అనూహ్య పరాజయం

 Ireland women rock India's Hockey World Cup hopes - Sakshi

ప్రపంచ 16వ ర్యాంకర్‌ 

ఐర్లాండ్‌ చేతిలో ఓడిన భారత్‌ 

నాకౌట్‌ అవకాశాలు సంక్లిష్టం 

మహిళల హాకీ ప్రపంచకప్‌ 

లండన్‌: మహిళల ప్రపంచకప్‌ హాకీ టోర్నమెంట్‌లో తొలి విజయం నమోదు చేయాలనుకున్న భారత జట్టుకు నిరాశే ఎదురైంది. పూల్‌ ‘బి’లో భాగంగా గురువారం జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 0–1తో బలహీన ఐర్లాండ్‌ చేతిలో ఓటమి పాలై నాకౌట్‌ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఐర్లాండ్‌ తరఫున 13వ నిమిషంలో అనా ఫ్లానగన్‌ పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచింది.  తొలి మ్యాచ్‌లో రియో ఒలింపిక్స్‌ చాంపియన్‌ ఇంగ్లండ్‌ను ఓడించినంత పని చేసి చివరకు ‘డ్రా’తో సరిపెట్టుకున్న రాణి రాంపాల్‌ బృందం రెండో మ్యాచ్‌లో అనూహ్యంగా చతికిలబడింది. ప్రపంచ 16వ ర్యాంకర్‌ ఐర్లాండ్‌ను తక్కువ అంచనా వేసిన భారత్‌ అందుకు తగిన మూల్యం చెల్లించుకుంది. లీగ్‌ దశలో వరుసగా రెండు విజయాలు సాధించిన ఐర్లాండ్‌ 6 పాయింట్లతో గ్రూప్‌ ‘బి’లో అగ్రస్థానంతో నాకౌట్‌ బెర్త్‌ ఖాయం చేసుకుంది. ఇంగ్లండ్‌ (2 పాయింట్లు) రెండో స్థానంలో... భారత్, అమెరికా ఒక్కో పాయింట్‌తో ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఐర్లాండ్‌ చేతిలో భారత్‌కు ఇది వరుసగా రెండో ఓటమి. గతేడాది జొహన్నెస్‌బర్గ్‌లో జరిగిన హాకీ వరల్డ్‌ లీగ్‌ సెమీఫైనల్లోనూ భారత్‌ 1–2తో ఐర్లాండ్‌ చేతిలో పరాజయం పాలైంది. ఆదివారం జరుగనున్న చివరి లీగ్‌ మ్యాచ్‌లో అమెరికాతో భారత్‌ తలపడనుంది.   

ఏడు పెనాల్టీలు వృథా: మ్యాచ్‌ ప్రారంభం నుంచి దూకుడే మంత్రంగా ఆడిన ఐర్లాండ్‌ చివరి వరకు అదే తీవ్రత కొనసాగించి భారత్‌కు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. ఆరంభ పోరులో ప్రపంచ ఏడో ర్యాంకర్‌ అమెరికాను చిత్తుచేసిన ఐర్లాండ్‌ ఈ మ్యాచ్‌లోనూ ఆసాంతం ఆకట్టుకుంది. మ్యాచ్‌లో భారత్‌కు ఏడు పెనాల్టీ కార్నర్‌ అవకాశాలు లభించగా వాటిలో ఏ ఒక్కదాన్ని గోల్‌గా మలచలేకపోయింది. ఫీల్డ్‌ గోల్స్‌ అవకాశాలు వచ్చినా ఫినిషింగ్‌ లోపంతో వాటిని వృథా చేసుకుంది. రెండో క్వార్టర్‌ చివరి నిమిషంలో భారత స్ట్రయికర్‌ లీలిమ మింజ్‌ సునాయాస అవకాశాన్ని చేజార్చింది. ‘డి’ ఏరియాలో అందిన పాస్‌ను నేరుగా గోల్‌కీపర్‌ చేతుల్లోకి కొట్టి నిరాశపరిచింది. 37వ నిమిషంలో వచ్చిన నాలుగో పెనాల్టీ కార్నర్‌ను గుర్జీత్‌ కౌర్‌ అద్భుతంగా కొట్టినా ఐరిష్‌ గోల్‌కీపర్‌ కుడివైపుకు దూకుతూ అంతే అద్భుతంగా అడ్డుకుంది. మ్యాచ్‌ ముగియడానికి మ రో ఆరు నిమిషాల ముందు స్కోరు సమం చేయడానికి భారత్‌కు మరో అవకాశం వచ్చినా కెప్టెన్‌ రాణి రాంపాల్‌ దాన్ని గోల్‌గా మలచలేకపోవడంతో భారత్‌ ఓటమి ఖాయమైంది.   

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top