకప్‌ స్టేజ్‌–3 టోర్నీ మిక్స్‌డ్‌ ఈవెంట్‌లో కాంస్యం సాధించింది.    

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top