‘అర్జున’కు బుమ్రా, ధావన్‌! | Jasprit Bumrah and Shikhar Dhawan are nominated Arjuna Award | Sakshi
Sakshi News home page

‘అర్జున’కు బుమ్రా, ధావన్‌!

May 14 2020 12:39 AM | Updated on May 14 2020 5:14 AM

Jasprit Bumrah and Shikhar Dhawan are nominated Arjuna Award - Sakshi

జస్‌ప్రీత్‌ బుమ్రా ,శిఖర్‌ ధావన్‌

న్యూఢిల్లీ: భారత స్టార్‌ పేస్‌ బౌలర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా మరోసారి ‘అర్జున’ అవార్డు బరిలో నిలవనున్నాడు. కేంద్ర ప్రభుత్వం అందించే ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు బుమ్రా పేరును బీసీసీఐ నామినేట్‌ చేయనున్నట్లు సమాచారం. 2018లోనే బుమ్రా ఈ అవార్డు బరిలో నిలిచినా... సీనియారిటీ ప్రాతిపదికన రవీంద్ర జడేజా ‘అర్జున’ను కైవసం చేసుకున్నాడు. పురుషుల విభాగంలో ఒకరికంటే ఎక్కువ మంది పేర్లను నామినేట్‌ చేయాలని బీసీసీఐ అధికారులు భావిస్తే బుమ్రాతో పాటు సీనియర్‌ బ్యాట్స్‌మన్‌ శిఖర్‌ ధావన్‌కు ఈ జాబితాలో చోటు దక్కే అవకాశముంది.

రెండేళ్ల క్రితమే శిఖర్‌ ధావన్‌ పేరును బీసీసీఐ సిఫారసు చేసినప్పటికీ అవార్డుల కమిటీ మహిళల విభాగంలో స్మృతి మంధానకు మాత్రమే ఈ గౌరవాన్ని అందించింది. భారత్‌ తరఫున నాలుగేళ్లుగా అద్భుత ప్రదర్శన కనబరుస్తోన్న 26 ఏళ్ల బుమ్రా 14 టెస్టుల్లో 68 వికెట్లు, 64 వన్డేల్లో 104 వికెట్లు, 50 టి20ల్లో 59 వికెట్లు పడగొట్టాడు. ‘బుమ్రా కచ్చితంగా ఈ అవార్డుకు అర్హుడు. అతను ఐసీసీ నంబర్‌వన్‌ బౌలర్‌గానూ నిలిచాడు. దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌ గడ్డలపై ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు దక్కించుకున్న ఏకైక ఆసియా బౌలర్‌’ అని అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. మహిళల విభాగానికొస్తే ఆల్‌రౌండర్‌ దీప్తి శర్మ, పేసర్‌ శిఖా పాండే పేర్లను బోర్డు పరిశీలించే అవకాశముంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement