బట్లర్‌ జెర్సీకి రూ. 61 లక్షల 30 వేలు

Jos Buttler raises 65,000 pounds for Covid-19 - Sakshi

లండన్‌: కరోనా మహమ్మారిపై పోరాటానికి తన వంతు సహాయం అందించేందుకు తనకు ఎంతో ఇష్టమైన జెర్సీని గత వారం వేలానికి వేసిన ఇంగ్లండ్‌ వికెట్‌ కీపర్‌ జోస్‌ బట్లర్‌ ప్రయత్నానికి మంచి ఫలితం దక్కింది. మంగళవారంతో వేలం గడువు ముగియగా జెర్సీ 65,100 పౌండ్ల (రూ. 61 లక్షల 30 వేలు) భారీ ధర పలికింది. ప్రపంచకప్‌ ఫైనల్లో బట్లర్‌ ధరించిన ఈ జెర్సీని సొంతం చేసుకునేందుకు మొత్తం 82 బిడ్లు దాఖలు కాగా... ఈ వేలం ద్వారా లభించిన మొత్తాన్ని స్థానిక రాయల్‌ బ్రాంప్టన్, హ్యారీఫీల్డ్‌ ఆసుపత్రుల్లో వైద్య పరికరాల కొనుగోలు కోసం బట్లర్‌ వినియోగించనున్నాడు. ‘ఈ జెర్సీ నాకెంతో ప్రత్యేకం. ఇలా ఒక మంచి కార్యం కోసం ఇది ఉపయోగపడటంతో దీని విలువ మరింత పెరిగింది’ అని బట్లర్‌ పేర్కొన్నాడు. గతేడాది లార్డ్స్‌లో జరిగిన పురుషుల వన్డే ప్రపంచకప్‌ ఫైనల్లో న్యూజిలాండ్‌ జట్టుపై గెలుపొంది ఇంగ్లండ్‌ మొదటిసారిగా విశ్వవిజేతగా నిలిచింది. ఈ మ్యాచ్‌లో తాను ధరించిన, తన సహచరులందరి సంతకాలతో కూడిన చొక్కానే బట్లర్‌ వేలానికి ఉంచాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top